ఆ శాఖకు ఒకే ఒక్కడు..! 

5 Oct, 2019 08:35 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : జిల్లా మైనార్టీ సంక్షేమశాఖకు ఏడాదిన్నరగా రెగ్యులర్‌ అధికారి కరువయ్యారు. కీలకమైన జిల్లా అధికారి పోస్టును రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో ఏడాదిన్నరగా ఇన్‌చార్జి అధికారుల పాలన సాగుతోంది. ప్రస్తుతం మైనారిటీ సంక్షేమశాఖ ఇన్‌చార్జి అధికారిగా కొనసాగుతున్న పవన్‌కుమార్‌కు అదనంగా మెప్మా పీడీగా, బీసీ సంక్షేమశాఖ అధికారిగా కొనసాగుతున్నారు. నిన్నటి వరకు సైనిక సంక్షేమశాఖ అధికారిగా సైతం విధులు నిర్వహించారు. ప్రస్తుతం మూడుశాఖలు ప్రధానమైనవే కావడంతో పనిభారం పెరిగి పనుల్లో జాప్యం జరుగుతోంది.

ఇలా ఒక్క మైనార్టీ సంక్షేమ శాఖ కాదు అన్ని శాఖలకు పూర్తిస్తాయి సిబ్బంది, అధికారులు లేకపోవడంతో ఒత్తిడికి గురై అదనపు భారాన్ని మోయలేక బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. ఇటు శాఖ పర కార్యక్రమాలు, పథకాల అమలుపై కొంత ప్రభావం కనిపిస్తోంది. జిల్లా మైనార్టీ  సంక్షేమ శాఖకు రెగ్యులర్‌ అధికారిగా మహ్మద్‌ షఫీయొద్దీన్‌ 2018 ఏప్రిల్‌ వరకు పనిచేసి  హైదరాబాద్‌ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయానికి బదిలీ అయ్యారు.  

ప్రభుత్వం మరో అధికారిని జిల్లాకు పంపకపోవడంతో కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ మెప్మా పీడీగా కొనసాగుతున్న పవన్‌కుమార్‌ను ఇన్‌చార్జిగా నియమించారు. 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్వయం ఉపాధి రుణాల కోసం 340 మందికిపైగా దరఖాస్తులు చేసుకోగా కేవలం 42 మందికి రూ. 50 వేల చొప్పున చెక్కులు ఇచ్చిన చేతులు దులుపుకున్నారు. ఇలా మూడేళ్లుగా మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి దరఖాస్తులు తీసుకోవడం మినహా రుణాలు అందజేసిన దాఖాలాలు లేవని మైనార్టీ వర్గాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

రెగ్యులర్‌ అధికారి ఉంటేనే పాలనపై పట్టు.... 
ఏ శాఖకైనా రెగ్యులర్‌ జిల్లా అధికారి ఉంటేనే పరిపాలన సవ్యంగా జరుగుతుంది. ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు సులువుగా ఉంటుంది. కానీ మైనార్టీ సంక్షేమ శాఖకు 2018 మే నుంచి రెగ్యులర్‌ అధికారి లేకపోవడం మైనార్టీ ప్రజలకు లోటుగానే మారిందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ శాఖ ద్వారా జిల్లాలో మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు కొనసాగుతున్నాయి. వాటి పర్యవేక్షణకు రెగ్యులర్‌ అధికారి అవసరం.

కాగా సంక్షేమ పథకాలైన సబ్సిడీ రుణాలు, వాటి గ్రౌండింగ్‌ , విద్యార్థులకు ఉపకార వేతనాల మంజూరు, తదితర కార్యక్రమాల పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ప్రజావాణిలో కూడా మైనార్టీ సంఘాల చాలాసార్లు రెగ్యులర్‌ అధికారిని నియమించాలని కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశాయి. వాటిని ప్రభుత్వానికి పంపుతున్నా మైనార్టీ శాఖకు రెగ్యులర్‌ అధికారిని నియమించడం లేదు. 

మరిన్ని వార్తలు