హామీలపై నిలదీయండి

10 May, 2015 01:14 IST|Sakshi

-  సామాజిక తెలంగాణ ఇదేనా..?
- ఇంటికో ఉద్యోగం ఏదీ?
- అల్లుడొచ్చి 11 నెలలైంది.. ఇల్లు ఎక్కడ?
- టీఆర్‌ఎస్‌పై మాజీ ఉప ముఖ్యమంత్రి ఫైర్
పుల్‌కల్:
ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా ప్రశ్నించారు. శనివారం మండల పరిధిలోని శివ్వంపేట, అంగడ్‌పేట గ్రామాలను సందర్శించారు. అనంతరం నవయుగ యూత్ 15వ వార్సికోత్సవంలో దామోదర మాట్లాడుతూ.. ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చి అమాయక ఓటర్లను నమ్మించి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ హామీలను విస్మరించిందన్నారు.

తాము అధికారంలోకి వస్తే నిరుపేదలు ఇరుకు ఇండ్లల్లో ఉంటున్నారని.. పండుగకు అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలో తెలియదని అందుకోసం టీఆర్‌ఎస్ నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి 11 నెలలైంది. అల్లుడు ఎక్కడ పడుకోవాలని సీఎం చెప్పాలని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకున్నా ఆయన ఇంట్లో మాత్రం నలుగురికి ఉద్యోగాలు సంపాదించుకున్నాడని విమర్శించారు.    ఎన్నికల్లో ఇచ్చే హామీలపై ఆలోచింప చేసే బాధ్యత యువతపై ఉందన్నారు. రెండు రోజుల క్రితం పార్టీ మారిన నాయకునికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే యువకులు గెలిపించారన్నారు.

తాను ఈ నియోజవర్గ ప్రజలు ఊహించని విధంగా దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద విశ్వవిద్యాలయాన్ని తీసుకొచ్చానన్నారు. ఫలితంగా రూ.1400 కోట్లతో భవ నాలు నిర్మాణం కావడంతో ఈ ప్రాంత రూపురేకలు మారిపోయాయని భూముల రేటు పెరిగిందన్నారు. జేఎన్‌టీయూ కావాలని ఎవరూ అడగలేదు? వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల కావాలని, మహిళా పాలిటెక్నిక్ కళాశాల కావాలని అడుగకుండానే నియోజకవర్గ అభివృద్ధి కోరి తీసుకొచ్చానని తెలిపారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శివ్వంపేట నుంచి వెంకటకిష్టాపూర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీబీ డెరైక్టర్ రాంచెంద్రారెడ్డి, మాజీ జె డ్పీటీసీ మ ల్లప్ప, పార్టీ మండల అధ్యక్షుడు దుర్గారెడ్డి, నవయుగ యూత్ జిల్లా అధ్యక్షుడు సదానందం, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు  పాల్గొన్నారు.

కాంగ్రెస్ నాయకునికి పరామర్శ...
మండల పరిధిలోని మిన్‌పూర్ మాజీ సర్పంచ్ పాండును దామోదర రాజనర్సింహా పరామర్శించారు. శనివారం మండల పర్యటనకు వచ్చిన ఆయన మండల కాంగ్రెస్‌నాయకుడు, మిన్‌పూర్ మాజీ సర్పంచ్ పాండు కుమారుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.

మరిన్ని వార్తలు