విత్తన ప్రియుడికి గవర్నర్‌ అభినందన..

1 Jun, 2018 09:53 IST|Sakshi
రమేష్‌ను సన్మానిస్తున్న బోర్డు సభ్యులు

500 రకాల విత్తనాలు సేకరించి భద్రపరిచిన వైనం

తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక

గుంతకోడూరు విద్యార్థి రమేష్‌ జీవ‘వైవిధ్యం’

తాడూరు (నాగర్‌కర్నూల్‌ జిల్లా) : జీవ వైవిద్యంలో ప్రతిభ కనబర్చిన గుంతకోడూరుకు చెదిన రమేష్‌ విద్యార్థి 500 రకాల విత్తనాలను సేకరించి వాటిని భద్రపరిచాడు. 1995 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రంగాల్లో కృషిచేసిన వారికి జాతీయ స్థాయి అవార్డులు సృష్టి సమాన్‌ పేరుతో ఇస్తున్నారు. 2018కి గాను జీవవైవిధ్య రంగంలో దేశం మొత్తం నుంచి వచ్చిన నామినేషన్లలో రమేష్‌ ఎంపికయ్యారు. పల్లె సృజన అనే స్వచ్ఛంద సంస్థ సహాయ సహకారంతో ఈ అవార్డు ఎంపికయ్యాడు. ఈ ఏడాది ఇచ్చే 15 మందిలో తెలుగు రాష్ట్రాల నుంచి తాను ఎంపికైనట్లు రమేష్‌ తెలిపారు. తాను అందుకోబోతున్న ప్రతిష్టాత్మక మొదటి అవార్డు అంటూ ఆనందం వ్యక్తం చేశారు. తనకు లభించిన ప్రతిష్టాత్మక అవార్డును గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శుక్రవారం అందుకోనున్నట్లు వివరించారు.

గవర్నర్‌ అభినందన..
రమేష్‌ యూనివర్సిటీలో సైన్స్‌ సైఫాబాద్‌ ఓయూలో బీఎస్సీ బీబీసీ పూర్తి చేశాడు. 500కు పైగా విత్తనాలను సేకరించిన ఇతనికి హైదరాబాద్‌కు చెందిన ఎన్‌ఐఎఫ్‌ తరపున పనిచేసే పల్లె సృజన స్వచ్ఛంద సంస్థ సహకరిస్తుంది. ఈ సంస్థ అధినేత పోగుల గణేశం సహాయంతో 15 అక్టోబర్‌ 2015 అబ్దుల్‌ కలాం పుట్టిన రోజు సందర్భంగా వందేమాతరం పౌండేషన్‌ నిర్వహించిన ఇండోనేషన్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్నాడు. అక్కడ ప్రదర్శించిన విత్తనాలను గవర్నర్‌ నరసింహన్‌ పరిశీలించి రవీంద్రభారతిలో వేదికపై అభినందించారు. సెప్టెంబర్‌ 28, 2015న డైరెక్టర్‌ ఆఫ్‌ ఆయిల్‌ సీడ్స్‌ రీసెర్చ్‌ డాక్టర్‌ వరప్రసాద్‌ గుర్తించి విత్తనాల నుంచి 25కిపైగా పీహెచ్‌డీలు పొందవచ్చన్నారు. ఏప్రిల్‌ 27న 2016 రాష్ట్ర ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ తెలంగాణ సాయిలు విత్తనాలు పరిశీలించి అభినందించారు. మే 12, 2016వరకు ఐసీఏఆర్, ఐఐఓఆర్‌ రాజేంద్రనగర్, ఎన్‌డీపీజీఆర్‌లో డాక్టర్‌ ముక్తా సంరక్షణలో విత్తనాల సేకరణకు సంబంధించిన మెళకువలను తెలుసుకున్నట్లు రమేష్‌ తెలిపారు.

నినాదంగా విత్తనాల సేకరణ
స్వగ్రామమైన మండలంలోని గుంతకోడూరులోనే రమేష్‌ ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగింది. ఆ తర్వాత మండల కేంద్రమైన తాడూ రు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్‌ విద్యను ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అభ్యసించారు. బైపీసీలో 870 మార్కులు సాధిం చి కళాశాల టాపర్‌గా నిలిచాడు. అనంతరం కల్వకుర్తి వైఆర్‌ఎం కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశాడు. తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం కావడం, ఉన్న కొద్దిపాటి భూమిని వ్యవసాయం చేస్తూ చదువులో బాగా రాణిస్తూ అప్పటి నుంచి అనుసరిస్తున్న వివిధ రకాల విత్తనాలను భద్రపర్చడంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చేవాడు. రెండున్నరేళ్లు హైదరాబాద్‌లో జరిగిన జీవవైవిద్య సదస్సులో ఎంతో ప్రభావితమయ్యాడు. టీవీ, దినపత్రికలో వచ్చిన జీవివైవిధ్య కథనాలు ఎంతో కదిలించాయి. రోజు రోజుకు అంతరించిపోతున్న మొక్కలను కాపాడటంలో తన పాత్ర ఏమిటని ప్రశ్నించుకొని.. తాను ఏదైనా చేయాలని నిర్ణయించుకొని కనుమరుగువుతున్న విత్తనాలను సేకరించాలని భావించాడు. అనుకున్నది తడవుగా రంగంలోకి దిగి ఇప్పటి వరకు 500 విత్తనాలను సేకరించి పలువురితో ప్రశంసలు పొందాడు. 

గర్వంగా ఉంది..
నాకు చిన్నప్పటి నుంచి నాకంటూ ఏదైనా గుర్తింపు తీసుకువచ్చే విధంగా చేయాలనే తపనతోనే విత్తనాల సేకరణ మొదలుపెట్టాను. ఇందులో భాగంగా నావంతుగా అంతరించిపోతున్న 500 రకాల మొక్కలకు సంబంధించి విత్తనాలను సేకరించాను. ఇప్పటికే గ్రామాల్లో సైతం మొక్కల గురించి చాలా మందికి తెలియదు. పట్టణాల వారికి ఏమాత్రం అవగాహన ఉండదు. కాబట్టి వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉన్నాను. జాతీయ స్థాయిలో అవార్డు రావడం గర్వంగా ఉంది.

మరిన్ని వార్తలు