‘వెలుగు’ వెల్లకిలా..! 

15 Feb, 2019 10:20 IST|Sakshi

జిల్లాలో విజయవంతంకాని ‘కంటి వెలుగు’

క్షేత్రస్థాయిలో పరీక్షలు నిర్వహించని సిబ్బంది

రాష్ట్రంలోనే వెనుకబడిన ఖమ్మం జిల్లా 

వైఫల్యంపై వైద్య, ఆరోగ్య కమిషనర్‌ ఆగ్రహం 

అధికారుల నిర్లక్ష్యం.. సిబ్బంది పనితీరు కంటి వెలుగు కార్యక్రమాన్ని అభాసుపాలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే అయినప్పటికీ లక్ష్యం మేరకు కంటి పరీక్షలు చేయడంలో ఇక్కడి అధికారులు, సిబ్బంది విఫలమయ్యారు. దీంతో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా కంటి వెలుగులో వెనుకబడిపోయిందనే అపవాదును మూటగట్టుకుంది. దీనిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తలెత్తుకోలేని పరిస్థితి నెలకొంది.  
ఖమ్మంవైద్యవిభాగం 

కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభంలో ఉధృతంగా సాగింది. ఆ తర్వాత క్రమక్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోయింది. సీఎం కేసీఆర్‌ ఆలోచనలో పుట్టిన కార్యక్రమాన్ని కార్యరూపంలోకి తెచ్చేందుకు గత ఏడాది ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యతో బాధపడొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని చేపట్టి.. ప్రజల చెంతకు చేర్చింది. గ్రామస్థాయి నుంచి శిబిరాలు నిర్వహించి.. ప్రతి ఒక్కరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతోపాటు సమస్యలు ఉన్నవారికి ఉచితంగా మందులు అందించడం.. కళ్లద్దాలు అవసరం ఉన్నవారికి అందజేయడంతోపాటు శస్త్ర చికిత్సలు అవసరం ఉన్న వారిని నిర్దేశించిన ఆస్పత్రులకు పంపించి ఆపరేషన్లు నిర్వహించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కార్యక్రమ నిర్వహణలో జిల్లాకు చెడ్డపేరొచ్చింది. పూర్తిస్థాయిలో కంటి వెలుగు విజయవంతం కాకపోగా.. రాష్ట్రంలోనే అన్ని జిల్లాలతో పోల్చితే ఖమ్మం జిల్లా చాలా వెనుకబడిపోయింది.  

సగం కూడా పూర్తికాలే.. 
రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించే ముందు నాలుగు నెలల్లో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు పూర్తి చేస్తామని ప్రకటించింది. మళ్లీ ఆ  కార్యక్రమాన్ని 6నెలలకు పొడిగించింది. జిల్లాలో కంటివెలుగు కార్యక్ర మం నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు 32 వైద్యబృందాలను ఏర్పాటు చేశారు. షెడ్యూల్‌ ప్రకారం జిల్లా అంతటా ఒకేసారి అన్ని బృందాలతో కంటి శిబిరాలు ఏర్పాటు చేశారు. కానీ.. ప్రారంభంలో కొంతమేర  పరీక్షలు చేయడంలో మెరుగ్గా ఉన్నా.. ఆ తర్వాత క్రమంలో పరీక్షలు మందగించాయి. జిల్లావ్యాప్తంగా 14,39,000 జనాభా ఉండగా.. ఖమ్మం నగరం లో 3,20,000 మంది ఉన్నారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. దీనినిబట్టి కనీసం 10లక్షల మందికి పరీక్షలు చేయాల్సి ఉండగా.. సగం కూడా పరీక్షలు పూర్తి చేయలేదనే అపవాదొచ్చింది. పరీక్షల నిర్వహణకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించినా.. జిల్లాలో ఎందుకు విఫలమైం దనేది ఉన్నతాధికారులకు అంతుపట్టకుండా ఉంది. దీనిపై ఉన్నతాధికారులు.. ఇక్కడి అధికారులపై ఆగ్ర హం వ్యక్తంచేశారు. పరీక్షలు నిర్వహించడంలో ఎందుకు విఫలమయ్యారో తెలియజేయాలని ఆదేశాలిచ్చారు.

క్షేత్రస్థాయిలో వైఫల్యం 
కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడానికి కొందరు సిబ్బంది అత్యుత్సాహమే కారణమని తెలుస్తోంది. ప్రణాళిక ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహించకపోవడం వల్లే వెనుకబడటానికి కారణమని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో అంతంతమాత్రంగా నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం వల్ల అపవాదు వస్తుందని కొందరు సిబ్బంది గణాంకాలు కూడా మార్చినట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా నాలుగు నెలల్లో కార్యక్రమం పూర్తి కావాల్సి ఉండగా.. మరో రెండు నెలలు సమయం ఇచ్చినా కార్యక్రమ నిర్వహణలో ముందుకెళ్లలేకపోయింది. జిల్లాలో 10లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. ఇప్పటివరకు 6లక్షల మందికి మాత్రమే పరీక్షలు చేశారు. అయితే ఆ లెక్కలు కూడా తప్పుడువనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 50వేల మందికిపైగా దృష్టి లోపం ఉన్న వారు ఉన్నట్లు గుర్తించారు. వారికి కళ్లద్దాలు ఎప్పుడు అందుతాయో తెలియని పరిస్థితి. చాలా మంది పరీక్షల్లో దృష్టి లోపం ఉన్న వారు కళ్లద్దాలు ఎప్పుడు వస్తాయోనని శిబిరాల చూట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రీడింగ్‌ గ్లాసులు మాత్రమే ఇచ్చి.. దృష్టి లోపం గ్లాసులు అందించడంలో విఫలం కావడంతో కార్యక్రమంపై చాలా మంది పెదవి విరుస్తున్నారు.  

నేటితో ముగింపు 
ఆరు నెలలపాటు కొనసాగిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో శుక్రవారంతో ముగియనుంది. 22 పీహెచ్‌సీలు, 3 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, 3 అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల పరిధిలో కార్యక్రమం కొనసాగుతోంది. శుక్రవారంతో ముగియనుండడంతో అధికారులు ఈ ఒక్కరోజు శిబిరాలు నిర్వహించి బృందాలను వెనక్కి రమ్మని ఆదేశాలిచ్చారు. దీంతో ఆరు నెలలపాటు శిబిరాల్లో పాల్గొన్న బృందాల్లో పనిచేస్తున్న డాక్టర్లు, ఇతర సిబ్బంది ఊపిరి పీల్చుకోనున్నారు. మొత్తం 32 బృందాల్లో సుమారు 300 మంది సిబ్బంది వారివారి విధుల్లో చేరనున్నారు. మొత్తానికి కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో మసకబారడంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖకు కొంతమేర చెడ్డపేరు మూటగట్టుకుందనే అపవాదు మిగిలింది.

మరిన్ని వార్తలు