హైవేపై నిఘా ఏదీ..?

2 Jul, 2015 02:58 IST|Sakshi
హైవేపై నిఘా ఏదీ..?

ఫిబ్రవరిలో వనపర్తికి చెందిన దంపతులు ఇల్లు అమ్మగా వచ్చిన మూడు లక్షల రూపాయలు తీసుకొని కర్నూలు నుంచి వనపర్తికి ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. బస్సు అలంపూర్ చౌరస్తాకు చేరుకుంది. అక్కడ గుర్తు తెలియని మహిళలు ముగ్గురు బస్సెక్కారు. అనంతరం వనపర్తికి చెందిన దంపతుల వద్దనుంచి రెండు లక్షల రూపాయలు దొంగిలించారు. అనంతరం ఇటిక్యాలపాడు వద్ద దిగిపోయారు. తర్వాత తమ డబ్బులు చూసుకున్న దంపతులు అందులో రూ. రెండు లక్షలను దొంగలు ఎత్తుకెళ్లారన్న విషయం తెలిసి గొల్లుమన్నారు. ఈ సంఘటన ఒక్కటే కాదు.. 44వ నెంబర్ జాతీయ రహదారిపై బస్సుల్లో దొంగతనాలు జరగడం నిత్యకృత్యంగా మారింది.
 
- దొంగతనాలకు అడ్డాగా
- మారిన 44వ నంబర్ జాతీయ రహదారి
- రోజురోజుకు పెరుగుతున్న దొంగతనాలు
- చోరీల అదుపులో పోలీసుల నిర్లక్ష్యం
- అలంపూర్‌ను సేఫ్‌జోన్‌గా ఎంచుకున్న చోరులు
ఇటిక్యాల :
44వ నెంబరు జాతీయ రహదారిపై దొంగలు బస్సులు.. లారీల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఈ పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. అయినా, పోలీసులు వాటిని అరికట్టడంలో నిర్లక్షంగా ఉంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు హడావుడి చేయడం తప్ప జాతీయరహదారిపై పటిష్ట నిఘాను ఏర్పాటు చేయడం లేదు. దీనిని అదునుగా తీసుకున్న దొంగలు తమ పనిని సులువుగా కానిచ్చేస్తున్నారు.
 
టోల్‌ప్లాజా నుంచి జల్లాపురం స్టేజీ వరకు చోరీలకు అడ్డా
దొంగలు హైవేపై అలంపూర్ టోల్‌ప్లాజా నుంచి జల్లాపురం స్టేజీ వరకు చోరీలకు అడ్డాగా మార్చుకొని పథకం ప్రకారం చోరీలు చేస్తున్నారు. ప్రస్తుతం హైవేపై హైవే పెట్రోలింగ్ వాహనం గస్తీ తిరుగుతోంది. పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ఇష్టానుసారంగా విధులు నిర్వహించడంతోనే ఇలాంటి చోరీలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. చోరీలను అరికట్టేందుకు పోలీసు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రయాణికులతోపాటు పోలీసు బలగాలు సైతం ఈ ప్రాంతంలో గస్తీ ముమ్మరం చస్తే తప్ప చోరీలు అదుపులోకి రావన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
 
 హైవేపై జరిగిన ప్రధాన దొంగతనాలు..
మానవపాడు స్టేజీ వద్ద గుర్తు తెలియని దుండగులు ఓ లారీ డ్రైవర్, క్లీనర్‌ను చితకబాది రూ. 10వేలు లాక్కెళ్లారు. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా.. క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.మానవపాడు గ్రామ శివారులో హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్లే డీసీఎం డ్రైవర్‌ను దుండగులు చితకబాది అతని వద్ద ఉన్న నగదును దోచుకెళ్లారు.

కేశినేని ట్రావెల్స్ బస్సులో కోయంబత్తూరు నుంచి హైదరాబాద్‌కు బంగారం తీసుకెళ్లే ఇద్దరు వ్యక్తుల నుంచి మానవపాడు మండలంలోని ఘర్‌దాబా వద్ద నాలుగు కిలోల బంగారం చోరీకి గురైంది. అయితే, బంగారం తీసుకొచ్చే ఇద్దరు వ్యక్తులపైనేప్రయాణికులు అనుమానం వ్యక్తం చేయడంతో చోరీ మిస్టరీగా మారింది. బంగారం తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు ఘర్ దాబా వద్ద బస్సు దిగి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన వెంటనే మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు నేరుగా బంగారాన్ని తీసుకొచ్చే లోకనాథన్, సుజారాం బస్సు సీట్ల వద్దకు వెళ్లి బ్యాగులలోని నాలుగు కిలోల బంగారాన్ని తీసుకొని టవల్‌లో చుట్టుకొని వడివడిగా బస్సు దిగి వారు తెచ్చుకున్న కారులో వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు