శబరి దరి చేరేదెలా అయ్యప్పా!

1 Dec, 2018 10:05 IST|Sakshi

నగరం నుంచి రెగ్యులర్‌ ట్రైన్‌ ఒక్కటే..  

అన్ని రైళ్లలోనూ   వందల్లో వెయిటింగ్‌ లిస్టు

కొన్ని రైళ్లలో ‘నోరూమ్‌’.. ప్రత్యేక రైళ్లు అరకొరే

సంక్రాంతికి సొంత ఊరికెళ్లడమూ కష్టమే

సాక్షి,సిటీబ్యూరో: నగరం నుంచి సంక్రాంతికి సొంతూరికి వెళ్లేందుకే కాదు.. అయ్యప్ప దర్శనానికి శబరిమల వెళ్లేందుకూ ‘దారి’ కనిపించడం లేదు. ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్న మాలధారులకు సైతం రైళ్లు చుక్కలు చూపిస్తున్నాయి. మరో రెండు నెలల వరకు అంటే వచ్చే ఫిబ్రవరి దాకా అన్ని రైళ్లలో వెయిటింగ్‌ జాబితాయే దర్శనమిస్తోంది. కొన్నింటిలో ‘రిగ్రెట్‌’ కనిపిస్తోంది. ఏటా లక్షలాది మంది నగర వాసులు సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్లకు తరలి వెళ్తారు. ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సుల కంటే రైళ్లే అనుకూలంగా ఉంటాయి. చార్జీలు తక్కుగా ఉండడమే కాకుండా సాయంత్రం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి  ఉదయాన్నే సొంత ఊరు చేరుకొనేందుకు సౌకర్యంగా ఉంటుంది. కానీ అన్ని రైళ్లలోనూ భారీగా పెరిగిన వెయిటింగ్‌ లిస్టు ప్రస్తుతం ప్రయాణికులను వెక్కిరిస్తోంది. మరోవైపు డిసెంబర్‌ రెండో వారం నుంచి సంక్రాంతి వరకు పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు   శబరికి వెళతారు. ఈ ఏడాది కనీసం10 లక్షల మంది వెళ్లే అవకాశం ఉంది. కానీ ద.మ. రైల్వే ప్రకటించిన అరకొర రైళ్లు  ఇటు సంక్రాంతి ప్రయాణికులను, అటు అయ్యప్ప భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది.

నగరం నుంచి చాలా తక్కువ  
ఏటా లాగే ఈ సంవత్సరం కూడా అయ్యప్ప దర్శనానికి  వెళ్లేందుకు నగర భక్తులు ప్రణాళికలు వేసుకుంటున్నారు. కానీ హైదరాబాద్‌ నుంచి శబరికి వెళ్లే ఒకే ఒక్క రైలు శబరి ఎక్స్‌ప్రెస్‌లో ఫిబ్రవరికి కూడా ఇప్పుడే బుక్‌ అయ్యాయి. భక్తుల రద్దీని, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లు వేయాల్సిన అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 90 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. శబరికి వెళ్లే భక్తులు, సంక్రాంతి ప్రయాణికుల కోసం ప్రకటించిన ఈ రైళ్లలో హైదరాబాద్‌ నుంచి బయలుదేరేవి చాలా తక్కువే. పైగా ప్రత్యేక రైళ్లలోనూ బుకింగ్‌లో పూర్తయ్యాయి. ‘కేవలం పది, పదిహేను రైళ్లు మాత్రమే అదనంగా నడుపుతారు. ఎలా వెళ్లి రాగలం’ అంటూ నగరంలోని అయ్యప్ప భక్త సమాజాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చివరి క్షణాల్లో హడావిడిగా ప్రత్యేక రైళ్లను వేసి భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం కంటే ప్రస్తుత రద్దీకి అనుగుణంగా రైళ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 

హడావుడిగా వేస్తే దళారులకే లాభం   
గతంలో మకరజ్యోతి దర్శనం ముంచుకొస్తున్న తరుణంలో  హడావిడిగా కొద్దిపాటి రైళ్లను ప్రకటించారు. ఆ రైళ్లు కూడా విజయవాడ, విశాఖ, కాకినాడ నుంచి బయలుదేరాయి. నగరం నుంచి వెళ్లినవి పరిమితమే. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. పైగా ఉదయం వెళ్లాల్సినవి సాయంత్రం, సాయంత్రం వెళ్లాల్సిన రైళ్లు అర్ధరాత్రి బయలుదేరాయి. సకాలంలో దర్శనానికి చేరుకోలేక భక్తులు నిరాశ చెందారు. పైగా ప్రత్యేక రైళ్లలో నీటి సదుపాయం లేక భక్తులు స్నానం, పూజ చేసుకోలేపోయారు. 

దళారులపై నిఘా ఏదీ
మరోవైపు శబరి ప్రత్యేక రైళ్లలో బెర్తులను ఎగరేసుకు పోయేందుకు దళారులు, ఏజెంట్లు ఇప్పటి నుంచే మోహరించారు. భక్తుల ప్రయాణంపై పెద్ద ఎత్తున బేరం చేసుకొనేందుకు రంగంలోకి దిగారు. ఇలాంటి వారిని నియంత్రించేందుకు నిఘా అవసరం.  ప్రతిసారి ముహూర్తం ముంచుకొచ్చిన తరువాత ప్రత్యేక రైళ్లు ప్రకటించడం వల్ల భక్తుల కంటే దళారులే ఎక్కువగా లబ్ధిపొందుతున్నారు. వారి నుంచి రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈసారి కూడా అయ్యప్ప భక్తులకు అదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంది.  

సంక్రాంతి ప్రయాణమూ కష్టమే..
సంక్రాంతి సెలవుల్లో సుమారు 25 లక్షల మంది నగరం నుంచి వెళుతుంటారు. వీరిలో కనీసం 15 లక్షల మంది రైళ్లపైనే ఆధారపడతారు. రైళ్లలో అవకాశం లేకపోతేనే సొంత వాహనాలు, ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులను ఆశ్రయిస్తారు. ఈ డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక రైళ్లకు ఇప్పటి నుంచి ప్రణాళికలను రూపొందించాల్సి ఉంది. ఇప్పటికే అన్ని రెగ్యులర్‌ రైళ్లలో వెయిటింగ్‌ లిస్టు 150 నుంచి 200 వరకు చేరింది. కొన్నింటిలో ‘నో రూమ్‌’ దర్శనమిస్తోంది. 

మరిన్ని వార్తలు