మద్యం అమ్మకాలు తగ్గుముఖం!

30 May, 2020 13:15 IST|Sakshi
పాలమూరులో మద్యం కొనుగోలు చేస్తున్న మందుబాబులు

పనులు, పైసలు లేక దుకాణాల వైపు చూడని మందుబాబులు

సర్కార్‌కు భారీగా తగ్గుతున్న ఆదాయం

మహబూబ్‌నగర్‌ క్రైం: ఇదివరకు ఆరోగ్యం క్షీణిస్తుందని, జేబులకు చిల్లు పడుతుందని తెలిసినా మందుబాబులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఏదో సాకుతో పీకలదాక తాగేసి చిందులేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్నందున పని దొరకక, చేతిలో పైసలు లేక మద్యం ప్రియులు గిలగిలలాడుతున్నారు. చాలామంది మద్యం దుకాణాల వైపే వెళ్లడం లేదు. దీంతో కొన్నిరోజులుగా మద్యం అమ్మకాలు భారీగా తగ్గాయి. సర్కారు ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ప్రభుత్వం 16 శాతం ధర పెంచడం, వలస కూలీలు స్వగ్రామాలకు వెళ్లడం కూడా అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

రోజుకు రూ.3 కోట్లలోపే..
ఉమ్మడి జిల్లాలో 164 మద్యం దుకాణాలుండగా 157 మాత్రమే తెరుచుకున్నాయి. వీటికితిమ్మాజిపేట డిపో నుంచి మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఉన్న మద్యం దుకాణాలకు మద్యం సరఫరా కాగా, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలకు కొత్తకోట దగ్గర ఉన్న డిపో నుంచి మద్యం సరఫరా అవుతోంది. గతంలో అన్ని దుకాణాల్లో కలిపి నిత్యం సుమారు12 వేల కాటన్ల బీర్లు, 8 వేల కాటర్ల లిక్కర్‌ అమ్ముడవుతోంది. వీటి విలువ రూ.6.50 కోట్లు ఉంటుంది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగాఈ నెల ఆరో తేదీన తెరుచుకున్న దుకాణాల్లో మొదట్లో కొన్నిరోజులు బీరు, లిక్కర్‌ అమ్మకాలు జోరుగా సాగినా అనంతరం తగ్గుముఖం పట్టాయి. వారం రోజులుగా నిత్యం రూ.3 కోట్ల లోపే మద్యం అమ్ముడవుతోంది. దీంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. చివరకు ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు సైతం తలలుపట్టుకుంటున్నారు. 25 నుంచి 30 శాతంవరకు మద్యం విక్రయాలతోనే సర్కార్‌కు ఆదాయం వచ్చేది.

మద్యం సరఫరా ఇలా..
లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఈ నెల 6న ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలు తెరిచారు. నాటి నుంచి 26వ తేదీ వరకు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లాలకు కలిపి తిమ్మాజీపేట డిపో నుంచి ఐఎంల్‌ 1,20,948 కాటన్లు, బీరు 1,19,993 కాటన్లు మొత్తం 2,40,965 కాటన్లు దుకాణాలకు సరఫరా అయ్యాయి. వీటి విలువ రూ.102.26 కోట్లు. అదేవిధంగా గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు కొత్తకోట మద్యం డిపో నుంచి 91 వేల కాటన్ల లిక్కర్, 64,250 కాటన్ల బీరు.. మొత్తం 1,54,570 కాటన్ల మద్యం దుకాణాలకు సరఫరా అయింది. వీటి విలువ రూ.74.10 కోట్లు.

మరిన్ని వార్తలు