జోగుళాంబదేవినే మరిచారు!

1 Jul, 2018 09:08 IST|Sakshi
 అలంపూర్‌ ఆలయాల వ్యూ 

ప్రసంగంలో ఎక్కడా ఆలయం ఊసెత్తని సీఎం కేసీఆర్‌

ముఖ్యమంత్రి జిల్లా పర్యటనపై స్థానికుల అసంతృప్తి

అలంపూర్‌ అభివృద్ధిపై ఆశలు అడియాసలే.. 

అలంపూర్‌ రూరల్‌ :  జోగుళాంబ గద్వాలలో శుక్రవారం పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్, తన ప్రసంగంలో అలంపూర్‌ నియోజకవర్గం, జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల అభివృద్ధి గురించి ప్రస్తావించకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కృష్ణా పుష్కరాల సందర్భంగా అలంపూర్‌ వచ్చిన సీఎం, అనేక అభివృద్ధి అంశాలపై హామీలు ఇచ్చారు. అయితే, జోగుళాంబ ఆలయ అభివృద్ధి విషయమై కేంద్ర పురావస్తు శాఖతో మాట్లాడతానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మొన్నటి సభలో ఆలయాల గురించి మాట్లాడకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

పుష్కరాలపై దృష్టి ఏదీ? 
యావత్‌ తెలంగాణ రాష్ట్రంలో ఒకే ప్రాంతంలో ప్రవహించే తుంగభద్ర నది పుష్కరాలకు సమయం సమీపిస్తున్నా సీఎం కేసీఆర్‌ ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. 2020 మార్చి 31నుంచి ప్రారంభంకానున్న తుంగభద్ర నదికి ఏడాదిన్నర మాత్రమే సమయం ఉంది. ఇప్పటి నుంచే మాస్టర్‌ ప్లాన్‌ వేయించడం, ఆలయాల పరిసరాలను భక్తుల రద్దీకి అనుగుణంగా ఆధునీకరించడం వంటివి చేయాల్సిఉంది. ఈనేపథ్యంలో కేంద్ర పురావస్తు శాఖతో ఈ ప్రభుత్వం అనుమతులు కోరేదెన్నడు? మాస్టర్‌ ప్లాన్‌ వేయించేదెన్నెడు? నివాస గృహాల నష్ట పరిహారాలు అందించేదెన్నడు? ఇలా అనేక రకాలుగా అలంపూర్‌ నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.   

జిల్లాకు ఒరిగింది ఏమీ లేదు  
సీఎం పర్యటనతో జిల్లాకు ఒరిగింది ఏమీ లేదు. ప్రతిపక్షాల గొంతునొక్కే విధం గా ఎమ్మెల్యే సంపత్‌ను గృ హనిర్భంధం చేశారు. జోగుళాంబ అమ్మవారి పేరు కానీ, గత హామీలు కానీ ఎక్కడా ప్రస్తావించకుండా మరొకరు  ప్రశ్నించకుండా సభను ముగించారు. ఈవైఖరి సరికాదు.                     – జెట్టి రాజశేఖర్, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు  

ప్రశ్నిస్తాననే గృహ నిర్బంధం  
సీఎం కేసీఆర్‌ గతంలో అలంపూర్‌ వచ్చిన సమయంలో ఆలయం, నియోజకవర్గ అభివృద్ధికి అనేక హామీలు ఇచ్చారు. వాటి అమలుపై ప్రశ్నించాల్సిన నైతిక బాధ్యత ఎమ్మెల్యేగా నాపై ఉంది. నేను ప్రశ్నిస్తాను అనే భయంతోనే గృహనిర్బంధం చేయించారు.                                                     – ఎస్‌. సంపత్‌కుమార్, ఎమ్మెల్యే అలంపూర్‌ 
అమ్మ మొక్కు మరిచారు  
సీఎం కేసీఆర్‌ బెజవాడ కనకదుర్గమ్మకు, తిరుపతి వెంకన్నకు, అంతకుముందు కొండగట్టు అంజన్న, వేములవాడ, యాదాద్రి, భద్రాద్రిలో మొక్కలు చెల్లిస్తూ వస్తున్నారు. కానీ జోగుళాంబ అమ్మ మొక్కు మరిచారు. ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పిన మాటలు అడియాశలే అయ్యాయి. 
– బోరింగ్‌ శ్రీనివాస్, జోగుళాంబ సేవాసమితి అధ్యక్షుడు   

మరిన్ని వార్తలు