నామినేషన్ల జోరు

15 Nov, 2018 19:11 IST|Sakshi

నామినేషన్లు దాఖలు చేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు

బాన్సువాడలో పోచారం.. బాల్కొండలో ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌లో బిగాల.. ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి 

బాన్సువాడలో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి సైతం..

సాక్షి, నిజామాబాద్‌: నామినేషన్ల పర్వం జోరందుకుంది. మూడో రోజు జిల్లావ్యాప్తంగా 12 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం మంచి రోజు కావడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. బాన్సువాడ స్థానానికి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బాల్కొండ స్థానానికి వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్‌ అర్బన్‌ స్థానానికి బిగాల గణేశ్‌గుప్తా, ఆర్మూర్‌ స్థానానికి ఆశన్నగారి జీవన్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. పోచారం ఉదయం సరస్వతి మాత మందిరం, అయ్యప్పస్వామి మందిరాల్లో కుటుంబసభ్యులతో కలిసి పూజలు చేశారు. మాతృమూర్తి పాపమ్మ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. పార్టీ గుర్తు అంబాసిడర్‌ కారులో బాన్సువాడ తహసీల్‌ కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. వేముల ప్రశాంత్‌రెడ్డి లింబాద్రి గుట్టపై లక్ష్మీనర్సింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి బాల్కొండ తహసీల్‌ కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ వేశారు. భీంగల్‌ చర్చిలో ఫాదర్‌ ఆశీర్వాదం తీసుకున్నారు.

బిగాల గణేశ్‌గుప్తా నిజామాబాద్‌ నగరంలో అయ్యప్పస్వామి, వాసవీకన్యకాపరమేశ్వరి మాత, విఠలేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం అంబాసిడర్‌ కారును నడుపుకుంటూ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. బిగాల గణేశ్‌ గుప్తా తండ్రి  కృష్ణమూర్తి కూడా టీఆర్‌ఎస్‌ పేరుమీద నామినేషన్‌ వేశారు. ఆర్మూర్‌ చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసిన ఆశన్నగారి జీవన్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. బాన్సువాడ కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన వెల్తుర్ల మల్యాద్రిరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. నిజామాబాద్‌ అర్బన్‌ స్థానానికి బహుజన సమాజ్‌పార్టీ అభ్యర్థిగా రమేష్‌ రాశమల్లు, బహుజన లెఫ్ట్‌ పార్టీ అభ్యర్థిగా హెచ్‌ఎం ఇస్మాయిల్‌ మొహమ్మద్‌ నామినేషన్లు వేశారు. బోధన్‌ స్థానానికి శివసేన అభ్యర్థిగా పాసులోటి గోపికృష్ణ, ఆర్మూర్‌ స్థానానికి అంబేద్కర్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగాఎస్‌ చరణ్‌కుమార్‌ నామినేషన్లు వేశారు. 
నేడు ఎంపీ కవితతో కలిసి..

నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవితతో కలిసి నిజామాబాద్‌ అర్బన్, ఆర్మూర్‌ స్థానాలకు బిగాల గణేశ్‌గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డిలు గురువారం మరోమారు నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించారు.

కామారెడ్డి జిల్లాలో..

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంప గోవర్ధన్‌ రెండుసెట్లు వేశారు. బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి తరపున ఆయన అనుచరులు నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. 

  • ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక నామినేషన్‌ దాఖలయ్యింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి తరపున ఆయన బంధువులు, పార్టీ నేతలు నామినేషన్‌ వేశారు.
  • జుక్కల్‌ నియోకజ వర్గంలో నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థులుగా సౌదాగర్‌ గంగారాం, ఆయన భార్య సావిత్రి నామినేషనన్లు వేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా శోభావతి షింధే, ఇండిపెండెంట్‌గా ప్రకాశ్‌నాయుడు నామినేషన్‌లు దాఖలు చేశారు. ఈనెల 12న మొదలైన నామినేషన్ల ప్రక్రియ.. 19 వరకు కొనసాగనుంది. తొలిరోజు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాని విషయం తెలిసిందే.. రెండో రోజు రెండు నామినేషన్లు రాగా.. మూడో రోజు తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయి. 
Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు