‘టెన్‌’షన్‌ వద్దు 

13 Mar, 2018 11:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రణాళికతో ’పది’లం

ఇష్టపడి చదివితే విజయం తధ్యం

ఒత్తిడిని జయించాలి

15 నుంచి పదో తరగతి పరీక్షలు

హాజరుకానున్న 9,460 మంది విద్యార్థులు

జిల్లాకు చేరిన ప్రశ్నపత్రాలు

 ఆలేరు : పదవ తరగతి..ప్రతి విద్యార్థికి ఎంతో కీలకమైంది. పదవ తరగతిలో పరిపూర్ణత అంటే 10 గ్రేడ్‌ పాయింట్లు. ఇదే ప్రతి విద్యార్థి లక్ష్యం. అన్ని సబ్జెక్టుల్లో 92 కంటే ఎక్కువ మార్కులు వస్తే 10 గ్రేడ్‌ పాయింట్లు ఇస్తారు. అంటే ప్రతి సబ్జెక్టులోను రాణించేలా సాధన చేయాలి. ఈనెల 15 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జిల్లాలో 48 పరీక్ష కేంద్రాల్లో 9460 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 460 మంది (కంపార్ట్‌మెంటల్‌) విద్యార్థులు ఉన్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో మొత్తం 156 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 99 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. గతేడాది కన్నా మెరుగైన ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
  
భయం వీడితే విజయం 
పరీక్షల్లో ఉత్తీర్ణులమవుతామో లేదోనని ఆందోళన విద్యార్థులను మరింత కుంగదీస్తుంది. ఇలాంటి సందేహాలను మనస్సులోకి రానివ్వకూడదు. పరీక్షల్లో ర్యాంకులు, మార్కులు సాధించడం కష్టం కావచ్చు. ఉత్తీర్ణత సాధించడం కష్టమేమీ కాదు. ఒత్తిడిని అధిగమించి చదువుపై దృష్టిపెట్టాలి. సమయం తక్కువగా ఉంది కనుక సులువైన పాఠాలను వీలైనన్ని ఎక్కువసార్లు చదవాలి. దీంతో పట్టు సాధించవచ్చు. సాధారణంగా విద్యార్థులు గణితం, ఆంగ్లం, సామాన్యశాస్త్రం వంటి సబ్జెక్టులపై దృష్టిని సారిస్తుంటారు. ఇది సరైంది కాదు. అన్ని సబ్జెక్టులకు సమానమైన ప్రాధాన్యతనివ్వాలి. అన్ని సబ్జెక్టుల్లో 92 కంటే ఎక్కువ మార్కులు వస్తేనే ఏ–1 గ్రేడ్‌ సాధించేందుకు అవకాశం ఉంటుంది. 

పౌష్టికాహారం తీసుకోవాలి
పరీక్షల సమయంలో పౌష్టికాహారం తీసుకోవాలి. ఏది పడితే అది తినవద్దు. తాజా పండ్లు, ఉడికించిన గుడ్లు, సలాడ్స్, ఎండు ఫలాలు మధ్యమధ్యలో తింటుండాలి. తగు విధంగా మంచి నీరు తాగాలి. నీరు, మజ్జిగ, నిమ్మరసం, పండ్లర సాలు తీసుకోవాలి. కాఫీ, టీలు తగ్గించాలి. తీపి పదార్థాలు, వేపుళ్లు తక్కువగా తీసుకోవాలి. 

ఒత్తిడి పెంచొద్దు

తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడిని పెంచవద్దు. ఇతరులతో పో ల్చి వారిని తక్కువగా చేయవద్దు. అతిగా ఆశలు పెట్టుకున్నామని వారిని వేధించవద్దు. వారికి ప్రశాంతమైన వాతావరణం కల్పించాలి. వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచాలి. పరీక్ష సమయంలో  కుటుంబ సభ్యులు టీవీని కట్టిపడేయాలి. పరీక్షలు కదాని రాత్రి పొద్దుపోయేదాకా చదవకూడదు. ఉదయం, సాయంత్రం వేళల్లో ధ్యానం చేస్తే మంచిది. ఏకాగ్రతతో చదివేలా చూడాలి. ఆత్మవిశ్వాసం ముఖ్యం.ముందస్తు ప్రణాళికతో చదవాలి. 

ప్రశ్నలపై అవగాహన కలిగి ఉండాలి
జీవశాస్త్రంలో ప్రతి పాఠం కీలకమే. ఇందులో మొత్తం 10 పాఠ్యాంశాలున్నాయి. పోషణలో కిరణజన్య సంయోగ క్రియ, శ్వాస క్రియల నుంచి ఎక్కువగా 4మార్కుల ప్రశ్నలు వస్తున్నాయి. పోషకాహార లోపంతో వచ్చే వ్యాధులు, విటమిన్లపై కూడా ఈ తరహా ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. నిత్యజీవిత వినియోగానికి సంబంధించిన ప్రశ్నలపై అవగాహన కలిగి ఉండాలి. ప్రయోగాల సాధనపై పట్టు సాధించడం ద్వారా పరీక్షల్లో అత్యధిక మార్కులు పొందవచ్చు.  నిత్య జీవితంలో అన్వయించుకునే అంశాలను కూడా వదలకుండా నేర్చుకోవాలి.  
– ఖమర్‌ సుల్తాన, ఎస్‌ఏ ఉపాధ్యాయురాలు 

స్కోరింగ్‌కు అవకాశం 
హిందీలో మంచి మార్కులు వస్తే స్కోరింగ్‌కు ఎంతగానో తోడ్పడుతుంది. ప్రశ్నలు, వ్యాకరణాంశాలు, అపరిచిత అంశాలను దృష్టిలో పెట్టుకొని చదవడం, రాయడం చేయాలి. హిందీ అంటే భయపడవద్దు. చదివింది అర్థం చేసుకోవడం ము ఖ్యం. కవి, రచయిత పరిచయాలను క్షు ణ్ణంగా చదవాలి. ప్రతి పాఠం సమగ్రం గా చదివితే మార్కులు ఎక్కువగా వస్తాయి. వ్యాకరణానికి ప్రాధాన్యత ఇవ్వాలి.  
–  అబ్దుల్‌గని, హిందీ పాఠ్యపుస్తక రచయిత

అవగాహన పెంచుకోవాలి
సాంఘికశాస్త్రంలో ఇచ్చిన ప్రశ్నలకు, చదివిన సమాధానాలను సరిగా ప్రజెంట్‌ చేయగలిగి పూర్తి మార్కులు తెచ్చుకునేలా అభ్యసించాలి. సెకండ్‌ పేపర్‌లో మ్యాప్‌ పాయింటింగ్‌ ఉంటుంది. మ్యాప్‌ పాయింటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తూ అవగాహన పెంచుకోవాలి. ప్రశ్నపత్రాన్ని సరిగా అర్థం చేసుకోవడం ముఖ్యం. విద్యార్థులు పాఠాలకు సంబంధించి వార్తాపత్రికల్లో వస్తున్న సమాచార పట్టికలు, గ్రాఫ్‌లను ప్రాక్టీస్‌ చేయాలి. ప్రణాళికాబద్ధంగా పునశ్ఛరణ చేయాలి. 
– హరిశంకర్, సాంఘికశాస్త్రం ఉపాధ్యాయుడు 

దోషాలు లేకుండా రాయాలి
ప్రతి పాఠాన్ని విద్యార్థులు పలుమార్లు చదవాలి. పద్యాలు సాధన చేయాలి. పువ్వుగుర్తున్న పద్యాలపై ప్రత్యేక శ్రద్ధవహించాలి. పాఠ్యాంశాల్లోని అంశాలే కాకుండా సామర్థ్యాల వారీగా శ్రద్ధపెట్టి చదువుకోవాలి. వ్యాసరూప ప్రశ్నల్లో గద్య, పద్య, ఉపవాచకాల నుంచి రెండేసి ప్రశ్నలుంటాయి. పేపర్‌ –1 లో స్వీయరచన 20 మార్కుల పదజాలంలో 10 మార్కులను సామార్థ్యాల నుంచి పరీక్షిస్తారు. పేపర్‌–2లో పఠనావగాహన, సృజనాత్మకత, వ్యాకరణ అంశాలపై ఇస్తారు. సాధ్యమైనంత వరకు వ్యాకరణం దోషాలు లేకుండా రాయాలి. 
– దూడల వెంకటేశ్, తెలుగు ఉపాధ్యాయుడు 

వందశాతం మార్కులు గణితంలోనే 
వందకువంద మార్కులు సాధించిపెట్టే సబ్జెక్ట్‌ అంటే గణితమే. మెళకువలతో దీన్ని సాధించవచ్చు. ప్రతి అధ్యాయంలో గల పటాలను, గ్రాఫ్‌లను, రేఖా చిత్రాలను, నిర్మాణాలను పలుమార్లు సాధనచేయాలి. ప్రతి అధ్యాయంలోని కీలక భావనల్నీ, ముఖ్య సూత్రాలను కనీసం 2 లేదా 3 సార్లు పునశ్ఛరణ చేసుకోవాలి. సాంఖ్యాక శాస్త్రంలోని ఓజివ్‌ వక్రంగీయడంపై బాగా సాధనచేయాలి. స్వరూప త్రిభుజాలు, అప్లికేషన్స్‌పై, త్రికోణమితులు, అనువర్తనాలు, మాధిరి సమస్యలపై సాధనచేయాలి. 
– చింతకింది మురళి, గణితం ఉపాధ్యాయుడు 

ఆరోగ్యం కీలకం 
పరీక్షల సమయంలో ఆరోగ్యంపై దృష్టిసారించడం కీలకం. ఏడాదంతా చదివిన తరువాత పరీక్షల వేళ అనారోగ్యానికి గురైతే వృథా అవుతుంది. ఎండాకాలం కావడంతో  ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. మంచినీరు, మజ్జిక, కొబ్బరి నీరు తీసుకోవాలి. పదేపదే కాఫీలు, టీలు తీసుకోవద్దు. కూరగాయలు, పప్పుదినుసులు, పాలు, ఆకుకూరలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లను తీసుకుంటే మంచిది. ఆహార నియమాలు పాటించాలి.
      – సౌజన్య, వైద్యురాలు

మరిన్ని వార్తలు