బలైపోతున్న కార్మికులు

5 Oct, 2019 08:30 IST|Sakshi
ఓ పరిశ్రమలో రక్షణ పరికరాలు లేకుండా విధులు నిర్వహిస్తున్న కార్మికులు

సాక్షి, కొత్తూరు: కార్మికుల భద్రత కోసం ఎన్నో చట్టాలు ఉన్నా ఎక్కడా సరిగా అమలు కావడం లేదు. అధికారులు పర్యవేక్షణ లేమి నిర్వాహకులకు వరంగా మారింది. ఎప్పుడైనా ప్రమాదాలు జరిగితే నామమాత్రపు పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక కొన్ని పరిశ్రమల్లో ఏమాత్రం అనుభవం లేని కార్మికులతో పనులు చేయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రమాదాలు జరగడం, కార్మికులు మృత్యుఒడికి చేరడం సాధారణ విషయంగా మారిపోయింది. తమ ప్రాంతంలో సరైన ఉపాధి లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు కొత్తూరు పారిశ్రామిక వాడలో పనిచేసేందుకు వస్తున్నారు.

పొట్టకూటి కోసం వస్తున్న వారు తరచూ ప్రమాదాలు జరగడంతో ఇక్కడే బలైపోతూ సొంత ప్రాంతాలకు విగతజీవులుగా వెళ్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. కాంట్రాక్టర్లు, పరిశ్రమల యాజమాన్యాలు ఇక్కడ ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నచందంగా మారింది. పరిశ్రమల్లో తరచూ తనిఖీలు చేసి కార్మికుల భద్రత కోసం చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు ఎక్కడా కనిపించడం లేదు. జిల్లాలోని కొత్తూరు, నందిగామ మండలాల్లో ఐరన్, స్పాంజ్‌ ఇనుము పరిశ్రమలు పదులసంఖ్యలో ఉన్నాయి. ఇతర కంపెనీలు కూడా ఉన్నాయి.

భద్రత ఎండమావే..   
ముఖ్యంగా ఐరన్, స్పాంజ్‌ ఇనుము పరిశ్రమల నిర్వాహకులు కార్మికుల కోసం కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. యంత్రాల వద్ద పనిచేసే కార్మికులకు రక్షణ పరికరాలను సైతం సమకూర్చడం లేదు. అనుభవం ఉన్న కార్మికులను విధుల్లో పెట్టుకుంటే ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తుందనే దురుద్దేశంతో ఏమాత్రం అనుభవం లేని కార్మికులను పనలో పెట్టుకోవడంతో ప్రమాదాలు జరిగి చనిపోతున్నారు. కార్మికులకు రక్షణ పరికరాలను ఇవ్వకపోవడం, యంత్రాల పనితీరుపై అవగాహన లేకపోవడం, ప్రమాదాలు సంభవిస్తే తప్పించుకునే జాగ్రత్తలు తెలియక చిన్నచిన్న ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. కొన్ని ఘటనల్లో కార్మికులు మృత్యువాత పడుతున్నాయి. ప్రమాదాలు జరిగినా సంబంధిత కంపెనీల నిర్వాహకులు ఏమాత్రం బయటకు పొక్కనివ్వడం లేదు.

ఎంతోకొంత బాధితులకు పరిహారం ముట్టజెప్పి చేతులెత్తేస్తున్నారు. విషయం వెలుగులోకి రాకుండా మిగతా కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నిబంధనల ప్రకా రం ప్రతి పరిశ్రమలో భద్రతా అధికారి (సెఫ్టీ ఆఫీసర్‌) నిత్యం కార్మికులకు భద్రతపై అవగాహన కల్పించాలి. అనుకోకుండా ప్రమాదాలు సంభవిస్తే ఎలా వ్యవహరించాలి.. ప్రమాదాలను ఎలా నివారించాలి అనే అంశాలపై తర చూ ప్రదర్శనలు(మాక్‌ డ్రిల్‌) నిర్వహించాలి. అంతేకాకుండా యంత్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రతి కార్మికుడు తప్పకుండా రక్షణ పరికరాలను వినియోగించే విధం గా చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. ఎక్కడా అమ లు కావడం లేదు. ఇక్కడి పారిశ్రామికవాడలో పదుల సంఖ్యలో కంపెనీలు ఉన్నా రెండుమూడు పరిశ్రమల్లోనే సెఫ్టీ ఆఫీసర్లు ఉన్నారు.

