ఆసరా..గాభరా!

8 Jun, 2015 00:44 IST|Sakshi

- జీరో ఖాతాలకు బ్యాంకర్ల కొర్రీలు..
- లబ్ధిదారుల అవస్థలు
- జంట జిల్లాల్లో 4.52 లక్షల ఆసరా పింఛన్లు
- బ్యాంకు ఖాతాలు 1.51 లక్షలు మాత్రమే
- అయోమయంలో 3.01 లక్షల మంది...
సాక్షి, సిటీబ్యూరో:
పింఛన్లు అందక ఆసరా లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకర్ల కొర్రీలు, జీరో ఖాతాల ఓపెనింగ్‌లో కష్టాలతో దాదాపు 3 లక్షల మంది లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. బ్యాంకు ఖాతాల ద్వారానే సామాజిక పింఛన్లు(ఆసరా) పంపిణీ  చేయాలనే ప్రభుత్వ  నిర్ణయం కారణంగా లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చే యాల్సి వస్తోంది. ఆసరా పింఛన్లకు సంబంధించి జీరో ఖాతాలు తెరవాలని అధికారయంత్రాంగం బ్యాంకర్లను ఆదేశించినా..సరిగ్గా పట్టించుకోకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. పింఛన్లు పంపిణీ చేసే తేదీ (10) దగ్గర పడుతుండటంతో మరింత టెన్షన్‌కు గురవుతున్నారు.

ఖాతాల కోసం బ్యాంకులకు వెళ్లితే సాయంత్రం లేదా రేపు...ఎల్లుండి రావాలని సమాధానం వస్తుండడంతో వారు ఆవేదన చెందుతున్నారు. వికలాంగులు, వృద్ధులైతే  బ్యాంకుల చుట్టూ ప్రతిరోజు  తిరగలేక మధ్య దళారులను ఆశ్రయిస్తున్నారు.  జీరో ఖాతాలు తెరిపించినందుకుగాను దళారులకు రూ.50 నుంచి రూ. 100 వరకు ముట్టజెప్పాల్సివస్తుందంటున్నారు. అధికార యంత్రాంగం జోక్యం చేసుకుంటే తప్ప ఖాతాలపై బ్యాంకర్లు కనికరించే పరిస్థితి లేదంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ నెల ఆసరా పింఛన్లు వరకు బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసుకోవటం కష్టమని లబ్ధిదారులంటున్నారు.

అధికారులు మాత్రం బ్యాంకు ఖాతాలు లేకుండా ఆసరా పింఛన్లు ఇవ్వలేమంటున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాలలో మొత్తంగా ఆసరా పింఛన్‌దారులు 4,52,168 మంది ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో 1,65,025  మంది, రంగారెడ్డి జిల్లాలో  2,87,143 మంది ఉన్నారు. అయితే బ్యాంకు ఖాతాలు మాత్రం ఇప్పటి వరకు జంట జిల్లాలలో 1.51 లక్షలే ఆసరా పింఛ న్లతో  అనుసంధానమయ్యాయి. ఇందులో హైదరాబాద్ జిల్లాలో 78 వేలు కాగా, రంగారెడ్డి జిల్లాలో 73 వేల వరకు ఉన్నాయి. జంట జిల్లాల్లో ఇంకా 3,01,168  ఆసరా పింఛన్లు బ్యాంకు ఖాతాలతో అనుసంధానం కావాల్సి ఉంది. దీంతో ఈనెలలో పింఛన్ల  పంపిణీపై అధికారయంత్రాంగం మల్లగుల్లాలు పడుతుండగా... బ్యాంకు ఖాతాలు లేని లబ్ధిదారులు మాత్రం పింఛన్ వస్తుందో..రాదోనని టెన్షన్ పడుతున్నారు.

మరిన్ని వార్తలు