అందని ‘మధ్యాహ్న’ బిల్లులు

16 Nov, 2018 11:39 IST|Sakshi
వంట చేస్తున్న సిబ్బంది

     మండలంలో 58 భోజన  ఏజెన్సీలు

     నాలుగు నెలలుగా అందని బిల్లులు

     అవస్థల్లో ఏజెన్సీ నిర్వాహకులు 

సాక్షి, గుర్రంపోడు : మధ్యాహ్న భోజన ఏజెన్సీ మహిళలకు బిల్లులు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నాలుగు నెలలుగా బిల్లులు అందక పోవడంతో అప్పులు చేసి వంట సామగ్రి తేవాల్సి వస్తుందని ఏజెన్సీ మహిళలు వాపోతున్నారు. మండలంలో 58 పాఠశాలలకుగాను 58 భోజన ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఒకటవ తరగతి నుంచి ఐదవతరగతి వరకు వంట వండినందుకుగాను ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.4.13, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.6.18 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. వంట చెరుకుతో పాటు కూరగాయలు, నూనె, పప్పు, ఉప్పు ఇతర వంట సామగ్రిని ఏజెన్సీలు సమకూర్చుకోవాలి. బియ్యం మాత్రం ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రోజుకు వంద గ్రాములు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రోజుకు 150 గ్రాముల చొప్పున ప్రభుత్వం సరఫరా చేస్తుంది.


ఈ పరిమాణం కూడా సరిపోక తాము నింద మోయాల్సి వస్తుందని వంట ఏజెన్సీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం సోమవారం గుడ్డు, అన్నం, కూరగాయల కర్రీ, మంగళవారం అన్నం, ఆకుకూరల పప్పు, బుధవారం గుడ్డు, అన్నం, కూరగాయల కర్రీ, గురువారం అన్నం, సాంబారు, కూరగాయల కర్రీ, శుక్రవారం గుడ్డు, అన్నం, పప్పు కూర, శనివారం బఠానీ, ఆలు, క్యారెట్‌లతో వెజ్‌ బిర్యాణీ లేదా బగార అన్నం వండాల్సి ఉంది. ఏజెన్సీలు తప్పనిసరిగా ఈ మెనూ ప్రకారమే వండాల్సి ఉంటుంది. తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ తదితర అధికారులు తరుచూ ఆకస్మిక తనిఖీలతో మధ్యాహ్న భోజన మెనూను పరిశీలిస్తారు. వారానికి మూడు గుడ్ల చొప్పున తప్పనిసరిగా అందించాల్సి ఉంది. గుడ్డుకు నాలుగు రూపాయలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుండగా ఒక్కోసారి ఐదు రూపాయల వరకు గుడ్డు ధర ఉండి నష్టపోవాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. వంట సామగ్రితోపాటు గుడ్లకు బిల్లులు అందక గ్రామాల్లో వ్యాపారులు తమకు ఉద్దెరగా సామాను ఇవ్వడం లేదని అంటున్నారు. బిల్లులు అందక వంట చేయలేక, మధ్యలో మానుకోలేక అవస్థలు పడాల్సి వస్తుందని మహిళలు వాపోతున్నారు. ఎప్పుడు బిల్లు అడిగినా ఎస్‌టీఓకు వెళ్లిందని, బ్యాంకు వెళ్లిందని చెబుతున్నారని వారు వాపోతున్నారు. 
కొన్ని చోట్ల వంట గదులు లేవు 
మండలంలో 31 పాఠశాలలకు మాత్రమే వంట గదులు ఉన్నాయి. ఇంకా 20 పాఠశాలలకు వంట గదుల అవసరం ఉంది. వంట గదులకు గతంతో మండల పరిషత్‌ నిధుల నుంచి, ప్రస్తుతం ఉపాధిహామీ నిధుల నుంచి మంజూరు చేస్తున్నా అసంపూర్తి నిర్మాణాలతోనే ఉన్నాయి. కొన్ని బేస్మెంట్‌ స్థాయిలో, మరికొన్ని స్లాబ్‌ లెవెల్‌లో ఉన్నాయి. గతంతో నిర్మించిన వంట గదులు ఇరుకుగా ఉండి ఆరుబయటే వండాల్సి వస్తుందని, ఉన్నత పాఠశాలల్లో వంట గది నిర్మాణం విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా విశాలంగా లేవు. కొన్ని చోట్ల ఇంటివద్దనే వండుకుని తీసుకుని వస్తున్నారు. ఏజెన్సీలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. వర్షాకాలంలో వంట చెరుకు తడిసి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ విషయమై ఎంఈఓ నోముల యాదగిరిని ప్రశ్నించగా జూలై, ఆగస్టు బిల్లు ఎస్‌టీఓ నుంచి బ్యాంకుకు వెళ్లిందని, ఒకటి, రెండు రోజుల్లో ఏజెన్సీల ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు. బిల్లులు ప్రతినెలా అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బిల్లులు అందక తిప్పలు 
మధ్యాహ్న భోజన బిల్లులు ప్రతినెలా అందించాలి. నాలుగు నెలలుగా బిల్లులు అందక ఇప్పటికే ఎన్నో అప్పులు చేశాం. బిల్లు అందక సకాలంలో డబ్బులు ఇవ్వక అప్పు కూడా పుట్టడం లేదు. బిల్లు రానిదానికి వారానికి మూడు గుడ్లు పెట్టాలంటే ఇబ్బందిగా ఉంది.  


– పెరిగ జంగమ్మ, పిట్టలగూడెం  

మరిన్ని వార్తలు