డీఈవో కార్యాలయంలో సిబ్బంది లేరా?   

5 Jun, 2018 14:05 IST|Sakshi
డీఈవో కార్యాలయం వద్ద వినతిపత్రం సమర్పిస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు  

ఐక్య విద్యార్థి సంఘాల నిరసన

డీఈవో కార్యాలయానికి వినతిపత్రం సమర్పణ

మంచిర్యాలటౌన్‌ : నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు రోజులు దాటినా మంచిర్యాల జిల్లా డీఈవో  కార్యాలయంలో అధికా రులు లేక వెలవెల బోవడాన్ని నిరసిస్తూ ఐక్య విద్యార్థి సంఘాల నేతలు సోమవారం మూసి ఉన్న డీఈవో కార్యాలయానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభించి ఇప్పటికి మూడు రోజులు దాటినా, కార్యాలయంలో ఒక్క అధికారి, సూపరింటెండెంట్‌ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో ఇక్కడ పనిచేసిన రెగ్యులర్‌ డీఈవోను సిద్దిపేటకు బదిలీ చేసి, పెద్దపల్లి డీఈవో వెంకటేశ్వర్‌రావుకు ఇన్‌చార్జి ఇచ్చారన్నారు. రెండు జిల్లాలకు పనిచేస్తున్న డీఈవో మంచిర్యాల జిల్లాకు సక్రమంగా రాకపోవడంతో, జిల్లాలోని పాఠశాలలు కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యాహక్కు చట్టం అమలు చేసేలా, రెగ్యులర్‌ డీఈవోను ఇచ్చి, సిబ్బంది సరైన సమయానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట రాజేశ్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు జాగిరి రాజేశ్, ఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు జుమ్మిడి గోపాల్, ఏబీఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మెట్‌పల్లి రంజిత్‌రావు, ఆప్‌ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నల్ల నాగేంద్రప్రసాద్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మామిడాల ప్రవీణ్, ఆప్‌ విద్యార్థి సంఘం నాయకులు సతీశ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు