దయనీయం వీరి పరిస్థితి..!!

8 Feb, 2018 16:32 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న ఎన్‌ఎంఆర్‌ (నామినల్‌ మస్టర్‌ రోల్‌)లు వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. పాతికేళ్లుగా పనిచేస్తున్నా.. వారికి ఇంతవరకు ఉద్యోగ భద్రత లేదు. మరోవైపు కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వర్తించే ఈపీఎఫ్, ఇన్సూరెన్స్‌ సౌకర్యాలు కూడా వీరికి వర్తించడం లేదు. గతంలో గ్రామపంచాయతీలలో పనిచేసిన వారు నగర పంచాయతీలు, మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందడంతో మున్సిపల్‌ శాఖకు మారారు.

కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో వీరి పాత్ర కీలకం కాగా.. కనీస వేతనాలు కూడా అందడం లేదు. కారుణ్య నియామకాలు, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ లేని వీరు తమ సర్వీసును ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించారు. రెగ్యులరైజ్‌ చేయకపోయినా టైమ్‌స్కేల్‌ అందించినా కనీస వేతనాలు లభిస్తాయని.. ఆ దిశగా మున్సిపల్‌ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచించాలని వారు కోరుతున్నారు. 
– కోదాడ నుంచి ఆవుల మల్లికార్జునరావు

సరిపడా లేని సిబ్బంది..
వాస్తవానికి రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో సరిపడా సిబ్బంది లేరు. మేజర్‌ గ్రామపంచాయతీలు నగర పంచాయతీ, మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందే సమయంలో అక్కడ పనిచేస్తున్న ఎన్‌ఎంఆర్‌లను మున్సిపల్‌ శాఖ పరిధిలోకి తీసుకుంటున్నారు. అయినా.. వారి సర్వీసును మాత్రం రెగ్యులరైజ్‌ చేయలేదు. 2013లో విడుదల చేసిన జీవో నెంబర్‌ 125 ప్రకారం కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో 1,520 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించి వాటిని రెండు దశలలో నింపేందుకు నిర్ణయించారు. అయితే.. ఈ పోస్టులలో ఎన్‌ఆర్‌ఎంలను రెగ్యులరైజ్‌ చేసేందుకు ఉద్దేశించిన పబ్లిక్‌ హెల్త్‌ విభాగంలో తక్కువ పోస్టులు ఉండగా, మిగిలిన విభాగాలో పోస్టులను సూచించలేదు. దీంతో ఆ జీవో వచ్చినా ఎన్‌ఆర్‌ఎంలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. వాస్తవానికి ప్రతీ మున్సిపాలిటీ, నగర పంచాయతీలలో మాత్రం స్వీపర్లు, పబ్లిక్‌ హెల్త్, విద్యుత్, నీటి సరఫరాల విభాగాల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ఈ పోస్టుల్లో కొన్నింటిని ఎన్‌ఆర్‌ఎంలతో, మరి కొన్నింటిని అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో తాత్కాలికంగా భర్తీ చేస్తున్నారు. 

అమలు కాని 212 జీవో..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అన్ని విభాగాలలో పనిచేస్తున్న ఎన్‌ఎంఆర్‌లను రెగ్యులరైజ్‌ చేసే విషయంలో నవంబర్‌ 28, 1993న అప్పటి ప్రభుత్వం జీవో నెంబర్‌ 212ను విడుదల చేసింది. దీని ప్రకారం 1993 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఎన్‌ఆర్‌ఎంలను ఆ జీవో కింద రెగ్యులరైజ్‌ చేయాలని ఆయా శాఖలకు ఆదేశాలిచ్చింది. వారిని ఆయా శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలలో నియమించాలని, తద్వారా ఖాళీలను భర్తీ చేయాలని సూచించింది. అయితే.. ఈ జీవో మాత్రం పంచాయతీరాజ్‌ శాఖలో పూర్తిస్థాయిలో అమలు కాలేదు. గ్రామపంచాయతీలలో ప్రభుత్వం కేటాయించిన పోస్టులు తక్కువగా ఉండడం.. ఎన్‌ఆర్‌ఎంల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అది సాధ్యపడలేదు. దీంతో ఖాళీలు ఏర్పడినప్పుడు దశల వారీగా ఉద్యోగులను వారి సీనియారిటీని బట్టి నియమిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్‌ఆర్‌ఎంలలో చాలా మంది అనార్యోగం బారిన పడి మృతి చెందారు. అయితే.. వీరి కుటుంబ సభ్యుల్లో మరొకరికి ఉద్యోగం ఇచ్చే అవకాశం లేకపోవడంతో.. కుటుంబాలకు ఎలాంటి భద్రత కల్పించకుండానే లోకం వదులుతున్నారు. 

350 మంది ఎదురుచూపు..
రాష్ట్రవ్యాప్తంగా 2009 తరువాత ఏర్పడిన కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో 350 మంది ఎన్‌ఎంఆర్‌లు రెగ్యులరైజ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం తమను రెగ్యులరైజ్‌ చేసి కనీసం టైమ్‌ స్కేల్‌ అందించాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై గతంలోనే పలుమార్లు మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లామని వారు తెలిపారు.  

మున్సిపాలిటీలలో అదే పరిస్థితి..
ఉమ్మడి రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఖాళీలను భర్తీ చేసేందుకు 2009లో అప్పటి ప్రభుత్వం మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న ఎన్‌ఆర్‌ఎంలతో ఖాళీలు భర్తీ చేయవచ్చని జీవో విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం ఎన్‌ఆర్‌ఎంలను పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్లు, స్వీపర్లు, విద్యుత్, నీటి సరఫరా విభాగాలలో నియమించి వారిని రెగ్యులరైజ్‌ చేశారు. ఆ తరువాత ఏర్పడిన మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో మాత్రం అమలు కాలేదు. 

ఇతడి పేరు కుక్కల దేవయ్య.     ఈయన కోదాడ మున్సిపాలిటీలో పారిశుధ్య విభాగంలో ఎన్‌ఎంఆర్‌గా పనిచేస్తున్నాడు. కోదాడ గ్రామపంచాయతీగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు అనగా 30 ఏళ్లుగా పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్నాడు. ఇతడికి ఆరోగ్య భద్రత లేకపోగా ఉద్యోగ భద్రత కూడా లేదు. 

>
మరిన్ని వార్తలు