సాక్షి ఎక్సలెన్స్‌ అవార్డ్స్‌ 2018: ప్రతిభకు పట్టం కడదాం..

10 Feb, 2019 02:33 IST|Sakshi
సాక్షి మీడియా గ్రూప్‌ చైర్‌ పర్సన్‌ శ్రీమతి భారతీ రెడ్డి, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ వైఈ ప్రసాద్‌రెడ్డి, ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ రామచంద్రమూర్తి మరియు డైరెక్టర్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ రాణీరెడ్డి తదితర ప్రముఖులతో ‘సాక్షి ఎక్సలెన్స్‌ అవార్డ్స్‌–2017’ పురస్కార గ్రహీతలు (ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: ఏ రంగంలోనైనా ‘అవార్డులు’ ఇవ్వడానికి ప్రధానంగా మూడు లక్ష్యాలుంటాయి. ఒకటి, అప్పటివరకు విశేషంగా కృషి చేస్తున్న, ప్రతిభ చూపిన, సేవలందిస్తున్న వారిని గుర్తించి నలుగురికి తెలిసేలా సత్కరించడం. రెండు, సదరు అవార్డుతో బాధ్యతాయుతంగా వారా కృషి–ప్రతిభ–సేవను మరింత కొనసాగించేట్టు చేయడం. మూడు, సమాజానికి మేలయ్యేలా ఇతరులలో ఆ స్ఫూర్తి రగిలించడం! అక్షరాలా ఇది సాధించే లక్ష్యంతో గత నాలుగేళ్లుగా సాక్షి ఈ కృషిని యజ్ఞంలా నిర్వహిస్తోంది. వేర్వేరు రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న, అసాధారణ ప్రతిభతో రాణిస్తున్న, నిస్వార్థమైన నిరతితో సేవలందిస్తున్న వారిని గుర్తిస్తోంది. ‘‘సాక్షి ఎక్సలెన్స్‌ అవార్డు’’లతో వారిని ఘనంగా సత్కరిస్తోంది. ఏటా నగరంలో ఓ పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి, ప్రముఖుల సమక్షంలో వారికా అవార్డుల్ని అందజేస్తోంది. త్యాగం, నైపుణ్యం, ప్రతిభ, కళ, సేవ, దయ.... ఎక్కడ ఏ రూపంలో ఉన్నా వెలికి తీస్తోంది. సమాజ హితం కోరే ముఖ్యులు న్యాయనిపుణులుగా ఏర్పాటైన ‘జ్యూరీ’ సాక్షికి లభించిన ఎంట్రీల నుంచి విజేతల్ని నిర్ణయించి ప్రకటిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో కృషి చేస్తున్న పలువురు 2014 నుంచి 2017 వరకు ఏటా ఈ అవార్డులకు ఎంపికయ్యారు. అన్ని వయసుల వారూ ఈ విజేతల్లో ఉన్నారు. 2018కి సంబంధించిన సాక్షి అవార్డుల ఎంపిక ప్రక్రియ ఇటీవలే మొదలయింది. 28 ఫిబ్రవరి, 2019 సాయంత్రం 6 గం.ల వరకు గడువు ఉండటంతో ఎంట్రీలు అందుతున్నాయి. 

ఎంపిక ప్రక్రియలోనూ ప్రత్యేకత!
ఏమంటే..... ఎవరికి వారు సొంతంగా ఎంట్రీలు పంపుకునే పద్ధతి లేదు. విశేష ప్రతిభ, అసాధారణ నైపుణ్యం, విశిష్ట కళ, నిష్కళంక సేవ చేస్తున్న వ్యక్తులు, సంస్థల్ని గుర్తెరిగిన ఇతరులెవరైనా ఆయా వ్యక్తులు, సంస్థల తరపున సాక్షికి ఈ ఎంట్రీలు పంపవచ్చు. ఆయా ఎంట్రీలను పరిశీలించిన మీదట, అర్హమైన వాటిని నిపుణుల జ్యూరీకి సిఫారసు చేస్తారు. జ్యూరీ తుది విజేతల్ని ఎంపిక చేస్తుంది. విద్య, వైద్య, వ్యవసాయ, వాణిజ్య, సామాజిక సేవ, క్రీడా, సినిమా తదితర రంగాల్లో అసాధారణంగా రాణించే, ప్రతిభ చూపే, సేవ చేసే వ్యక్తులు, సంస్థలను ఈ అవార్డుల కోసం గుర్తిస్తారు. కొన్ని అంశాల్లో యువతరానికి, ప్రవాస భారతీయులకూ అవార్డులున్నాయి. సందర్భాన్ని బట్టి ‘జ్యూరీ ప్రత్యేక ప్రశంస’ కూడా లభించవచ్చు! ఇంకా, సినిమా రంగానికి సంబంధించిన వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన, ప్రతిభ చూపిన వారికి ‘ప్రజాదరణ’ ఆధారంగా ఎంపిక చేసి, అవార్డులిచ్చే పద్ధతీ ఉంది. ఉత్తమ ప్రజాదరణ చిత్రం, ఉత్తమ నటీనటులు, దర్శకుడు, సంగీతం – నేపథ్యగానం విభాగాల్లో ఈ అవార్డులున్నాయి. ప్రతిభకు పట్టం కట్టడం, నైపుణ్యాల్ని ప్రశంసించడం, సేవల్ని కొనియాడటం, లక్ష్య సాధనను అభినందించడం... ఎవరమైనా చేయదగినదే! ఈ భావన కలిగిన వారంతా తమ ఎరుకలో ఉండే ఇటువంటి ప్రతిభా మూర్తుల్ని గుర్తించి, వారి పేర్లను ప్రతిపాదిస్తూ ఈ అవార్డుల కోసం ఎంట్రీలు పంపుతారని సాక్షి అభిలషిస్తోంది. సాక్షి చేస్తున్న ఈ కృషికి అందరూ చేయూతనివ్వండి. నామినేషన్ల ఎంట్రీ దరఖాస్తుల కోసం www.sakshiexcellenceawards.com లాగిన్‌ కాగలరు.

వివరాలకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 040–2332 2330 నంబరుపై సంప్రదించవచ్చు. ఈ–మెయిల్‌: sakshiexcellenceawards@sakshi.com.

మరిన్ని వార్తలు