షిఫ్ట్‌కు బైబై?

25 Apr, 2019 09:34 IST|Sakshi

రిజిస్ట్రేషన్‌ ఆఫీసుల్లో షిఫ్ట్‌ పద్ధతి రద్దుకు యోచన  

దస్తావేజుల నమోదు తగ్గడమే కారణం  

ప్రభుత్వానికి స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ సిఫారసు  

అనుమతిస్తే మళ్లీ సాధారణ వేళల్లో కార్యాలయాలు  

సాక్షి, సిటీబ్యూరో: రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం అమలు చేసిన సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ల షిఫ్ట్‌ పద్ధతి రద్దయ్యే అవకాశం ఉంది. మళ్లీ సాధారణ వేళల్లో కార్యాలయాలు పనిచేసే విధానం అమల్లోకి రానుంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం ప్రభుత్వం ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌ విధానం అమలు చేసిన సమయంలో రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా నగరంలోని రెండు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులను ఎంపిక చేసి షిఫ్ట్‌ పద్ధతికి శ్రీకారం చుట్టింది. మొదటి షిఫ్ట్‌లో బోయిన్‌పల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2:30గంటల వరకు, రెండో షిఫ్ట్‌లో మారేడ్‌పల్లి కార్యాలయం మధ్యాహ్నం 2:30గంటల నుంచి రాత్రి 9గంటల వరకు పని చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా షిఫ్ట్‌ విధానం విస్తరించాలని భావించినప్పటికీ అమలుకు నోచుకోలేదు. అంతలోనే ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌ విధానం రద్దు కావడంతో షిఫ్ట్‌ విధానానికి స్పందన కరువైంది. దస్తావేజుల నమోదు కూడా నామమాత్రంగా మారడంతో షిఫ్ట్‌ విధానాన్ని రద్దు చేయాలని రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్‌ల శాఖ కమిషనర్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే షిఫ్ట్‌ విధానాన్ని రద్దు చేసి, సాధారణ వేళల్లో కార్యకలాపాలు కొనసాగిస్తామని సంబంధిత అధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.  

కలిసొచ్చిన సమయం...  
 షిఫ్ట్‌ విధానంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం పెరగకపోయినప్పటికీ దస్తావేజుదారులకు మాత్రం కలిసొచ్చింది. రెండు షిఫ్టుల్లో సాధారణ పనివేళల మాదిరిగానే దస్తావేజుల నమోదు కొనసాగుతోంది. ముఖ్యంగా రెండో షిఫ్ట్‌ ఉద్యోగులకు కొంత ఊరటను ఇచ్చింది. ఉదయం షిఫ్ట్‌లో కేవలం ముహుర్తాల రోజుల్లో తప్పితే సాధారణ రోజుల్లో దస్తావేజుదారులు నమోదుకు పెద్దగా ముందుకురాని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో సిబ్బంది తొలి రెండు గంటలు ఖాళీగా ఉంటున్నారు. వాస్తవంగా సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల షిఫ్ట్‌ పద్ధతితో క్రయవిక్రయదారులకు సమయం కలిసొచ్చింది. వాస్తవంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో భాగమైన స్లాట్‌ బుకింగ్‌ అనంతరం డాక్యుమెంటేషన్, బ్యాంక్‌ చలానా, డీడీలు ఇతరత్రా పనులు పూర్తి చేసుకునేందుకు కనీసం నాలుగైదు గంటల సమయం పడుతుంది.

ఇవన్నీ పూర్తయ్యాక మాత్రమే అధికారికంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదయం 10గంటలకు ఇంటి నుంచి బయలుదేరినా రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి చేరుకొని డాక్యుమెంటేషన్‌ పూర్తి చేసే సరికి ఆలస్యమవుతోంది. దీంతో రిజిస్ట్రేషన్‌ను మరో రోజుకు వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు రెండు రోజులు సెలవు పెట్టాల్సి వస్తోంది. అయితే ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్లతో షిఫ్ట్‌ పద్ధతి అమలు కావడంతో దరఖాస్తుదారులకు మరింత కలిసొచ్చింది. ఒకే రోజు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకునే వెసులుబాటు ఉండేది. ఉదయం వేళలో పనిచేసే బోయిన్‌పల్లి కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌లు కొంత తగ్గినా మధ్యాహ్నం వేళలో పనిచేసే మారేడ్‌పల్లిలో రిజిస్ట్రేషన్లు పెరిగాయి. మొత్తమ్మీద ఉద్యోగులు సెలవు పెట్టకుండానే ఉదయం/రాత్రి వేళల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకునే వెసులుబాటు ఉంది. ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ లేని కారణంగా కొన్ని రోజులుగా షిఫ్ట్‌ విధానంలో దస్తావేజుల నమోదు తగ్గుముఖం పట్టింది. దీంతో షిఫ్ట్‌ విధానాన్ని రద్దు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం తీసుకుంది. 

మరిన్ని వార్తలు