డెడ్‌లైన్‌ @ మే15

19 Feb, 2020 10:45 IST|Sakshi
అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ లోకేష్‌కుమార్‌

ఆపై రోడ్ల తవ్వకాలు కుదరదు

పనులు పూర్తయ్యాక48 గంటల్లోగా తవ్వినరోడ్ల పునరుద్ధరణ

వివిధ ప్రభుత్వ శాఖల అవసరాలకు సీసీ కెమెరాల వినియోగం

జీహెచ్‌ఎంసీ, పోలీసుఅధికారుల సమావేశంలో నిర్ణయం

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మే 15 తర్వాత రోడ్డు కటింగ్‌లకు అనుమతులివ్వరాదని, సీసీటీవీల ఏర్పాటుతోపాటు ఆయా అవసరాల కోసం రోడ్డు కటింగ్‌ చేసి పనులు పూర్తయ్యాక 48 గంటల్లోగా తిరిగి పునరుద్ధరణ జరగాలని, జంక్షన్లలో ఆయా అవసరాల కోసం వివిధ శాఖలు వేర్వేరు పోల్స్‌ నిర్మించకుండా అందుబాటులోని పోల్స్‌ను సమష్టిగా వినియోగించుకోవాలని జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారుల సమావేశం నిర్ణయించింది. సేఫ్‌ సిటీ ప్రాజెక్ట్‌కు హైదరాబాద్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడంతోపాటు  పాటు సీఆర్‌ఎంపీ కింద రోడ్ల నిర్వహణ ప్రాజెక్ట్‌ను పైలట్‌గా నిర్వహిస్తున్నందున వీటిపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్, లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ డీజీపీ జితేందర్‌లఆధ్వర్యంలో సీఆర్‌ఎంపీ ఏజెన్సీలు, సీసీటీవీలు ఏర్పాటు చేస్తున్న ఎల్‌అండ్‌టీ, జియో సంస్థల ప్రతినిధులతో జీహెచ్‌ఎంసీలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్‌కుమార్‌ మాట్లాడుతూ, పోలీసు, జోనల్‌ కమిషనర్లు, ఏజెన్సీల ప్రతినిధులు జోనల్‌ స్థాయిలో చర్చించుకొని రోడ్‌ కటింగ్‌ పనులను వెంటనే చేపట్టి త్వరితంగా పూర్తిచేయాలన్నారు. స్మార్ట్‌ సిటీ కింద జంక్షన్లలో సీసీటీవీల ఏర్పాటుకు ఎల్‌అండ్‌టీ సంస్థ మూడు దశల్లో రోడ్‌ కటింగ్‌లకు 2662 జంక్షన్లలో దరఖాస్తు చేసుకోగా, 2557 చోట్ల అనుమతులిచ్చామన్నారు.

ఇది 59 కి.మీ.ల మేర ఉందన్నారు. నెట్‌వర్క్‌ ఏర్పాటు కోసం రిలయన్స్‌ జియో 1077 జంక్షన్లలో మైక్రో కట్టింగ్‌కు అనుమతులు కోరితే మొదటి విడతగా దరఖాస్తు చేసిన 493 చోట్ల దాదాపు 26 మీటర్ల కటింగ్‌కు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు.  ఓపెన్‌ ట్రెంచింగ్‌ కంటే వీలైనంత మేర మైక్రో ట్రెంచింగ్‌ చేసుకోవాలన్నారు. రిలయెన్స్‌  జియో ఏజెన్సీ సీసీ  కెమెరాల కోసం  5280 పోల్స్‌ ఏర్పాటుకు 221 మీటర్ల  పొడవున రోడ్‌ కటింగ్‌కు  అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు.  రోడ్‌ కటింగ్‌ ప్రాంతాల్లో  శిథిలాలను తొలగించాల్సిన బాధ్యత ఏర్పాటు సంస్థలదేనని స్పష్టం చేశారు. జితేందర్‌ మాట్లాడుతూ, నగరంలోని పదివేల సీసీకెమెరాలనుకమాండ్‌ కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానించనున్నట్లు తెలిపారు.కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌నుంచి ట్రాఫిక్‌ పరిస్థితుల్ని పర్యవేక్షిస్తామని, జలమండలి, విద్యుత్‌ వంటి విభాగాలు కూడా తమ అవసరాల కోసం వాటిని వినియోగించుకోవచ్చునన్నారు. నిర్భయ కింద మరో 3వేల సీసీకెమెరాలు మంజూరయ్యాయన్నారు.అన్ని రకాల పార్కింగ్‌లకు కలిపి ఇంటిగ్రేటెడ్‌ పార్కింగ్‌ సిస్టం, డార్క్‌స్పాట్స్‌ రిపేర్లు, వీధివ్యాపారులకు లొకేషన్ల లింక్‌తో గుర్తింపుకార్డుల జారీ, తదితర అంశాల గురించి చర్చించారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌ జియాఉద్దీన్,  సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్, రాచకొండ అడిషనల్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు, సైబరాబాద్‌  ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ ఎల్‌.ఎస్‌.చౌహాన్, రాచకొండ ట్రాఫిక్‌ డీసీపీ  దివ్యచరణ్, జీహెచ్‌ఎంసీ  జోనల్‌ కమిషనర్లు ఎన్‌.రవికిరణ్, వి.మమత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు