శిక్షణ లేకుండానే  విధుల్లోకి

22 Jun, 2019 13:01 IST|Sakshi

సాక్షి, నల్లగొండ : శిక్షణ లేకుండానే జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరారు. తెలంగాణ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన పంచాయతీ రాజ్‌ చట్టాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాతే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించింది.  అంతకు ముందే పంచాయతీ కార్యదర్శులకు టీఎస్‌పీఎస్‌సీ ద్వారా పరీక్షలు నిర్వహించారు. ఎన్నికల కోడ్‌తోనియామకాలు ఆగిపోయాయి. ఎన్నికలు పూర్తయితన తర్వాత విధుల్లో చేరారు. వారికి ఎలాంటి శిక్షణ లేకపోవడంతో గ్రామాల్లో కొత్త పంచాయతీ చట్టం ప్రకారం విధులు ఎలా నిర్వహించాలో పూర్తి స్థాయిలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎన్నో సందేహాలతో చేరే ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా నియామకం కాగానే శిక్షణ ఇస్తారు. వీరికి ఎలాంటి శిక్షణ లేకపోవడంతో ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలో మొత్తం 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో  837 పంచాయతీలకు గత జనవరి మాసంలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అనంతరం టీఎస్‌పీఎస్సీ ద్వారా ఎంపికైన పంచాయతీ కార్యదర్శులను జిల్లాకు అలాట్‌ చేయడంతో వారికి జిల్లా పంచాయతీ అధికారి జాయినింగ్‌  ఉత్తర్వులు అందజేయడం.. వెంటనే వారు విధుల్లో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి.

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల నియామకం కాకముందు గతంలో రెండు మూడు పంచాయతీలకు ఒక కార్యదర్శి ఉండేవారు. ప్రస్తుతం కొత్త నియామకాల కారణంగా ప్రతి గ్రామానికి పంచాయతీ కార్యదర్శి ఏర్పాటయ్యాడు. కొత్త పంచాయతీ చట్టం ప్రకారం ప్రతి పంచాయతీకి నర్సరీని ఏర్పాటు చేస్తున్నారు. దాని బాధ్యత పంచాయతీ కార్యదర్శిదే. చట్టం అమలులో భా గంగా సర్పంచ్‌కు, ఉపసర్పంచ్‌కు ఇటీవల ప్రభుత్వం చెక్‌ పవర్‌ను అందించింది. గతంలో సర్పం చ్‌కు, కార్యదర్శికి చెక్‌ పవర్‌ ఉండేది. నిధుల విని యోగానికి సంబంధించిన ఆడిట్‌ మాత్రం సర్పం చ్, కార్యదర్శే చేయాల్సి ఉంది. ఇందులో తప్పిదాలు చోటు చేసుకున్నా ఇబ్బందులు తప్పవు. 

కార్యదర్శుల విధులు
కొత్తచట్టం ప్రకారం పనితీరును ప్రతినెలా వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి. లే అవుట్లు, భవన నిర్మాణాలు, అందుకు సంబంధించిన అనుమతుల కోసం గ్రామపంచాయతీలకు అనుసంధానంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఆ సాఫ్ట్‌ వేర్‌ కూడా ఇప్పటికే జిల్లాకు చేరింది. గ్రామాల్లో ఉపాధి హామీతోపాటు జనన, మరణ, ఇతర గ్రామానికి సంబంధించిన సమాచారానికి సంబంధించి ప్రతి ఒక్క విషయానికి పంచాయతీ కార్యదర్శే ప్రముఖ పాత్ర వహించాలి. విధులు సరిగా నిర్వహించిన కార్యదర్శిపై చర్యలు తీసుకునేందుకు కూడా చట్టంలో ఉంది. తొలగింపు కోసం ప్రత్యేక ట్రిబ్యునల్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. 

శిక్షణ లేకపోవడంతో ఇబ్బందులు
ఏప్రిల్‌ 12న పంచాయతీ కార్యదర్శులు నియామకాలు తీసుకొని అదే రోజు విధుల్లో చేరాలని ఆదేశాలు ఉండడంతో వెంటనే చేరారు. మరుసటి రోజు నుంచే పంచాయతీలకు వారిని కేటాయిం చారు. ప్రస్తుతం కొత్త చట్టం గ్రామంలోని ప్రతి పనికి సంబంధించి కార్యదర్శే బాధ్యత వహించాలి. అది కూడా ఆన్‌లైన్‌ ద్వారానే చేయాల్సి ఉంది. దీంతో ఇబ్బందులు పడుతున్నారు.  

మరిన్ని వార్తలు