పోరు.. షురూ..

2 Apr, 2014 00:05 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల పోరులో అసలు ఘట్టం ఆరంభం కానుంది. నామినేషన్ల ప్రక్రియకు నేడు తెరలేస్తోంది. మహానగర పరిధిలో ఎన్నికలు జరగనున్న 24 శాసనసభ, ఐదు లోక్‌సభ స్థానాలకు బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అభ్యర్థుల వ్యయాన్నీ నేటి నుంచే నమోదు చేస్తారు. దీన్ని అంచనా వేసేందుకు అన్ని చోట్లా పరిశీలకులను నియమించారు.
 
 సో.. ఇక కౌంట్‌డౌన్ ప్రారంభమైనట్టే. నగరంలో ఎంఐఎం, లోక్‌సత్తా, ఆమ్ ఆద్మీ మినహా ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎవరనేది ఇంకా తేలలేదు. పొత్తులు.. ఎత్తులతో ఆయా పార్టీల్లో కసరత్తు కొలిక్కి రాలేదు. మరోవైపు ఈ నెల 9వ తేదీ వరకు జరిగే నామినేషన్లను స్వీకరణ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ ఎన్నికల ముఖ్య అధికారిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ బాధ్యతలు నిర్వహిస్తుండగా.. హైదరాబాద్ లోక్‌సభకు కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా, సికింద్రాబాద్‌కు జేసి శ్రీధర్, మల్కాజిగిరి లోక్‌సభకు రంగారెడ్డి జేసి ఎంసీ లాల్, చేవెళ్లకు రంగారెడ్డి జిల్లా మరో జేసి భూపాల్‌రెడ్డిలు రిటర్నింగ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు.
 
మెదక్ లోక్‌సభ స్థానానికి కలెక్టర్ స్మితా సబర్వాల్‌ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు. 30న జరిగే ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 9వేల పోలింగ్‌బూత్‌లను ఏర్పాటు చేశారు. సుమారు ఎనభై ఐదులక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గ్రేటర్‌లో కుత్బుల్లాపూర్ నియోకజవర్గంలో అత్యధిక ఓటర్లుండగా.. అధిక పోలింగ్‌బూత్‌లను అక్కడే ఏర్పాటు చేస్తున్నారు.
 
 తేలని పొత్తులు.. జాబితాలు
నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం అవుతున్నప్పటికి నగరంలో ఎంఐఎం, ఆమ్‌ఆద్మీ, లోక్‌సత్తా పార్టీలు మినహా ఇతర ప్రధాన పార్టీలేవీ అభ్యర్థులను ప్రకటించలేకపోయాయి. కాంగ్రెస్ - టీఆర్‌ఎస్‌ల పొత్తుల ఎత్తులు ఇంకా కొలిక్కి రాకపోగా, బీజేపీ-టీడీపీ సైతం సీట్ల పంపకంపై అవగాహనకు రాలేకపోయాయి. ఈ పార్టీల మధ్య సీట్ల పంపకానికి సిటీలో స్థానాలే ప్రధాన అడ్డంకిగా మారినట్లు సమాచారం. వైఎస్సార్ సీపీ నగరంలో మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను ఇప్పటికే పూర్తి చేసింది. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనుంది.

మరిన్ని వార్తలు