గడువు దాటిన ఎల్‌ఎల్‌ఆర్‌లు ఎలా?

22 May, 2020 08:22 IST|Sakshi

డ్రైవింగ్‌ లైసెన్సుల కోసం భారీ క్యూ

ఆన్‌లైన్‌ స్లాట్‌.. నెలరోజుల తర్వాతే  

గడువు ముంచుకొస్తున్న ఎల్‌ఎల్‌ఆర్‌

కోవిడ్‌తో ఆర్టీఏ సేవలపై ప్రభావం

సాక్షి, సిటీబ్యూరో: లెర్నింగ్‌ లైసెన్స్‌ (ఎల్‌ఎల్‌ఆర్‌) తీసుకోవాలనుకుంటున్నారా? అయితే కనీసం నెల రోజులు ఎదురు చూడాల్సిందే! కొత్తగా  డ్రైవింగ్‌ నేర్చుకొనేందుకు అనుమతినిచ్చే ఎల్‌ఎల్‌ఆర్‌ కోసం నగరంలో డిమాండ్‌ అనూహ్యంగా పెరిగింది. కోవిడ్‌  నిబంధనలదృష్ట్యా పౌరసేవలపై రవాణాశాఖ ఆన్‌లైన్‌ స్లాట్‌లను గణనీయంగా తగ్గించింది. దీంతో వాహన వినియోగదారులు తమకు కావాల్సిన సేవలను పొందేందుకు నెలల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. గతంలో ఒకట్రెండు రోజుల్లోనే స్లాట్‌లు లభించేవి. డిమాండ్‌కు అనుగుణంగా అందుబాటులో ఉండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పౌరసేవలను వినియోగించుకున్నారు. కానీ కోవిడ్‌ కట్టడికి విధించిన పరిమితుల దృష్ట్యా పడిగాపులు కాయాల్సి వస్తోంది. లెర్నింగ్‌ లైసెన్సు పొందిన వినియోగదారులు 6 నెలల్లో శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్సు తీసుకోవాలి. స్లాట్‌ల కొరత కారణంగా ఎంతోమంది ఆ అవకాశాన్ని కోల్పోతున్నారు. గడువు ముగిసిన లెర్నింగ్‌ లైసెన్సులు పొడిగించుకోవడం కూడా సాధ్యం కాకపోవడంతో పలువురు తమకు ఉన్న అర్హతను కోల్పోవాల్సివస్తోంది. వాహనాల రిజిస్ట్రేషన్లు, గడువు ముగిసిన  పర్మనెంట్‌ లైసెన్సుల రెన్యూవల్‌ కోసం కూడా ఆన్‌లైన్‌లో భారీ ఎత్తున క్యూలో ఉండాల్సి వస్తోంది. ఆర్టీఏ కార్యకలాపాలు మొదలైనప్పటికీ స్లాట్‌లు పెంచకపోవడం వల్లే డిమాండ్‌ పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. 

భారీగా స్లాట్‌ల కుదింపు..
ఖైరతాబాద్‌ కేంద్ర కార్యాలయంలో సాధారణంగా రోజుకు 300 ఎల్‌ఎల్‌ఆర్‌ స్లాట్‌లు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు సైతం ఇంచుమించు అదేస్థాయిలో ఉంటారు. 150 నుంచి 180 కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల కోసంస్లాట్‌లు ఉంటాయి. కానీ.. కోవిడ్‌ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని భారీగా తగ్గించారు. ఎల్‌ఎల్‌ఆర్‌ స్లాట్‌లు కేవలం 25 నుంచి  30కే పరిమితం చేశారు. దీంతో ఈ కార్యాలయం పరిధిలో లెర్నింగ్‌ లైసెన్సు కోసం స్లాట్‌ నమోదు చేసుకోవాలంటే నెల రోజులు ఆగాల్సి వస్తోంది. ఒక్క ఖైరతాబాద్‌లోనే కాకుండా  ఉప్పల్, ఇబ్రహీంపట్నం, అత్తాపూర్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, మేడ్చల్‌.. ఇలా అన్ని  ఆర్టీఏ  కేంద్రాల్లో స్లాట్‌ల కుదింపుతో లెర్నింగ్‌ లైసెన్సుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్యలో రోజు రోజుకూ పెరుగుతోంది. వాహనాల రిజిస్ట్రేషన్లు, శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్సుల రెన్యూవల్‌ కూడా 50 స్లాట్‌లకే పరిమితం చేశారు. నాగోల్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లో సాధారణంగా రోజుకు 350 నుంచి 400 మందికి పరీక్షలు నిర్వహించి లైసెన్సులకు అర్హతను ధ్రువీకరిస్తారు. కానీ.. ఇప్పుడు అక్కడ సైతం 50 స్లాట్‌లకే పరిమితం చేశారు. నాగోల్‌తో పాటు కొండాపూర్‌ తదితర డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 

గడువు దాటిన ఎల్‌ఎల్‌ఆర్‌లు ఎలా?  
లెర్నింగ్‌ లైసెన్సులకు 6 నెలల పరిమితి ఉంటుంది. ఉదాహరణకు గతేడాది నవంబర్‌లో లెర్నింగ్‌ లైసెన్సు తీసుకున్నవారు ఈ ఏడాది ఏప్రిల్‌లో పర్మనెంట్‌ లైసెన్స్‌ పరీక్షలకు హాజరుకావాలి. గత డిసెంబర్‌లో లెర్నింగ్‌ లైసెన్స్‌ తీసుకున్నవారు మే నెలలో శాశ్వత లైసెన్స్‌ పరీక్షలకు హాజరు కావాలి. స్లాట్‌లు లభించకపోవడంతో వందలాది మంది తమ లెర్నింగ్‌ లైసెన్సు అర్హతను కూడా కోల్పోవాల్సివస్తోంది. మరోవైపు  కాలపరిమితి దాటిన లెర్నింగ్‌ లైసెన్సుల గడువు పొడిగించాలన్నా స్లాట్‌లు లభించకపోవడం సమస్యగానే పరిణమించింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా