కన్నీరే మిగులుతోంది.!

3 Dec, 2019 07:52 IST|Sakshi

పడవ ప్రమాదాలతో గుణపాఠమెప్పుడు.?

పరిమితికి మించి.. ప్రాణాలు పణంగా పెట్టి

‘ప్రాణహిత’లో తరచూ ప్రమాదాలు

సాక్షి, చింతలమానెపల్లి(సిర్పూర్‌) : గమ్యం చేరే వరకూ భరోసా లేని పడవ ప్రయాణాలు విషాద రాత రాస్తున్నాయి. గత్యంతరం లేక ప్రాణాలను పణంగా పెట్టి చేపడుతున్న పడవల ప్రయాణం ఇంకో మార్గానికి చేర్చుతున్నాయి. పడవ ప్రమాదాలు చోటుచేసుకుని కళ్ల ముందే ప్రాణాలు కోల్పోతుండగా, మృతుల కుటుంబ సభ్యులకు తీరని వేదనను మిగుల్చుతోంది. పూట గడవడానికి పడవ నడుపుతున్న వారి నిర్లక్ష్యం మూలానికి ప్రయాణికుల ప్రాణాలు నీటిలో కలుస్తున్నాయి. జిల్లాలోని ప్రాణహిత నదీ మీద నిత్యం పడవ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా అధికార యంత్రాంగం గుణపాఠం నేర్వడం లేదు. దీంతో విషాద సంఘటనలు పునరావృతమవుతున్నాయి. 

జిల్లాలోని సిర్పూర్, కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, దహెగాం మండలాల సరిహద్దుల్లో తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దుగా పెన్‌గంగా, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నాయి. ఇరు ప్రాంతాల మధ్య ఉన్న సంబంధాలు, వ్యాపార, ఇతర అవసరాల రీత్యా నిత్యం ప్రజలు రాకపోకలు సాగి స్తుంటారు. నదులపై వంతెనలు లేకపోవడంతో రేవుల నుంచి నాటు పడవల్లో గట్టు దాటాల్సి వస్తోంది. కౌటాల మండలంలోని వీరవెల్లి, విర్దండి, గుండాయిపేట, తుమ్మిడిహెట్టి, రణవెల్లి, చింతలమానెపల్లి మండలంలోని చిత్తామ, గూడెం, బెజ్జూర్‌ మండలంలోని తలాయి, సోమిని, దహెగాం మండలంలోని మొట్లగూడెం ఓడరేవుల నుంచి భారీ సంఖ్యలో ప్రయాణికులు వెళ్తుంటారు. చింతలమానెపల్లి మండలం లోని చిత్తామ, గూడెం వద్ద మహారాష్ట్రలోని అహేరి, ఆళ్ళపల్లి, ఏటపల్లి, సిరోంచ, సహా చత్తీస్‌ఘడ్‌లోని పలు ప్రాంతాలకు భారీ రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు మార్గం కంటే పడవల్లో నదిని దాటితే దూరం తక్కువగా ఉండడంతో ప్రయాణికులు అందుకే చూపుతున్నారు.

ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం..
నాటు పడవల నిర్వహకులు ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చాల్సి ఉండగా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నాటు పడవలను నడిపేవారు సంబంధిత అధికారుల నుంచి లైసెన్సు పొందాల్సి ఉంటుంది. లైసెన్సు, అనుభవం లేని వారు నడుపుతుండడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పడవలను నాసిరకంగా తయారు చేయడంతో ప్రయాణ సమయంలో పడవలోకి నీళ్లు చేరుతున్నాయి. పడవలకు రంధ్రాలు పడ్డప్పుడు వాటికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా నామమాత్రపు మరమ్మతులు నిర్వహించి నడుపుతున్నారు. పడవల్లోకి చేరితో నీటిని బకెట్లతో తోడుతుంటారు. ఈ క్రమంలో నీళ్లు అధికమై పడవలు మునిగిపోతున్నాయి. ఆదివారం బీట్‌ ఆఫీసర్ల ప్రమాదంలోనూ ఇదే జరిగింది. 

