‘పానీ’ పాట్లు

7 Mar, 2015 01:44 IST|Sakshi
‘పానీ’ పాట్లు

హైదరాబాద్ శివార్లలో మంచి నీటికి కటకట
 
 ఎండాకాలం రాకముందే హైదరాబాద్ శివార్లు గొంతెండుతున్నాయి.. మహానగరంలో విలీనమవడంతో గ్రేటర్‌లోని శివారు ప్రజలు ‘పానీ’ పాట్లు పడాల్సి వస్తోంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడం... బోరు బావులు వట్టి పోవడంతో గొంతు తడుపుకునేందుకు జేబులు గుల్ల చేసుకోవాల్సి వస్తోంది.. మంచి నీళ్ల కోసం డబ్బును ‘నీళ్ల’లా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా జలమండలి ప్రేక్షక పాత్రే వహిస్తోంది... ప్రభుత్వం మౌనంగానే చూస్తోంది..
 
 సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ శివారువాసులకు క‘న్నీటి’ కష్టాలు మొదలయ్యాయి. మహానగరంలో విలీనమైన 11 శివారు మున్సిపాలిటీలు, సమీప గ్రామాల్లోని సుమారు వెయ్యి కాలనీలు, బస్తీల్లో మార్చి ప్రారంభంలోనే నీటి ఎద్దడి ప్రారంభమైంది. దాదాపు 30 లక్షల మంది నీటి కోసం రోజూ ‘జలయజ్ఞం’ చేయాల్సిన పరిస్థితి దాపురించింది. శివారు ప్రాంతాల్లో జలమండలి మంచి నీటిని సరఫరా చేయకపోవడం, వర్షపు నీటిని సద్వినియోగం చేసే ఇంకుడు గుంతలు లేకపోవడం, బోరుబావులు వట్టి పోవడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. ఇక్కడ పలు ప్రాంతాల్లో 2,000 అడుగుల వరకు బోర్లు వేసినా చుక్క నీరు దొరకడం లేదు. దాహార్తి తీర్చుకోడానికి ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. రోజువారీ వినియోగం కోసం నెలకు రూ.2,000 నుంచి రూ.5 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది.  ప్రగతినగర్, నిజాంపేట్, బోడుప్పల్, కాప్రా,

మల్కాజిగిరి,అల్వాల్,యాప్రాల్,మాదాపూర్,శేరిలింగంపల్లి,బాలానగర్,కుత్బుల్లాపూర్,మియాపూర్,చందానగర్,ఎల్బీనగర్,బండ్లగూడ,గాజులరామారం తదితర శివారు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రమవుతోంది. ఇక్కడ ఇంటి అద్దెతో పాటు అందులో సగం మొత్తాన్ని అదనంగా నీటి కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక కొన్ని బస్తీల్లో మహిళలు గుక్కెడు మంచి నీటికి బిందెలతో యుద్ధం చేయాల్సి వస్తోంది. ఇటీవల బోడుప్పల్‌లో నీటి కోసం ప్రజలు రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు.
 
 ప్రేక్షకపాత్రలో జలమండలి..
 
 గ్రేటర్ పరిధిలో 20 లక్షల నివాస సముదాయాలుండగా.. జలమండలి 8.64 లక్షల నివాసాలకు మాత్రమే రోజూ 340 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా చేస్తోంది. కొన్ని చోట్ల వారం, మరికొన్ని చోట్ల 15 రోజులకోసారి సరఫరా జరుగుతోంది. బోడుప్పల్, మేడిపల్లిలోని కొన్ని చోట్ల నెలకో రోజు మాత్రమే కుళాయిల్లో నీళ్లొస్తాయి. 11 మున్సిపల్ సర్కిళ్ల పరిధిలోని వెయ్యికి పైగా కాలనీల్లో రిజర్వాయర్లు, పైప్‌లైన్లు లేవు. ఇక్కడి వారు బోరు బావులపైనే ఆధారపడి దాహార్తిని తీర్చుకోవాల్సివస్తోంది.
 
 2,000 అడుగుల లోతుల్లోకి వెళ్లినా..
 
 గ్రేటర్ పరిధిలోని దాదాపు అన్ని మండలాల్లో భూగర్భ జల మట్టాలు గతేడాదితో పోలిస్తే బాగా తగ్గాయి. బహదూర్‌పురా మండలం మినహా ఆసిఫ్‌నగర్,చార్మినార్,నాంపల్లి,హయత్‌నగర్,సరూర్‌నగర్,శేర్,ఉప్పల్,చార్మినార్,బండ్లగూడ,ఘట్‌కేసర్,మేడ్చల్ తదితర మండలాల్లో భూగర్భ జల మట్టా లు గణనీయంగా పడిపోయాయి. మొత్తంగా గ్రేటర్ పరిధిలో గతేడాది సగటున 7.97 మీటర్ల లోతున భూగర్భ జలాల జాడ దొరకగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 10.46 మీటర్ల లోతుకు వెళితే గాని నీటి జాడ దొరకడం లేదు. అంటే గతేడాది కంటే ఈసారి అదనంగా 2.49 మీటర్ల మేర నీటిమట్టం పడిపోయిందన్నమాట.
 
 నిజాంపేట్... నీళ్లు లేక
 ఖరీదైన నిజాం పేట్ ఏరియాలో ఇంటి అద్దెలు సుమారుగా  రూ.6 వేలు. ఇక నీటి కోసం వీరు అదనంగా మరో రూ. 3 వేలు చెల్లించాల్సి వస్తోంది. ఇటీవల మంజీరా నీళ్ల కోసం ఇక్కడ వాటర్ ట్యాంక్‌ను నిర్మించారు. కానీ, సరిపడా నీటి సరఫరా మాత్రం లేదు. దీంతో చాలా మంది బోరు నీటిపైనే ఆధారపడుతున్నారు. ఎండాకాలం రాకముందే ఆ బోరుబావులు కూడా అడుగంటుతున్నాయి. దీంతో ఇక్కడివారు రూ.1,400 చెల్లించి ప్రైవేట్ నీటి ట్యాంకర్లను కొనుగోలు చేస్తున్నారు.
 
 ఉప్పల్... తిప్పల్..
 హైదరాబాద్‌లో అత్యంత ముఖ్య ప్రాంతమైన ఉప్పల్‌లోనూ నీటి కష్టాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి... ఇక్కడ భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. ఇక బోడుప్పల్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ 25 వేల మంది నివసిస్తున్నారు. మొత్తం 12,304 నల్లా కనెక్షన్‌లున్నాయి. రోజుకు 10 వేల కిలో లీటర్లు తాగునీరు అవసరం ఉంటే.. 3,340 కిలో లీటర్ల మంచినీళ్లు మాత్రమే సరఫరా అవుతున్నాయి.  2002 జనాభా లెక్కల ప్రకారం సరఫరా జరగడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీర్జాదిగూడలో వారానికి ఒకసారి మాత్రమే కొన్ని కాలనీల్లో మంచి నీళ్లు వస్తాయి. ఇక్కడి బుద్ధానగర్,మల్లికార్జున నగర్‌లలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. మేడిపల్లిలో అయితే నెలకోసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. అదికూడా కేవలం 30 నిమిషాలు మాత్రమే. ఇక్కడ అందరూ ట్యాంకర్ నీళ్లు కొనాల్సిందే. రామంతాపూర్‌లోని కొన్ని కాలనీల్లో 2,000 అడుగుల మేర బోరు వేసినా చుక్క నీరు కూడా కనిపించడం లేదు. ఇటీవల నెహ్రూనగర్‌లో జీహెచ్‌ఏంసీ అధికారులు 1,500 అడుగుల లోతుకు బోరు వేసినా నీటి జాడ దొరకలేదు.
 
 హైటెక్ సిటీలో
 అదే పరిస్థితి...
 మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, చందానగర్, కొండాపూర్ తదితర ప్రాంతాలలో బోరుబావుల్లో నీళ్లు లేకపోవడంతో మంచినీటి సమస్య తీవ్రమైంది. ఇక్కడ అపార్ట్‌మెంట్ వాసులు నెలకు రూ.2,500 వరకు మంచి నీటికోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. ఉదాహరణకు మియాపూర్‌లోని ఎస్.ఆర్.ఎస్టేట్స్‌లో 322 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇందు లో దాదాపు వెయ్యి మందికిపైగా నివసిస్తున్నారు. జలమండలి కనెక్షన్ ఉన్నప్పటికీ తగిన ంత తాగు నీరు లేక వీరు ప్రతిరోజూ 35 ట్యాంకర్ల నీటిని కొంటున్నారు.
 
 అంకెల్లో దాహార్తి...
 
 30 లక్షలు... గ్రేటర్‌లోని శివారు ప్రాంతాల్లో దాహార్తితో అలమటిస్తున్న ప్రజలు
 
 1,000...హైదరాబాద్‌లో విలీనమైన 11 శివారు మున్సిపాలిటీల పరిధిలోని నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలు
 
 2,200..ప్రైవేటు ట్యాంకర్ నీళ్లు కొనుగోలు చేయడానికి  కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు గరిష్టంగా ఖర్చు చేస్తున్న మొత్తం
 
 2,000...కొన్ని చోట్ల భూగర్భ జలాలు పడిపోవడంతో 2,000 అడుగుల లోతుకు వెళ్లినా చుక్క నీరు కనిపించడం లేదు..

మరిన్ని వార్తలు