నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం

17 Mar, 2019 16:02 IST|Sakshi

కలెక్టరేట్‌లో రిటర్నింగ్, నామినేషన్‌ సహాయ కేంద్రాలు ఏర్పాటు 

అదనంగా సీసీ కెమెరాల బిగింపు

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నామినేషన్ల స్వీకరించే కలెక్టర్‌ చాంబర్‌ వద్ద రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం పేరుతో ప్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇటు నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థుల కోసం ప్రగతిభవన్‌లో నామినేషన్‌ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా అభ్యర్థులు ప్రగతిభవన్‌లోకి వెళ్లి నామినేషన్‌ పత్రాలను సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అక్కడ అధికారులను ఏర్పాటు చేశారు. 18వ తేదీ నుంచి 25 తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

నామినేషన్‌ వేసే అభ్యర్థులు 100 మీటర్ల దూరంలో మూడు వాహనాల కంటే ఎక్కువ అనుమతించరు. అలాగే రిటర్నింగ్‌ కార్యాలయంలోకి అభ్యర్థితో పాటు ఐదుగురిని మాత్రమే అనుమతిస్తారు. కలెక్టరేట్‌లో మరింత నిఘా పెంచడానికి పోలీసు బందోబస్తుతో పాటుగా అదనంగా సీసీ కెమెరాలు శనివారం బిగించారు. సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని తెలుసుకునేందుకు కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు చాంబర్‌లో డిప్లేను కూడా ఏర్పాటు చేయించారు. మీడియాకు ప్రత్యేకంగా ప్రగతిభవన్‌ ముందు టెంటు, కుర్చీలు ఏర్పాటు చేయించారు.

 నామినేషన్లకు ఉన్నది ఐదు రోజులే.. 
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమై, 25న ముగుస్తుంది. అయితే ఈ నెల 21, 23, 24 తేదీల్లో ప్రభుత్వ సెలవులు కావడంతో నామినేషన్లు స్వీకరించవద్దని ఎన్నికల కమిషన్‌ కలెక్టర్‌లను ఆదేశాలిచ్చింది. దీంతో నామినేషన్‌ స్వీకరణకు ఎనిమిది రోజులున్న సమయం కాస్త మూడు రోజులు తగ్గి కేవలం ఐదు రోజులు మాత్రమే ఉండనుంది.

>
మరిన్ని వార్తలు