రాకపోకలు బంద్

2 Apr, 2015 02:55 IST|Sakshi
రాకపోకలు బంద్

* ప్రవేశ పన్నుతో తెలంగాణ, ఏపీ మధ్య స్తంభించిన రవాణా
* ఆగిపోయిన సరుకులు, నిత్యావసర వస్తువులు
* నిలిచిపోయిన ఇసుక, సిమెంట్, ఇటుకల రవాణా భవన నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం
* మరికొద్ది రోజులు ఇలాగే ఉంటే     పనులన్నీ ఆగిపోయినట్లే!
* ఏపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రైవేటు బస్సుల్లో తగ్గుదల.. కోర్టు మధ్యంతర
* ఉత్తర్వులతో రోడ్డెక్కిన కొన్ని బస్సులు పన్ను మోతను ప్రజలపైనే వేస్తున్న
* నిర్వాహకులు.. 30 శాతం వరకూ చార్జీల పెంపు
* పన్నుపై వెనక్కి తగ్గకపోతే ఆందోళన చేస్తామంటున్న లారీ యజమానుల సంఘాలు

 
 సాక్షి, హైదరాబాద్: వాహనాలపై ప్రవేశ పన్ను విధింపు ఫలితంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చే సరుకు రవాణా, ప్రయాణికుల వాహనాలు ఆగిపోయాయి. నిత్యావసరాలైన పాలు, పండ్లు, కూరగాయలు, పూలు, తమలపాకులు, పప్పు దినుసులు వంటి నిత్యావసరాల రవాణాపైనా దీని ప్రభావం పడింది. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల నుంచి వచ్చే ఇటుక, ఇసుక రవాణా నిలిచిపోయింది. దీంతో భవన నిర్మాణ రంగంపైనా ప్రభావం పడింది. మరికొద్ది రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే నిర్మాణాల పనులు ఆగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఏపీ నుంచి హైదరాబాద్‌కు తరలించే ఇసుక, ఐరన్, సిమెంట్ తదితర వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని భవన నిర్మాణ రంగ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ఇక ప్రవేశ సుంకం విధింపు నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల రాకపోకలు బాగా తగ్గిపోయాయి. దీనికితోడు నిర్వాహకులు చార్జీలను భారీగా పెంచేయడంతో... ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. మరోవైపు ప్రవేశ పన్నును వెనక్కి తీసుకోకపోతే ఆందోళన చేపడతామని తెలంగాణ లారీ యజమానుల సంఘం హెచ్చరించింది.
 
 బస్సులన్నీ బంద్..: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ప్రైవేటు ప్రయాణీకుల బస్సులు నిత్యం 600 వరకూ వస్తుంటాయి. జీవో అమల్లోకి వచ్చిన మంగళవారం అర్ధరాత్రి నుంచే ఈ బస్సులన్నీ ప్రవేశపన్ను చెల్లించాల్సి రావడంతో... 90 శాతానికిపైగా ఏపీలోనే నిలిచిపోయాయి. దీంతో రోజూ హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే 50 వేల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు నడుపుతున్నా... అవి ప్రయాణికుల అవసరాలు తీర్చడం లేదు. ఇక ఏపీ నుంచి హైదరాబాద్‌కు నిత్యం వెయ్యి వరకూ రవాణా వాహనాలు వస్తుంటాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పాలు, కూరగాయలు, సిమెంట్, ఇతర నిత్యావసర వస్తువులను, కర్నూలు జిల్లా నుంచి ఉల్లిగడ్డను హైదరాబాద్‌కు రవాణా చేస్తుంటాయి. కానీ ప్రవేశ సుంకం కారణంగా మంగళ, బుధవారాల్లో 25 నుంచి 30 శాతం రవాణా వాహనాలు మాత్రమే నడిచాయి.
 
 మోత మోగిస్తున్న ఆపరేటర్లు
 ప్రవేశ పన్ను నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు చార్జీలు పెంచేసి, భారాన్ని ప్రజలపైకి నెట్టేశారు. ప్రభుత్వం విధించిన పన్ను ప్రకారం 50 సీట్లున్న బస్సుకు  ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ. 1.83 లక్షలు పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు రెండు రాష్ట్రాలకు కలిపి ఒకే పన్ను చెల్లించిన ఆపరేటర్లు ఇక నుంచి.. రెండు రాష్ట్రాల్లో సీటుకు రూ. 3,675 చొప్పున కట్టాల్సిందే. ఇందుకు అనుగుణంగానే ప్రైవేటు బస్సుల నిర్వాహకులు చార్జీలను పెంచేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, అమలాపురం, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, చిత్తూరు, కడప, బెంగళూరు తదితర ప్రాంతాలకు రోజూ 600కు పైగా ప్రైవేట్ బస్సులు తిరుగుతుంటాయి. అదే పండుగలు, వేసవి సెలవుల వంటి రద్దీ రోజుల్లో ఈ సర్వీసులు రెట్టింపవుతాయి. అయితే ప్రయాణికుల రద్దీని బట్టి ప్రైవేటు ఆపరేటర్లు తరచుగా చార్జీల్లో మార్పులు చేస్తుంటారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విధించిన ప్రవేశ పన్ను దృష్ట్యా చార్జీలను ఒక్కసారిగా పెంచేశారు. ఇవి ముందు ముందు ఇంకా అవ కాశం కూడా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ. 450 చార్జీ ఉండగా.. దానిని రూ. 600కు పెంచేశారు. వైజాగ్ వెళ్లడానికి ఇటీవలి వరకు రూ. 850గా ఉన్న చార్జీ ఇప్పుడు రూ. 1,050కి పెరిగింది. తిరుపతికి రూ. 650 నుంచి రూ. 830కి పెంచారు.
 
 ప్రజలపై తీవ్ర భారం..
 ‘‘ఇప్పటివరకు 23 జిల్లాల్లో సరుకు రవాణా చేస్తూ ఉపాధిని పొందుతున్నాం. పన్ను విధింపు వల్ల తెలంగాణలోని 10 జిల్లాలకే పరిమితం కావాల్సి వస్తుంది. ఇది మా ఉపాధికి పెద్ద దెబ్బ. అక్కడి వాహనాలు కూడా 13 జిల్లాలకే పరిమితమవుతాయి. రెండు రాష్ట్రాల్లో పన్ను చెల్లింపు వల్ల ఆ భారం అంతిమంగా ప్రజలపైనే పడుతుంది. ప్రభుత్వానికి వచ్చే రూ. 40 కోట్ల ఆదాయం కంటే ప్రజలపై పడే రూ. 400 కోట్ల భారం గురించి ఆలోచించాలి. ఏపీ వాహనాలపై పన్ను విధిస్తూ విడుదల చేసిన జీవో 15ను వెంటనే రద్దుచేయాలి. లేదంటే మా ఆందోళనను ఉధృతం చేస్తాం..’’
 - ఎన్.భాస్కర్‌రెడ్డి, తెలంగాణ లారీ యజమానుల సంఘం
 
 వెనుకా ముందూ ఆలోచించరా?
 ‘‘వాహనాలపై పన్ను కేసును హైకోర్టు 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిదాకా హామీ పత్రాలు ఇచ్చి రాకపోకలు సాగించవచ్చని చెప్పింది. తుది తీర్పు కూడా మాకే అనుకూలంగా వస్తుందన్న నమ్మకం ఉంది. పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్. ఏ అవసరమొచ్చినా ఏపీ ప్రజలు హైదరాబాద్‌కు రావాల్సిందే కదా. వెనుకాముందు ఆలోచించకుండా పన్ను విధించడం వల్ల భారం పడేది ప్రజలపైనే.. ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎలా..?’’
 - సుభాష్ చంద్రబోస్, ప్రైవేట్ ఆపరేటర్ల సంఘం

మరిన్ని వార్తలు