ఓపనైపోయింది బాబూ!

21 Nov, 2018 13:13 IST|Sakshi
నామినేషన్లను పరిశీలిస్తున్న ఆదిలాబాద్‌ రిటర్నింగ్‌ అధికారి సూర్యనారాయణ, ఎన్నికల అధికారులు

జిల్లాలో తొమ్మిది మంది నామినేషన్ల తిరస్కరణ 

ఉపసంహరణకు  ఈ నెల 22 వరకు గడువు 

అదే రోజు అసెంబ్లీ బరిలో నిలిచే అభ్యర్థుల ప్రకటన 

సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్‌ అసెంబ్లీ స్థానాలకు పోటీ పడే అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. ఆదిలాబాద్‌ అసెంబ్లీకి వచ్చిన నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి సూర్యనారాయణ, బోథ్‌ అసెంబ్లీకి వచ్చిన నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి కృష్ణ ఆదిత్యతోపాటు సహాయ రిటర్నింగ్‌ అధికారులు ఆయా నామినేషన్‌ కేంద్రాల్లో మంగళవారం పరిశీలించారు. ఆయా రాజకీయ పార్టీల సమక్షంలో నామినేషన్‌ పత్రాల పరిశీలన కొనసాగింది.ఈ నెల 12 నుంచి 19 వరకు జరిగిన స్వీకరణ ప్రక్రియకు రెండు అసెంబ్లీ సెగ్మెంట్లకు కలిపి మొత్తం 30 మంది నామినేషన్లు దాఖలు చేయగా, పరిశీలనలో తొమ్మిది మంది అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాల వల్ల అధికారులు తిరస్కరించారు.
తిరస్కరించిన వాటిలో వివిధ పార్టీల అభ్యర్థుల నామినేషన్లు ఆరు ఉండగా, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల దాఖలు చేసిన నామినేషన్లు ఉన్నాయి. కాగా, పరిశీలన అనంతరం కరెక్ట్‌గా ఉన్న ఆయా అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈ నెల 22 వరకు గడువుంది. అదే రోజు పెద్ద మొత్తంలో నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశాలు ఉండడంతోపాటు బరిలో నిలిచే అభ్యర్థులను కూడా అధికారులు ప్రకటించనున్నారు.  
ఆదిలాబాద్‌లో తిరస్కరణ ఇలా.. 
ఈ నెల 12 నుంచి 19 వరకు కొనసాగిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ద్వారా ఆదిలాబాద్‌ అసెంబ్లీ స్థానానికి మొత్తం 21 మంది నామినేషన్లు వేశారు. ఇందులో వివిధ కారణాల వల్ల ఐదుగురి నామినేషన్లను అధికారులను తిరస్కరించారు. తిరస్కరణకు గురైన వాటిలో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులకు చెందినవి కాగా, ఇద్దరు వివిధ పార్టీల అభ్యర్థుల నామినేషన్లు ఉన్నాయి. బీజేపీ తరఫున నామినేషన్‌ వేసిన బోడకుంట శరణ్య, గోండ్వానా గణతంత్ర పార్టీ నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన వెడ్మ లక్ష్మి, స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌ వేసిన కెల్లేటి దినేష్, కిరణ్‌కుమార్‌ వైద్య, మోరే హరిష్‌చంద్‌ నామినేషన్లు తిరస్కరణకు గరయ్యాయి.
 
బోథ్‌లో ఇలా.. 
బోథ్‌ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 12 నుంచి వారం రోజులపాటు జరిగిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ద్వారా మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందులోంచి నలుగురు అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాల వల్ల అధికారులు తిరస్కరించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన అనిల్‌జాదవ్, కుమ్రం కోటేశ్వర్‌రావు, నయా భారత్‌ పార్టీ తరఫున నామినేషన్‌ వేసిన సుభాష్‌ రాథోడ్, రాష్ట్రీయ జనక్రాంతి పార్టీ నుంచి బరిలో దిగి నామినేషన్‌ వేసిన ఉయిక హిరాజీ నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. కాగా, అనిల్‌ జాదవ్, కుమ్రం కోటేశ్వర్‌రావు స్వతంత్రంగా కూడా ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేయడంతో వారు బరిలో నిలిచే అభ్యర్థుల్లో ఉన్నారు. 

అసెంబ్లీ బరిలో నిలిదెవరో..?
జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు ప్రస్తుతం 23 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో ఆదిలాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉపసంహరణ బరిలో 16 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 12 మంది వివిధ పార్టీల అభ్యర్థులు ఉండగా, స్వతంత్ర అభ్యర్థులు నలుగురు ఉన్నారు. బోథ్‌ అసెంబ్లీకి ఉపసంహరణ బరిలో ఏడుగురు అభ్యర్థులు పోటీ పడుతుండగా, ఐదుగురు వివిధ పార్టీల అభ్యర్థులు, ఇద్దరు స్వతంత్రలు ఉన్నారు. కాగా, ఉపసంహరణ బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్లను వెనక్కి తీసుకునేందుకు ఈ నెల 22 వరకు గడువుంది. అదే రోజు సాయంత్రం వరకు అసెంబ్లీ బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించనున్నారు.  

మరిన్ని వార్తలు