గోదారి..ఎడారి

27 Apr, 2019 02:00 IST|Sakshi

అడుగంటుతున్న ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌ 

బాసర వద్ద భక్తులకు ఇక్కట్లు 

బురదనీటిలోనే స్నానాలు, పూజలు 

మొదలైన తాగు, సాగు నీటి కష్టాలు

నిర్మల్‌: బాసర క్షేత్రం వద్ద గోదారమ్మ చుక్క నీరు లేకుండా ఎండిపోతోంది. పవిత్ర స్నానాలు చేసేందుకు వస్తున్న భక్తులు నదిలో అక్కడక్కడ ఉన్న బురదగుంటల్లోని నీళ్లనే చల్లుకుంటున్నారు. పవిత్ర నదిలో తమవారి అస్థికలను నిమజ్జనం చేసేందుకు వచ్చిన వారికి ఇక్కడా కన్నీళ్లే మిగులుతున్నాయి. పారే నీళ్లు లేకపోవడంతో బురద నీళ్లలోనే నిమజ్జనం చేసి, చేతులు జోడిస్తున్నారు. సరస్వతీ అమ్మవారికి గోదావరి జలాలతో పూజలు చేసే పరిస్థితి లేదు. బాసర పుణ్యక్షేత్రంతో పాటు ఇక్కడి ట్రిపుల్‌ఐటీ, సమీప గ్రామాలకూ నీటి కష్టాలు మొదలవుతున్నాయి. తాగునీటితో పాటు సాగు నీటి కోసం గోదావరిపై నిర్మించిన ఎత్తిపోతల పథకాలకు నీరందడం లేదు. 

అడుగంటిన నీళ్లు 
గోదావరి నది మహారాష్ట్ర నుంచి బాసర వద్ద మన రాష్ట్రంలోకి అడుగు పెడుతోంది. నదికి ఓ వైపు నిర్మల్‌ జిల్లా, మరోవైపు నిజామాబాద్‌ జిల్లా ఇలా రెండు వైపులా మన రాష్ట్రం సరిహద్దుగా ఉండేది ఇక్కడే. దిగువన సుమారు 55 కి.మీ. దూరంలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) ఉన్నందున బాసర వద్ద గోదావరిలో ఎప్పుడూ నీళ్లుండేవి. ఎంత ఎండా కాలమైనా కనీసం చిన్న పాయలా గోదావరి పారుతుండేది. కానీ ఈసారి.. ఎగువన బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీళ్లు రాకపోవడం.. దిగువన ఎస్సారెస్పీలో 7 టీఎంసీలకు నీటి నిల్వ పడిపోవడంతో గోదావరి ఎడారిలా మారింది. ఎగువన 25–30 కి.మీ దూరంలో ఉన్న బాబ్లీ ప్రాజెక్టు నుంచి బాసర దిగువన మరో 25 కి.మీ దూరం వరకూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడక్కడ నీటిగుంటలు తప్ప గోదావరంతా అడుగంటిన నీళ్లతో ఎడారిని తలపిస్తోంది.  

గొంతెండుతోంది.. 
గోదావరిలో నీళ్లు లేకపోవడంతో సరిహద్దు గ్రామాల గొంతెండుతోంది. ఎస్సారెస్పీ నుంచి తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు వరకు నిర్మల్, నిజామాబాద్‌ జిల్లాలో కలిపి 20కిపైగా ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌పైనే ఆధారపడి ఇవి నీటిని ఎత్తిపోస్తున్నాయి. ఇప్పుడు చుక్కనీరు లేకపోవడంతో పథకాలన్నీ మూలనపడ్డాయి. బాసర గోదావరి వద్ద నుంచే స్థానిక ట్రిపుల్‌ ఐటీకి నీటిని సరఫరా చేస్తారు. గోదావరిలో నీటి లభ్యత ఉన్నన్ని రోజులూ ఈ పథకం ద్వారా తమ క్యాంపస్‌ పరిధిలోని చెరువులో నింపుతారు. ప్రస్తుతం ట్రిపుల్‌ఐటీ చెరువులో సరిపడా నీళ్లున్నాయి. కానీ మరో రెండు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే అక్కడి వేల మంది విద్యార్థులకూ నీటికష్టాలు తప్పవు. గోదావరి సరిహద్దు గ్రామాలపైన నీటి ప్రభావం పడుతోంది. 

మత్స్యకారులకు పెద్దదెబ్బ 
గంగమ్మపైనే ఆధారపడి బతుకుతున్న వేలాది మత్స్యకార కుటుంబాలకూ కష్టాలు మొదలయ్యాయి. అక్కడక్కడ ఉన్న చిన్నగుంటల్లో రోజంతా వల వేసి కూర్చున్నా.. ఒకట్రెండు చేపలకు మించి దొరకడం లేదంటున్నారు. బాసర ఘాట్ల వద్ద చాలామంది పడవలను వదిలేసి కూలి పనులకు వెళ్తున్నారని, ఉన్న కాస్త నీటి గుంటలోనే పడవ నడుపుతున్న గంగారాం చెబుతున్నారు. మత్స్యకారులు, పడవలు నడిపే వారితో పాటు భక్తులు స్నానాలు ఆచరించిన తర్వాత గోదావరిలో వేసే నాణేలను సేకరించుకుని పొట్టపోసుకునే మహిళల పరిస్థితీ దీనంగా మారింది.  

ఇంత దూరమొస్తే..
మాది మహారాష్ట్రలోని పర్భణి. బాసర వస్తే అమ్మవారి దర్శ నంతో పాటు గోదావరిలో పవిత్ర స్నానం చేయ వచ్చని భావించాం. అంత దూరం నుంచి ఇక్కడి వస్తే.. చుక్క నీళ్లు లేవు. ఇంటిల్లిపాది గోదావరిలో ఉన్న బురదనీళ్లనే చల్లుకున్నం. ఆలయం వాళ్లు పెట్టిన షవర్లు కూడా పని చేస్తలేవు.
    –పవార్, పర్భణి, మహారాష్ట్ర  

‘కాళేశ్వరం’తోనే ‘పునరుజ్జీవం’ 
కాళేశ్వరం పథకం పూర్తయితేనే గోదావరి ఆయకట్టుకు, నదిపై ఆధారపడ్డ గ్రామాలకూ నీళ్లందే పరిస్థితులు ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్నీ చేపడుతోంది. కాళేశ్వరం పథకంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మధ్యమానేరుకు ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించే పైపులైన్‌ వరద కాలువ (ఎస్సారెస్పీ నుంచి 102 కి.మీ వద్ద) మీదుగా వెళ్తుంది. ఇక్కడే పైపులైన్‌ను ఓపెన్‌ చేసి నీటిని వరదకాల్వలోకి మళ్లిస్తారు. ఆ నీటిని ఎస్సారెస్పీలోకి చేర్చడానికి వరద కాలువలో క్రాస్‌ రెగ్యులేటర్‌ గేట్లను బిగిస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్, ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావుపేట, నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలంలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టు వద్ద వరదకాలువలో పంప్‌హౌస్‌లను నిర్మిస్తున్నారు. వాటిలో చేరిన నీటిని మోటార్ల ద్వారా ఎత్తిపోసి శ్రీరాంసాగర్‌లోకి తరలిస్తారు. కాళేశ్వరం నుంచి రోజుకు ఒక టీఎంసీ చొప్పున వరద కాలువ ద్వారా రివర్స్‌ పంపింగ్‌ పద్ధతిలో ఎస్సారెస్పీకి తరలిస్తారు. అరవై రోజుల్లో 60 టీఎంసీల నీటిని తీసుకొచ్చేందుకు రూ.1067 కోట్లతో పనులు చేపడుతున్నారు. ఈ పనులు పూర్తయితేనే గోదావరిపై ఆధారపడ్డ రైతాంగం, మత్స్యకారులతో పాటు బాసర భక్తులకూ ఇక్కట్లు తీరనున్నాయి.

తెప్ప విడువడానికి వస్తే..
గోదావరిలో తెప్ప విడువడం మా ఆనవాయితీ. ప్రతీ ఏడాది బాసరకు వచ్చి గంగలో తెప్ప విడిచి గంగమ్మకు నైవేద్యం పెట్టి పూజలు చేస్తుంటం. ఈసారీ అట్లనే బాసరకు వచ్చినం. కానీ ఇక్కడ నీళ్లు లేవు. చేసేది లేక బురదనీళ్లలోనే తెప్పను విడిచి పెట్టాల్సి వస్తుంది.
- రాహుల్, ఎగ్డోలి, మం.కోటగిరి, కామారెడ్డిజిల్లా

బతుకులు ఎండుతున్నయ్‌
గంగమ్మను నమ్ముకున్న గంగపుత్రులం. పొద్దున్నుంచి నీళ్లలోనే ఉండేటోళ్లం. ఇప్పుడు గంగలో నీళ్లు లేక మా బతుకులు కూడా ఎండుతున్నయ్‌. అక్కడక్కడ ఉన్నబురదగుంటల్లో చేపలు పడుతున్నం. ఎండకు
ఆ నీళ్లు కూడా ఎండిపోతున్నయ్‌.
    –సాయిలు,మత్స్యకారుడు, బాసర్‌ 

మరిన్ని వార్తలు