వంతెనలు లేక ఇబ్బందులు..
మహారాష్ట్ర– తెలంగాణ సరిహద్దుల్లో ఇరు రాష్ట్రాల ప్రజలకు సంబంధాలున్నాయి. ఈనేపథ్యంలో రవాణా మార్గాలుగా ఇరు ప్రాంతాలకు వెళ్లేందుకు నదిలో నాటు పడవలను ఆశ్రయిస్తారు. చింతలమానెపల్లి మండలంలోని గూడెం వద్ద వంతెన నిర్మాణంలో ఉండగా ప్రస్తుతం 70 శాతం పనులు పూర్తయ్యాయి. కౌటాల మండలంలోని గుండాయిపేట వద్ద పెన్‌గంగా నదిపై వంతెనకు ప్రతిపాదనలు పూర్తయినట్లు అధికారులు తెలుపుతున్నారు. వంతెనల నిర్మాణం పూర్తయితే ప్రజలకు ఇబ్బందులు దూరంకానున్నాయి. వంతెనలు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పడవల్లో ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈక్రమంలో ఏమాత్రం వరద ఎక్కువగా ఉన్నా, నడిపే వారు అజాగ్రత్తగా ఉన్నా జరగరానిది జరిగిపోతుంది.

అనుమతులు లేకుండానే..
నదులపై లేదా ఇతర నీటి ప్రవాహ ప్రాంతాల్లో ప్రయాణికులను తరలించేందుకు పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అనుమతులు తప్పనిసరి. దీంతో పాటు ఏటా నిర్ణీత కాలవ్యవధిలో రెన్యూవల్‌ ఉంటుంది. ఆయా సమయాల్లో పోలీసులు, ఇతర శాఖలు తనిఖీలు చేపట్టాల్సి ఉంటుంది. కాని సరిహద్దులో ఉన్న ప్రాణహిత నదిలో ప్రయాణికులను తరలించేందుకు ఎలాంటి అనుమతులు లేవు. కేవలం చేపలు పెంచడానికి అనుమతులు పొందిన వారే ప్రయాణికులను తరలిస్తున్నారు. ఈ క్రమంలో పరిమితికి మించి చేరవేస్తున్నారు. ఇలా పరిమితికి మించి ప్రయాణికులను చేరవేస్తుండడంతో వర్షాకాలంలో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈఏడాదిలో ప్రాణహిత నదిలో నలుగురు మృత్యువాత పడడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఉన్నతాధికారుల వైఫల్యాన్ని తాజా ఘటన ఎత్తి చూపడంతో పాటు గుణపాఠం నేర్చుకోవాలి్సన అవసరాన్ని నొక్కి చెబుతోంది.

ఈ ఏడాది జరిగిన ప్రమాదాలు..
1. ఫిబ్రవరి 16న కాగజ్‌నగర్‌కు చెందిన ఫొటోగ్రాఫర్‌ పోరెడ్డి దినకర్‌రెడ్డి, అతని మామ బాపిరెడ్డి నదిలో నీటి ప్రవాహంలో పడి మృతిచెందారు.
2. 23 మే 2016న మంచిర్యాలకు చెందిన వెంకటేశ్, రాజు, మమత కౌటాల మండలం తుమ్మిడిహేటి వద్ద పడవ మునగడంతో మృతిచెందారు.
3. కౌటాల మండలంలోని వీరవెల్లి వద్ద 2011 ఏప్రిల్‌ 24న పడవ మునగడంతో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు.
4. గతేడాది గూడెం వద్ద నదిని దాటుతున్న ప్రయాణికుల పడవ మధ్యలో ఆగిపోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండాల్సి వచ్చి ంది. ప్రయాణికులను తీసుకెళ్లేందుకు వచ్చిన పడవ సైతం చెడిపోవడంతో మరో పడవను ఆశ్రయించారు. ఇలా పడవలు చెడిపోయి ఇబ్బ ందులకు గురైన సంఘటనలు అనేకం ఉన్నా యి. బీట్‌ ఆఫీసర్ల మరణమే ఆఖరు అయ్యేలా, మరో ప్రమాదం చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా