మా నిధులు..మా ఇష్టం

1 Apr, 2016 01:44 IST|Sakshi
 రెండేళ్లలో ప్రభుత్వం ఇచ్చింది రూ.36 కోట్లు 
 ఎమ్మెల్యేలు వెచ్చించింది రూ.11.87 కోట్లే..
 ఎమ్మెల్సీల ఖర్చూ అంతంతమాత్రమే..
 శేఖర్‌రెడ్డి, పద్మావతి, సునీత, ప్రభాకర్‌రెడ్డి, కిశోర్ కొంత మెరుగు
 మిగిలిన వారిది నామమాత్రపు ఖర్చే.. ఆ నిధులనే పట్టించుకోని జానా, ఉత్తమ్
 మంత్రి జగదీశ్‌రెడ్డి ఖర్చు పెట్టిందీ తక్కువే.. ఎమ్మెల్సీల్లో పూల రవీందర్ కొంత మెరుగే..
 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఎమ్మెల్యే కోటాలో రూ.75 లక్షలు, మంత్రి కోటాలో మరో రూ.75లక్షలు.. ఇలా ఏటా రూ. కోటిన్నర.. ఈ నిధులన్నీ మన ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఖర్చు చేసుకునేందుకు ఉద్దేశించినవి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, చేపట్టే ప్రాజెక్ట్‌లు, సంక్షేమ కార్యక్రమాలతో సంబం ధం లేకుండా ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల అభివృద్ధికి,  ఇష్టమైన           పనుల కోసం వీటిని ఖర్చు చేయొచ్చు. ఎమ్మెల్యే గారు ఫలానా పని కోసం అని ప్రతిపాదన పంపితే చాలు నిధుల మం జూరుకు గ్రీన్‌సిగ్నల్ ఇయ్యొచ్చు. ఇది ఆయా ఎమ్మెల్యేల ఇష్టం. కానీ ‘మా నిధులు.. మా ఇష్టం’ అనుకున్నారో ఏమో.. మన జిల్లా ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సీడీపీ) వెచ్చించడంలో మాత్రం వెనుకబడ్డారు. 
 
 మూడో వంతు కూడా ఖర్చు చేయలేదు...
 రెండు ఆర్థిక సంవత్సరాలకు (2014-15, 2015-16) సంబంధించి జిల్లాకు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు కలిపి ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లో మూడో వంతు ఖర్చు చేయలేదు. రెండేళ్లలో ఎమ్మెల్యేల నిధుల కింద (ఈ ఏడాది మార్చి 30 నాటికి) ప్రభుత్వం మొత్తం రూ.36 కోట్లు మంజూరు చేసింది. ఇందులో జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేలు ఖర్చు చేసింది కేవలం రూ.11.87 కోట్లే. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఒక్కరే రెండేళ్లలో కలిపి 60 శాతం నిధులు ఖర్చు చేశారు. ఏడాదికి రూ.కోటిన్నర చొప్పున రెండేళ్లకు ఆయన కోటాలో రూ.3 కోట్లు మంజూరు కాగా, రూ.1.83 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. 
 
  ఇక.. ఆ తర్వాతి స్థానాల్లో మునుగోడు ఎమ్మెల్యే కె.ప్రభాకర్‌రెడ్డి రూ.1.53 కోట్లు (మొత్తం నిధుల్లో సగం), ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి రూ.1.45 కోట్లు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రూ.1.31 కోట్లు, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ రూ.1.23 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఐదుగురు కలిపి రూ.7 కోట్లకు పైగా ఖర్చు చేయగా, మిగిలిన ఏడుగురు ఖర్చు చేసింది రూ. 5 కోట్ల పైచిలుకే.  
 
 ఎమ్మెల్యేలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అయితే అసలు నియోజకవర్గ అభివృద్ధి నిధులనే పట్టించుకోలేదని అర్థమవుతోంది. జానారెడ్డి రెండేళ్లలో కలిపి ఖర్చు పెట్టింది కేవలం రూ.49.72 లక్షలే. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రెండేళ్లలో కలిపి అందరికన్నా తక్కువగా రూ.44.66 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా నియోజకవర్గ నిధుల గురించి పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆయనకు రెండేళ్లలో రూ.3 కోట్లు మంజూరు కాగా, ఖర్చు పెట్టింది రూ.89.09 లక్షలే . 
 
 ఎమ్మెల్సీలూ అంతే...!
 ఎమ్మెల్సీలకు ఏటా వచ్చే రూ.1.5 కోట్లకు గాను కనీసం సగం కూడా ఖర్చు పెట్టలేకపోయారు. 2015-16 సంవత్సరానికి జిల్లాలోని నలుగురు ఎమ్మెల్సీల (పూల రవీందర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, నేతి విద్యాసాగర్)కు కలిపి రూ.6 కోట్లు రావాల్సి ఉండగా, రూ.3.75 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ఖర్చు పెట్టింది  కేవలం రూ.58లక్షలే. 2014-15లో ముగ్గురు ఎమ్మెల్సీలుండగా (పల్లా రాజేశ్వర్‌రెడ్డి లేరు), మొత్తం రూ.4.50 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద మంజూరయ్యాయి. ఇందులో రూ.3.26 కోట్లు ఖర్చు పెట్టారు మన ఎమ్మెల్సీలు. 
 
 కొత్త ఎమ్మెల్యేలే నయం
 జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 12 మం దిలో నలుగురు ఒకటి కన్నా ఎక్కువ సార్లు గెలిచిన వాళ్లు కాగా, ఎనిమిది మంది కొత్త ఎమ్మెల్యేలే. నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఖర్చు పెట్టడంలో మాత్రం సీనియర్ల కన్నా కొత్తగా గెల్చిన ఎమ్మెల్యేలే ముందంజలో ఉన్నారు. ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసిన టాప్ నలుగురూ కొత్త ఎమ్మెల్యేలే కావడం విశేషం. అయితే.. ఒకటి కన్నా ఎక్కువ సార్లు గెలిచిన నలుగురు ఎమ్మెలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి, రవీంద్రకుమార్‌లో ఏ ఒక్కరు కూడా రెండేళ్లలో రూ.కోటికి మించి ఖర్చు చేయలేదు. 
 
 కొత్తగా గెలిచిన వారిలో నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం రూ.42.72లక్షలు, మిర్యాలగూడ ఎమ్మెల్య భాస్కర్‌రావు రూ.58.64లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. జిల్లా కేంద్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన నియోజకవర్గ అభివృద్ధి పనుల నుంచి ఖర్చు చేసింది రూ.89.17లక్షలే. ఇక సీపీఐ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రవీంద్రకుమార్ (దేవరకొండ) కూడా సీడీపీ నిధుల వినియోగంలో వెనుకబడే ఉన్నారు. ఆయన రెండేళ్లలో కలిపి ఖర్చు చేసింది కేవలం రూ.75.14 లక్షలే కావడం గమనార్హం. 
 
Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు