‘సుజనా’ డైరెక్టర్లకు ఎదురుదెబ్బ 

19 Apr, 2019 01:35 IST|Sakshi

అరెస్ట్‌ చేయకుండా ఆదేశాలివ్వలేమన్న హైకోర్టు 

డైరెక్టర్ల పిటిషన్లు కొట్టివేత 

సాక్షి, హైదరాబాద్‌: జీఎస్టీ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న సుజనా గ్రూపు కంపెనీల డైరెక్టర్లకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వీరి అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఎటువంటి ఆదేశాలు జారీ చేయడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. తమను అరెస్ట్‌ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆ కంపెనీల డైరెక్టర్లు దాఖలు చేసిన వ్యాజ్యాలను న్యాయస్థానం కొట్టేసింది. ఇలాంటి కేసుల్లో అధికరణ 226 కింద హైకోర్టులు తమకున్న న్యాయ విచక్షణను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేసింది. అంతేకాక దర్యాప్తులో అరెస్ట్‌ భాగమని పేర్కొంది. కాగితాలపై రూ.1,290 కోట్ల టర్నోవర్‌ చూపి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) కింద రూ.225 కోట్ల మేర లబ్ధి పొందినట్లు ఈ ఆరుగురు డైరెక్టర్ల మీద ఆరోపణలు ఉన్నాయని తెలిపింది. ఇలాంటి వ్యక్తులను అరెస్ట్‌ చేయాలన్న సెంట్రల్‌ ట్యాక్స్‌ అధికారుల ఆలోచన తప్పుకాదని అభిప్రాయపడింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ పి.కేశవరావుతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. 

జీఎస్టీ కమిషనర్‌కు అధికారముంది... 
జీఎస్టీ చెల్లింపులో సెంట్రల్‌ ట్యాక్స్‌ అధికారులు జారీ చేసిన సమన్లను రద్దు చేయడంతో పాటు తమను అరెస్ట్‌ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సుజనా గ్రూపునకు చెందిన సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ జి.శ్రీనివాసరాజు, హిందుస్థాన్‌ ఇస్పాట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ బి.వెంకట సత్య ధర్మావతార్, ఇన్ఫినిటీ మెటల్‌ ప్రొడక్ట్స్‌ ఇండియా లిమిటెడ్‌ డైరెక్టర్‌ పి.వి.రమణారెడ్డి, ఈబీసీ బేరింగ్స్‌ ఇండియా లిమిటెడ్‌ డైరెక్టర్‌ బాలకృష్ణమూర్తి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన ధర్మాసనం గురువారం 43 పేజీల తీర్పు వెలువరించింది. కాగ్నిజబుల్, నాన్‌ బెయిలబుల్‌ నేరానికి పాల్పడ్డారని విశ్వసించేందుకు తగిన కారణాలు ఉంటే ఆ వ్యక్తి లేదా వ్యక్తుల అరెస్ట్‌కు ఆదేశాలిచ్చే అధికారం సీజీఎస్టీ చట్టంలోని సెక్షన్‌ 69(1) కింద జీఎస్టీ కమిషనర్‌కు ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది. కారణాలను ఫైల్‌లో పొందుపరిస్తే సరిపోతుందని, అరెస్ట్‌ ఉత్తర్వుల్లో విశ్వసించదగ్గ కారణాలను పేర్కొనాల్సిన అవసరం లేదని తెలిపింది.

అరెస్ట్‌ విషయంలో అధికరణ 226 కింద హైకోర్టులు తమకున్న విచక్షణాధికారాలను ఉపయోగించే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిందని గుర్తు చేసిన ధర్మాసనం, సీఆర్‌పీసీ సెక్షన్‌ 438 కింద అధికరణ 226 కింద ప్రత్యామ్నాయం కాదని తేల్చి చెప్పింది. అసెస్‌మెంట్‌ పూర్తయిన తరువాతనే అరెస్ట్‌ చేయడం గానీ, ప్రాసిక్యూషన్‌ మొదలుపెట్టడం గానీ చేయాలన్న పిటిషనర్ల వాదనల్లో వాస్తవం లేదంది. సీజీఎస్టీ చట్టం కింద ఓ అధికారి నిర్వహించే ప్రొసీడింగ్స్‌ జ్యుడీషియల్‌ ప్రొసీడింగ్స్‌ కిందకు వస్తాయని, అందువల్ల సమన్లు అందుకున్న వ్యక్తి తప్పుడు సాక్ష్యం ఇవ్వడానికి వీల్లేదని తెలిపింది. ఏ రకంగా చూసినా సీజీఎస్టీ చట్టం కింద పిటిషనర్ల అరెస్ట్‌ విషయంలో జోక్యం చేసుకోవడానికి కారణాలు కనిపించడం లేదంది. అందువల్ల పిటిషనర్ల అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేసింది.  

>
మరిన్ని వార్తలు