ఇద్దరికి పదవులు

2 Mar, 2017 11:59 IST|Sakshi
ఇద్దరికి పదవులు
► హస్తకళల సంస్థ చైర్మన్‌గా బొల్లం సంపత్‌
► ఖాదీ పరిశ్రమల సంస్థ చైర్మన్‌గా యూసుఫ్‌
► నామినేటెడ్‌ పదవులు ప్రకటించిన సీఎం
► ఉమ్మడి జిల్లాలోని టీఆర్‌ఎస్‌ సీనియర్ల నారాజ్‌
 
సాక్షి, వరంగల్‌ : అధికార పార్టీలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పది రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. అందులో వరంగల్‌ నగరానికి చెందిన ఇద్దరికి పదవులు దక్కాయి. తెలంగాణ రాష్ట్ర హస్తకళల సంస్థ చైర్మన్‌గా బొల్లం సంపత్‌కుమార్‌ గుప్తాను, ఖాదీ–గ్రామీణ పరిశ్రమల సంస్థ చైర్మన్‌గా మౌలానా మహ్మద్‌ యూసుఫ్‌ జాహిద్‌ను నియమించారు.
 
వీరిద్దరూ వరంగల్‌ అర్బన్‌ జిల్లా వారే. తెలంగాణ ఉద్యమంలో, టీఆర్‌ఎస్‌లో క్రియాశీలకంగా పనిచేసిన వారు వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్నావారి కంటే ముందుగా వీరిద్దరికి పదవులు ఇవ్వడంపై ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నామినేటెడ్‌ పదవుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టడంతో తమకు అవకాశం వస్తుందని ఆశించిన పలువురు సీనియర్‌ నేతలు అసంతృప్తికి లోనయ్యారు. అవకాశాల విషయంలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని పార్టీ నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
బొల్లం సంపత్‌కుమార్‌...
వరంగల్‌ నగరంలో వ్యాపారవేత్తగా పేరున్న బొల్లం సంపత్‌కుమార్‌ రాజకీయ ప్రస్థానం ప్రజారాజ్యం నుంచి మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పీఆర్‌పీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నుంచి వైదొలిగారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన 2009 డిసెంబరులో టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి పార్టీ రాష్ట్ర నాయకుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ పదవి దక్కడంపై సంపత్‌కుమార్‌ స్పందిస్తూ... ‘తెలంగాణ రాష్ట్ర సాధనలో పని చేసినందుకు తృప్తిగా ఉంది. రాష్ట్ర స్థాయి చైర్మన్‌గా నన్ను నియమించిన సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా. సీఎం కేసీఆర్‌ నమ్మకాన్ని నిలబెడతా’ అని చెప్పారు.
 
యూసుఫ్‌ జాహిద్‌...
జమాతె ఉల్మా హింద్‌ సంస్థలో కీలకంగా పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేశారు. ప్రస్తుతం యూసుఫ్‌ జాహిద్‌ వరంగల్‌లోని మండీబజార్‌ మద్రాసీ మసీదు ఉపన్యాసకుడి(ఖతీబ్‌)గా పనిచేస్తున్నారు. యూసుఫ్‌ జాహిద్‌ ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ యూనివర్సిటీ నుంచి ఉర్దూ పీజీ పట్టా పొందారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్‌కు, ముస్లిం సంస్థలకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించారు. ఖాదీ బోర్డు చైర్మన్‌ పదవి దక్కడంపై యాసుఫ్‌ జాహిద్‌ స్పందిస్తూ... ‘రాష్ట్ర స్థాయి పదవిలో నన్ను నియమించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీకి కృతజ్ఞతలు. నాకు అప్పగించిన బాధ్యతలను చక్కగా నిర్వహించి సీఎం కేసీఆర్‌ నమ్మకాన్ని నిలబెడతా’ అని అన్నారు. 
మరిన్ని వార్తలు