వేతనాల్లేవ్‌..ఇక ఏడుపే

12 Mar, 2018 06:51 IST|Sakshi
ఆశ్రమ గిరిజన బాలిక వసతి గృహంలో వంట చేస్తున్న కార్మికులు

 గిరిజన ఆశ్రమ హాస్టళ్ల ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి అందని వేతనాలు

7 నెలలుగా పెండింగ్‌ ఐటీడీఏ పరిధిలో 450 మంది

 కార్మికుల ఇక్కట్లు ఎప్పుడొస్తాయో తెలియక 

పాల్వంచ: జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో గల గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు గత ఏడు నెలలుగా వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. ఇచ్చే అరకొర జీతం కూడా ప్రతి నెలా అందకపోవడంతో కుటుంబ  పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు 86 ఉండగా వాటిలో 450 మంది కార్మికులు (స్వీపర్లు, కుక్‌లు, వాచ్‌మెన్‌లు, హెల్పర్లు, స్కావెంజర్లు) పనిచేస్తున్నారు. వీరికి రావాల్సిన వేతనాలు రూ.60 లక్షల మేర పేరుకు పోయాయి.

అంతేగాక 2016లో వేసవి శిబిరాల సమయంలో పనిచేసిన వేతనాలు కూడా ఇప్పటివరకు రాకపోవడం గమనార్హం. ఆ సమయంలో పనిచేసిన సబ్జెక్టు ఉపాధ్యాయులకు ఈఎల్స్‌(సంపాదిత సెలవులు) ఇచ్చారు. సీఆర్‌టీలకు కూడా వేతనాలు అందించారు. వారితో పాటు పనిచేసిన కార్మికులకు మాత్రం ఇంత వరకూ అతీగతీ లేదు. వేతనాలు అందించాలని ప్రపోజల్స్‌ పంపి నెలలు గడుస్తున్నా ఉన్నతాధికారులు కనికరించడం లేదని కార్మికులు వాపోతున్నారు. ఎప్పుడు వస్తాయో కూడా తెలియడం లేదని ఆందోళన చెందుతున్నారు.  

వెట్టి కష్టాలు ఇంకెన్నాళ్లో.. 
ఏజెన్సీ, నాన్‌ ఏజెన్సీ, మున్సిపాలిటీల పరిధిలో గల ఆశ్రమ పాఠశాల్లో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులందరిదీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. రెండు, మూడు దశాబ్దాలకు పైగా ఐటీడీఏ పరిధిలోనే పనిచేసున్న వారు అనేక మంది ఉన్నారు. వీరిని పర్మనెంట్‌ చేయాలని కోరుతున్నా పట్టించుకునే వారు లేరు. మరోవైపు జీతాలు కూడా సకాలంలో అందక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.  

పెరిగిన పనిభారం.. 
హాస్టళ్లు, పాఠశాలల్లో పనిచేస్తున్న కార్మికులకు పనిభారం పెరిగింది. గతంలో ఉన్న మెనూకు, ప్రస్తుత మెనూకు చాలా తేడా ఉంది. విద్యార్థులకు ఉదయం రకరకాల టిఫిన్‌లు, భోజనం, వెజ్, నాన్‌ వెజ్‌ వంటలు పెడుతున్నారు. పాఠశాలల్లో తరగతి, వసతి గదులు కూడా పెరిగాయి. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంతో పాటు ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా విధులు నిర్వహించాలి.

ఇలా పనిభారం నానాటికీ  పెరుగుతున్నా వేతనాలు మాత్రం పెరగడం లేదు. సెలవులు వస్తే జీతాల్లో కోత విధిస్తున్నారని, ఆరోగ్యం సరిగా లేక సెలవులు తీసుకున్నా వేతనాలు తగ్గించి ఇస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఐటీడీఏ డీడీ సీహెచ్‌.రామ్మూర్తిని వివరణ కోరేందుకు పలుమార్లు ప్రయత్నించినా అందుబాటులో లేరు. 

జీతాలు సకాలంలో రావడం లేదు. 
జీతాలు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నాం. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు మావి. ప్రతి నెలా జీతాలు ఇస్తే బాగుంటుంది. కానీ ఐదారు నెలలకు కూడా ఇవ్వక పోతే కుటుంబాల పోషణ ఇబ్బందిగా ఉంది. 
– కాంతమ్మ, హెల్పర్‌ 

పనిభారం పెరిగింది 
గతం కంటే ఆశ్రమ హాస్టళ్లలో పనిభారం పెరిగింది. ఇప్పుడు మెనూ కూడా పెంచారు. అయినా కష్టపడి విద్యార్థులకు సమయానికి వండి పెడుతున్నాం. పనిభారం ఎక్కువైనా  వేతనాలైతే పెరగలేదు. ఇన్ని నెలల పాటు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నాం.                
 – రాంబాయి, హెల్పర్‌ 

 పర్మనెంట్‌ కాక ఇబ్బందులు 
 రెండు, మూడు దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న వారికి కూడా పనిభద్రత కరువైంది. ఐటీడీఏను నమ్ముకుని పనిచేస్తున్న మాకు పర్మనెంట్‌ చేసి వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించాలి. కష్టానికి తగిన ఫలితం లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి.    
 – సరోజిని, హెల్పర్‌  

మరిన్ని వార్తలు