నామినేషన్‌ పర్వం...

13 Nov, 2018 14:29 IST|Sakshi

తొలిరోజు మూడునామినేషన్లు దాఖలు 

వైరా నుంచి టీఆర్‌ఎస్‌తోపాటు బీఎల్‌ఎఫ్‌.. 

ఖమ్మం నుంచి పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థి నామినేషన్‌  

సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసిన క్రమంలో నామినేషన్‌ దాఖలు ఈనెల 19 వరకు కొనసాగనుంది. తొలిరోజు జిల్లాలో మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఖమ్మం, వైరా నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నుంచి పోటీ చేసే ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైరా తాజా మాజీ ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేసి.. బీ ఫారం అందజేశారు. మదన్‌లాల్‌ నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైరాలో టీఆర్‌ఎస్‌ ప్రదర్శన నిర్వహించింది.

 ఇక బీఎల్‌ఎఫ్‌–సీపీఎం కూటమి తరఫున వైరా అభ్యర్థిగా భూక్యా వీరభద్రం నామినేషన్‌ దాఖలు చేశారు. ఖమ్మంలో పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరఫున ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థిగా విజయ్‌ప్రసాద్‌ నామినేషన్‌ వేశారు. సత్తుపల్లి, మధిర, పాలేరు నియోజకవర్గాల్లో తొలిరోజు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఆదివారం పార్టీ అధినేత కేసీఆర్‌ హైదరాబాద్‌లో నామినేషన్‌ పత్రాలు అందజేసినప్పటికీ.. ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు తమ ముహూర్త బలం ఆధారంగా నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

 పాలేరులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ తదితరులు ఈనెల 19వ తేదీన నామినేషన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. మధిర నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క మహాకూటమి జాబితాను అధికారికంగా ప్రకటించిన తర్వాతే ఎప్పుడు నామినేషన్‌ వేసేది తేలనున్నది. ఇక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌ 14న నామినేషన్‌ వేసేందుకు సమాయత్తమవుతున్నారు. సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ఈనెల 17న మొదటి సెట్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

 19న మహాకూటమి తరఫున భారీ ర్యాలీతో వెళ్లి రెండో సెట్‌ నామినేషన్‌ వేయనున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పిడమర్తి రవి 14వ తేదీన నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొననున్నారు. అలాగే బీజేపీ అభ్యర్థి నంబూరి రామలింగేశ్వరరావు 19వ తేదీన నామినేషన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వైరా నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేష్మా ఈనెల 14న నామినేషన్‌ వేయనున్నారు. పాలేరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండపల్లి శ్రీధర్‌రెడ్డి ఈనెల 14 లేదా 19న నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం ఉంది.

 ఇక కాంగ్రెస్‌తోపాటు మహాకూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న టీడీపీ, సీపీఐ మధ్య సీట్ల లెక్క తేలకపోవడంతో ఆయా పార్టీల నుంచి అధికారికంగా అభ్యర్థిత్వం ఖరారయ్యాకే నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో కాంగ్రెస్‌ అధికారికంగా అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉండడంతో.. దాని ఆధారంగా బీజేపీ ఖమ్మం, కొత్తగూడెం అభ్యర్థులను, సీపీఎం–బీఎల్‌ఎఫ్‌ కూటమి పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.కూటమి భాగస్వామ్య పక్షాలు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై కొంత స్పష్టత వచ్చినా.. అధికారికంగా ఆయా పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో కూటమి అభ్యర్థులు 15, 16 తేదీల్లో జిల్లావ్యాప్తంగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

మరిన్ని వార్తలు