పప్పన్నమే..

30 Aug, 2018 09:05 IST|Sakshi
లింగంపల్లి పాఠశాలలో బోజనంచేస్తున్న విద్యార్ధులు  

ఎదిగే పిల్లలు.. శారీరక, మానసిక ఎదుగుదల పాఠశాలలోనే జరుగుతుంది. ఈ సమయంలో విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందాలి. పుష్టిగా భోజనం అందిస్తే విద్యార్థి అన్ని రకాలుగా ఎదిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత ధరల ప్రభావం విద్యార్థుల భోజనంపై పడింది. ధరలు పెరిగిపోవడంతో ప్రభుత్వం సూచించిన మెనూ ఎక్కడా పాటించడం లేదు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందలేదు.     

కుల్కచర్ల వికారాబాద్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ధరల మంట అంటుకుంది. ధరలు భారీగా పెరగడంతో ఏజెన్సీల నిర్వాహకులు కూరగాయలను కొనలేకపోతున్నారు. దీంతో విద్యార్థుల భోజనంలో కూరగాయలు కనిపించడం లేదు. విద్యార్థులకు కేవలం పప్పుచారు, అన్నం వడ్డిస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. కూరగాయలు ధరల ప్రభావం మధ్యాహ్న భోజనంపై తీవ్రంగా పడింది. పెరిగిన కూరగాయల ధరలు మధ్యాహ్న భోజనంపై ప్రభావం చూపుతున్నాయి.

మార్కెట్‌లో అన్ని కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ధరలు పెరగడంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలతో కూరగాయలను కొని వండితే అప్పుల పాలు కావాల్సిందేనని నిర్వాహకులు అంటున్నారు. దీంతో విద్యార్థులకు పప్పన్నం వడ్డిస్తున్నారు. ఈ భోజనాన్ని విద్యార్థులు సగం కడుపుకే తింటున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తోంది. 

అర్ధాకలితో విద్యార్థుల సతమతం

బడుల్లో మధ్యాహ్న భోజనం రుచి లేకపోవడంతో పిల్లలు కడుపునిండా తినడం లేదు. రోజూ పప్పుచారే వడ్డిస్తుండడంతో పిల్లలు చాలామంది ఇళ్లకు వెళ్లి తింటున్నారు. పక్క గ్రామాల నుంచి వచ్చే పిల్లలు సగం ఆకలితో ఉంటున్నారు. ఈ విషయ మై మధ్యాహ్న భోజన నిర్వాహకులను అడిగితే కూరగాయల ధరలు పెరగడంతో పప్పు వండుతున్నామని బదులిస్తున్నారు. పెరిగిన ధరలతో కూరగాయలు కొనుగోలు చేస్తే అప్పుల పాలు కావాల్సిందేనన్ని నిర్వాహకులు వాపోతున్నారు. 

పెరిగిన ధరలు 

ప్రభుత్వం పాఠశాలల్లో  సన్నబియ్యంతో భోజనం అందిస్తుండగా.. అయితే పెరిగిన కూరగాయల ధరలతో విద్యార్థులకు చారన్నమే దిక్కవుతోంది. కూరగాయాలు కిలో రూ.60కి చేరాయి. దీంతోభోజన ఏజెన్సీ నిర్వాహకులు మధ్యాహ్న భోజనం నిర్వహించలేమని చేతులెత్తేస్తున్నారు. పప్పుతో చేసిన  చారును మాత్రమే వడ్డిస్తున్నారు. చాలా పాఠశాలల్లో నీళ్ల చారే వడ్డిస్తున్నారు. పచ్చిమిరపకాయలు రూ.120, టమాటా కిలో రూ.60పైనే ఉంటున్నాయి. బీర కాయ, పాలకూర, వంకాయ, క్యారెట్‌తోపాటు ఆకుకూరల ధరలు భారీగానే పెరిగాయి. ఈ నేపథ్యంలో చాలా పాఠశాలల్లో మిర్చి, టమాటాలను అసలే వాడడం లేదు. 

ఇది మెనూ 

మెనూలో భాగంగా సోమ, గురువారం గుడ్డు, సాంబారు అందించాలి. మంగళ, శుక్రవారాల్లో ప ప్పు, కూరగాయలతో భోజనం ఉండాలి. బుధ, శనివారాల్లో పప్పు, ఆకుకూరలతో మధ్యాహ్నం భోజనం ఇవ్వాలి. ఒక్కో విద్యార్థికి 75 గ్రాముల కూర ఇవ్వాలని నిబంధన. అయితే కూరగాయల ధరలు భారీగా పెరగడంతో ఎక్కడా కూడా మెనూ పాటించడం లేదు. 

భోజనం మోతాదు ఇది.. 

మధ్యాహ్న భోజనం పథకాన్ని స్వయం సహాయక సంఘాల మహిళలు నిర్వహిస్తున్నారు. పౌర సరఫరాల శాఖ బియ్యాన్ని సరఫరా చేస్తోంది. 1 నుంచి 5వ తరగతుల వారికి ఒక్కొక్కరికి ప్రభు త్వం రోజుకు రూ.4.13, 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు రూ.6.18 పైసలు చెల్లిస్తోంది. గుడ్డు ఉన్న రోజు రూ.4 అదనంగా అందిస్తారు.మెనూ తప్పనిసరిగా పాటించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా ప్రభు త్వం సూచించిన మెనూ పా టించాలి. అలా పాటించ ని మధ్యాహ్న భోజనం ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటాం. బిల్లులు నిలిపివేస్తాం. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా మెనూ అమలయ్యేలా చూడాలి. 

– అబిబ్‌హమ్మద్, కుల్కచర్ల మండల విద్యాధికారి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గేదెల దొంగతనం కేసు: ఏసీబీ వలలో చిక్కిన ఎస్సై

ప్రేమించినవాడు కాదన్నాడని...

ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు తెలంగాణ కేబినెట్‌ ఆమోదం

జయరాం కేసు: రౌడీషీటర్ల అరెస్ట్‌కు రంగం సిద్ధం

ఐదో విడత అంతేనా? 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాలీవుడ్‌కు ‘శివపుత్రుడు’

నానితో రకుల్‌ స్పెషల్‌ సాంగ్‌!

శౌర్యం యొక్క నిజమైన కథ.. కేసరి

ప్రముఖ నిర్మాత కన్నుమూత

సాహో సెట్‌లో స్టార్ హీరో

అలాంటి పాత్రలివ్వండి ప్లీజ్‌!