నాణ్యత ప్రమాణాలు లేకే డిగ్రీ కాలేజీల మూత!

2 Nov, 2018 05:08 IST|Sakshi

సంఘం నాయకుల స్వార్థం కోసమే ప్రభుత్వంపై విమర్శలు

75 శాతం ఫీజు బకాయిలు విడుదల: డిగ్రీ యాజమాన్యాల సంఘం

సాక్షి, హైదరాబాద్‌: గత ప్రభుత్వం అవసరం లేకున్నా రాష్ట్రంలో అడ్డగోలుగా డిగ్రీ కాలేజీలను మంజూరు చేసిందని, ఒక్క కాలేజీ అవసరం ఉన్న చోట ఐదు కాలేజీలను ఇచ్చిందని తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాల సంఘం పేర్కొంది. తద్వారా విద్యార్థులను తెచ్చుకోవాలన్న పోటీలో కొన్ని యాజమాన్యాలు నాణ్యత ప్రమాణాలకు నీళ్లొదిలాయని, అలాంటివే ఇప్పుడు మూత పడ్డాయని తెలిపింది. గత ప్రభుత్వం తప్పులకు ప్రస్తుత ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని పేర్కొన్నారు.

గురువారం హైదరాబాద్‌లో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రకాశ్, పరమేశ్వర్‌ విలేకరులతో మాట్లాడారు. కేజీ టు పీజీ జేఏసీ పేరుతో కొంతమంది నాయకులు గత మూడేళ్లుగా రాజకీయ పదవులకోసం పైరవీ చేసుకొని భంగపడి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. గతం నుంచే ఉన్న సమస్యలను ఇప్పుడే మొదలైన సమస్యల్లా చూపుతూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ ఏకపక్షంగా రాజకీయ మద్దతుపై తీసుకున్న నిర్ణయాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తామే విద్యా సంస్థల ప్రతినిధులుగా చెప్పుకోవడాన్ని ఖండించింది. 50 శాతం ప్రైవేటు జూనియర్, డిగ్రీ కాలేజీలు వారివెంట లేవని, మెజారిటీ సభ్యులు కలిగిన గుర్తింపు పొందిన ప్రైవేటు స్కూల్స్‌ మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌ కూడా వారితో లేదన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఫలితాలు రాబట్టుకోవాలే తప్ప ఒక రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటించడాన్ని అనేక యాజమాన్యాలు అంగీకరించడం లేదని వివరించారు.

వారు కేజీ టు పీజీ జేఏసీ పేరుతో నాయకులుగా వ్యవహరిస్తూ కాలేజీల సంఘాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి 75 శాతం ఫీజు బకాయిలను చెల్లించిందని, అయినా ఇవ్వలేదంటూ విమర్శలు చేయడాన్ని యాజమాన్యాలు నమ్మవద్దన్నారు. సంఘం నేతలు నరేందర్‌రెడ్డి, సిద్ధేశ్వర్‌   మాట్లాడారు.  

మరిన్ని వార్తలు