అధికారుల పర్యవేక్షణ కరువు  
ఐరన్‌ పరిశ్రమల్లో ఎక్కువగా ఒడిశా, బిహార్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వారికి కార్మిక చట్టాలు.. రక్షణ పరికరాల గురించి అంతగా అవగాహన లేదు. ఇదే అదనుగా భావిస్తున్న పరిశ్రమల యాజమాన్యాలు తమ కంపెనీల్లో 100 మంది కార్మికులు విధులు నిర్వహిస్తే అందులో 40 మందికి కూడా ఈఎస్‌ఐ, పీఎఫ్, తదితర సౌకర్యాలు కల్పించడం లేదు. కనీసం అంతర్రాష్ట్ర కార్మిక చట్టాలను కూడా అమలు చేయడం లేదు. క్వాటర్స్‌లో ఉండే కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. ఈ అంశాలను పరిశ్రమల అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తరచూ తనిఖీలు చేస్తున్నా కార్మికుల భద్రతపై చర్యలు తీసుకోకున్న దాఖలాలు లేవు.

పరిహారం అంతంతే 
నిబంధనల ప్రకారం ఏదైనా పరిశ్రమలో ప్రమాదం జరిగితే వెంటనే నిర్వాహకులు ఫ్యాక్టరీస్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ అధికారులతోపాటు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. కాగా ఇక్కడి నిర్వాహకులు మాత్రం ప్రమాదాలు జరిగితే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఒకవేళ కార్మికులు ప్రమాదాల బారినపడి మృతిచెందితే వారి మృతదేహాలను ఆస్పత్రి నుంచే వారి బంధువులకు అప్పగించడం.. స్వస్థలాలకు చేరవేయడం హడావిడిగా చేస్తున్నారు. ఎంతోకొంత పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. అంతేతప్ప నిబంధనల ప్రకారం బాధిత కుటుంబాలకు పరిహారాన్ని ఇవ్వడం లేదు. ఒకవేళ విషయం బయటకు వచ్చి బాధితులు కార్మిక సంఘాలతో కలిసి ధర్నాలు, ఆందోళనలు చేస్తే తప్ప వారికి న్యాయం జరగడం లేదు.

జరిగిన ప్రమాదాలు ఇవీ..  

  • కొత్తూరు మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ ఐరన్‌  పరిశ్రమలో (ఫర్నస్‌)బాయిలర్‌ పేలిన ప్రమాదంలో ఐదేళ్ల క్రితం పదిమంది మృతి చెందారు.
  • పారిశ్రామికవాడలోని రాయలసీమ ఇండస్ట్రీస్‌లో నాలుగేళ్ల కాలంలో పలు ప్రమాదాలు జరిగాయి. నలుగురు కార్మికులు మృతిచెందగా పలువురు గాయపడ్డారు
  • తీగాపూర్‌ శివారులో పాత టైర్లను కాల్చే పరిశ్రమలో ఆరేళ్ల క్రితం బాయిలర్ఢ్‌ పేలింది. ఈ  ప్రమాదంలో నలుగురు కార్మికులు చనిపోయారు.
  • నందిగామ మండలంలోని శివశక్తి, జాగృతి పరిశ్రమల్లో బాయిలర్‌ పేలిన ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు.  
  • తాజాగా గురువారం రాత్రి తీగపూర్‌ శివారులోని మానసరోవర్‌ పరిశ్రమలో బాయిలర్‌ పేలింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  

కనీస సౌకర్యాలు కల్పించడం లేదు  
నేను విధులు నిర్వహిస్తున్న ఐరన్‌ పరిశ్రమలో యాజమాన్యాలు కనీస వసతులు కల్పించడం లేదు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాలు లేనేలేవు. చివరకు పనికితగిన వేతనాలు కూడా ఇవ్వడం లేదు. రేకుల షెడ్డులే క్వాటర్స్‌గా మార్చారు. అనారోగ్యానికి గురైనా  నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. వేతనాలు, సౌకర్యాల గురించి ప్రశ్నిస్తే యాజమాన్యాలు, కాంట్రాక్టర్లు వేధిస్తున్నారు.   – ఓ కార్మికుడి ఆవేదన

తనిఖీ అధికారం మాకు లేదు
పరిశ్రమలు కార్మికుల సేఫ్టీకి చర్యలు తీసుకుంటున్నారో లేదో తనిఖీ చేసే అధికారం మాకు లేదు. ఒక జిల్లా అధికారులు.. మరో జిల్లాకు వెళ్లి ర్యాండమ్‌గా పరిశీలిస్తారు. ఈమేరకు ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. ఫిర్యాదులు వస్తేనే మేము క్షేత్రస్థాయి కి వెళ్లి ఆరా తీయాల్సి ఉంటుంది. కొత్తూ రు మండలంలోని మానస సరోవర్‌ పరి శ్రమలో బాయిలర్‌ పేలడంతో కార్మికుడి మృతికి కారణమైన కంపెనీపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. అలాగే ఘటన విషయాన్ని మాకు తెలియజేయకపోవడమూ నేరమే. దీనిపైనా చర్యలు ఉంటాయి.  
– కె.శ్రీనివాస్, ఇన్‌ స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా