‘చెత్త’శుద్ధి ఏదీ?

4 Aug, 2014 00:41 IST|Sakshi

మొయినాబాద్ రూరల్: పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది.. ఎక్కడ చూసినా చెత్తకుప్పలు, మురుగు కాలువలు పేరుకుపోయి కనిపిస్తున్నాయి. అధికారులకు ‘చెత్త’శుద్ధి లోపించింది. ఏదో తూతూమంత్రంగా పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించి వదిలేశారు. మండల పరిధిలోని అమ్డాపూర్, హిమాయత్‌నగర్, బాకారం, ముర్తజా గూడ, కాశింబౌళి, నదీంమ్‌పేట్, ఎన్కేపల్లి, మొయినాబాద్  గ్రామాల్లో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది.

 దశాబ్దాల క్రితం నిర్మించిన మురికి కాలువలు శిథిలావస్థకు చేరుకొన్నాయి. చెత్తాచెదారం పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు, ఈగలు వ్యాపించి రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో మురుగుకాలువలు శుభ్రం చేయాలనే లక్ష ్యంతో ఏటా చేపట్టే పారిశుద్ధ్య వారోత్సవాలను అధికారులు 20రోజుల క్రితం నిర్వహించారు.

అయినప్పటికీ ఒనగూరిన ప్రయోజనం శూన్యం. రోడ్లపై ఎక్కడి చెత్తకుప్పలు అక్కడే దర్శనమిస్తున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల నిమిత్తం జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా ఏటా పంచాయతీలకు రూ.10వేలు మంజూరు చేసేవారని, ఈసారి అవి కూడా రాలేదని ప్రజాప్రతినిధులు చేతులెత్తేస్తున్నారు. రోగాలు దరిచేరకముందే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామాల్లో పేరుకపోయిన చెత్తాచెదారాన్ని తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు