టీడీపీలో.. ఒక్కరూ నామినేషన్‌ వెయ్యలే

28 Mar, 2019 14:18 IST|Sakshi

పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ సైకిల్‌ కనుమరుగు 

నిజామాబాద్‌ ఎంపీ స్థానానికి నామినేషన్‌ వేయని టీడీపీ 

మోర్తాడ్‌(బాల్కొండ): ముందస్తు శాసనసభ ఎన్నికల్లోనూ ముగిసిపోయిన టీడీపీ కథ పార్లమెంట్‌ ఎన్నికల్లోను పునరావృతమైంది. ఒకప్పుడు నిజామాబాద్‌ ఎంపీ స్థానాన్ని దక్కించుకున్న టీడీపీకి ఈ ఎన్నికల్లో నామినేషన్‌ వేయడానికి అభ్యర్థులే కరువయ్యారు. ఫలితంగా ఎప్రిల్‌ 11న నిర్వహించనున్న పోలింగ్‌లో సైకిల్‌ గుర్తు కనిపించడం ఉండదు. టీడీపీకి పూర్వ వైభవం తీసుకవస్తామని ఆ పార్టీ నాయకులు గతంలో గొప్పలు చెప్పుకున్నా చివరకు నామినేషన్‌ వేసే అభ్యర్థులే కరువు కావడంతో జిల్లాలో టీడీపీ కథ కంచికి చేరిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నిజామాబాద్‌ ఎంపీ స్థానానికి టీఆర్‌ఎస్‌ తరపున సిట్టింగ్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్, బీజేపీ తరపున డీఎస్‌ తనయుడు ధర్మపురి అర్వింద్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే పసుపు, ఎర్రజొన్నలకు మద్దతు ధర కోరుతూ అందరి దృష్టిని మరల్చుతూ రైతులు మూకుమ్మడిగా నామినేషన్లు వేశారు.

రాష్ట్రంలో ఏ పార్లమెంట్‌ స్థానంలోనూ దాఖలు కానన్ని నామినేషన్లు నిజామాబాద్‌ స్థానానికి దాఖలైనా టీడీపీ తరపున మాత్రం ఏ ఒక్కరు కూడా నామినేషన్‌ను వేయలేకపోవడం విశేషం. ఒకప్పుడు జిల్లాలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ దశలవారిగా తన ప్రభావాన్ని కోల్పోయింది. ముందస్తు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు కారణంగా టీడీపీ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయలేదు. అయితే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల మధ్య ఎలాంటి పొత్తు కుదరలేదు. దీంతో టీడీపీ నిజామాబాద్‌ స్థానం నుంచి పోటీ చేస్తుందని అందరు భావించారు. కాని నాయకులు కరువు కావడంతో టీడీపీ పోటీకి దూరంగానే ఉండిపోయింది. దీనికి తోడు టీడీపీ జిల్లా అధ్యక్షుడు అధికార టీఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీని నడిపించేవారు కరువైనారు. దీంతో జిల్లాలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకపోయిందని పలువురు భావిస్తున్నారు.

 కేశ్‌పల్లితోనే టీడీపీకి వైభవం.. 
నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి గతంలో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే టీడీపీ తరపున ఏడుమార్లు అభ్యర్థులు పోటీ చేస్తే మూడుమార్లు మాత్రమే ఎంపీగా ఆ పార్టీ అభ్యర్థి గెలిచారు. అయితే మూడుమార్లు టీడీపీ తరపున కేశ్‌పల్లి గంగారెడ్డి ఒక్కరే గెలవడాన్ని పరిశీలిస్తే అతని మూలంగానే ఆ పార్టీకి వైభవం దక్కిందని స్పష్టం అవుతుంది. 1984లో టీడీపీ తరపున అప్పట్లో నారాయణరెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1989లో ప్రస్తుత స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

1996లో మండవ వెంకటేశ్వర్‌రావు, 2004లో సయ్యద్‌ యూస్‌ఫ్‌ అలీ టీడీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1991, 1998, 1999 ఎన్నికల్లో పోటీ చేసిన కేశ్‌పల్లి గంగారెడ్డి టీడీపీ ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. టీడీపీ తరపున పోటీ చేసిన వారిలో కేశ్‌పల్లి గంగారెడ్డి మినహా ఇతర అభ్యర్థులు ఎవరు గెలవకపోవడాన్ని పరిశీలిస్తే కేవలం గంగారెడ్డి అతని సొంత ప్రాబల్యంతోనే గెలిచినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా టీడీపీ అభ్యర్థులు పోటీలో లేక పోవడాన్ని గమనిస్తే జిల్లాలో ఆ పార్టీ కథ ముగిసిపోయిందని చెప్పవచ్చు.   

మరిన్ని వార్తలు