ఉద్యోగుల ఉచిత వైద్యానికి బ్రేక్‌!

6 Nov, 2018 02:22 IST|Sakshi

హెల్త్‌ కార్డుల కింద చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రుల నిరాకరణ..

నాన్‌ సర్జికల్‌ వైద్యం పూర్తిగా నిలిపివేత

బకాయిలు పేరుకుపోవడం వల్లేనంటున్న యాజమాన్యాలు..

రీయింబర్స్‌మెంట్‌ కింద కూడా నో..

ఎన్నికల వేళ పత్తాలేని వైద్య యంత్రాంగం..

తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, పెన్షనర్లు  

సాక్షి, హైదరాబాద్‌: సర్కారు ఉద్యోగులకు, జర్నలిస్టులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వం జారీచేసిన హెల్త్‌ కార్డుల కింద వెద్యం అందట్లేదని వారు వాపోతున్నారు. ముఖ్యంగా నాన్‌ సర్జికల్‌ వైద్య సేవలను ఆస్పత్రులు పూర్తిగా నిలిపేశాయి. ప్రభుత్వం నుంచి రూ.250 కోట్ల బకాయిలు పేరుకు పోవడం వల్లే గత్యంతరం లేక వైద్య సేవలు నిలిపేసినట్లు ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి ఏకంగా రూ.66 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలిసింది.

లాభం ఎక్కువగా ఉండే ఖరీదైన ఆపరేషన్లు మాత్రమే ఆయా ఆసుపత్రులు అంగీకరిస్తున్నాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల చర్యల వల్ల ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టు కుటుంబాలు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. మరో విచిత్రమేంటంటే ఉద్యోగులకు రీయింబర్స్‌మెంట్‌ సౌకర్యం కూడా ఉంది. ముందుగా డబ్బు తీసుకొని తర్వాత రీయింబర్స్‌మెంట్‌ కింద వైద్యం చేయడానికి కూడా ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. అలా చేస్తే ఉచిత వైద్యం చేయలేదంటూ ఉద్యోగులు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నందున ఆ సేవలు కూడా అందించట్లేదని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రి ప్రతినిధి ‘సాక్షి’కి తెలిపారు.

పడకలు లేవంటూ..
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్‌ఎస్‌)ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ పథకం కింద రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఉద్యోగులకు వైద్య సేవలను ఉచితంగా అందజేయాలి. ఆరోగ్యశ్రీలో ఉన్న అన్ని వైద్య సేవలనూ వీరికి అందజేయాలి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనూ వైద్య సేవలు పొందేందుకు వీరు అర్హులు. ఎవరైనా ఉద్యోగి తనకు వైద్యం అవసరమని భావిస్తే ముందుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్‌నెస్‌ సెంటర్లకు వెళ్లాలి.

అక్కడ చికిత్స చేయలేని పరిస్థితి ఉంటే తదుపరి వైద్య సేవల కోసం రోగికి ఇష్టమైన ఆసుపత్రికి రెఫర్‌ చేస్తారు. వైద్యం, శస్త్రచికిత్సలు చేస్తే సర్కారు నిర్దేశించిన ప్యాకేజీల ప్రకారం ఆసుపత్రులకు ప్రభుత్వం సొమ్ము చెల్లిస్తుంది. ఉదాహరణకు రోగికి డెంగీ వస్తే అతని ఆరోగ్య పరిస్థితిని బట్టి నాలుగైదు రోజులు అవసరమైతే వారం పది రోజులు కూడా ఆసుపత్రుల్లో ఉంచాలి. కానీ దానికి ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ సరిపోవట్లేదు. ఫుడ్‌ పాయిజన్‌ కేసులు, ఇతరత్రా నాన్‌ సర్జికల్‌ వైద్య సేవలన్నింటినీ నిలిపేశారు.

అలాంటి ఉద్యోగులు ఎవరైనా వస్తే పడకలు లేవంటూ తప్పించుకుంటున్నారు. ఇక సర్జికల్‌ కేసుల్లో తమకు లాభం ఉన్న కేసులనే తీసుకుంటున్నాయి. నాన్‌సర్జికల్‌ వైద్యాన్ని నిరుత్సాహపరచాలని ప్రభుత్వం పరోక్షంగా తమకు సూచించిందని ఓ కార్పొరేట్‌ యజమాని పేర్కొనడం గమనార్హం. నాన్‌ సర్జికల్‌ వైద్యం పేరుతో ప్రైవేటు కార్పొరేట్‌ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా బిల్లులు వేస్తున్నాయని, అలాంటి కేసులు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లేలా చూడాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.

పట్టించుకోని యంత్రాంగం..
ఈజేహెచ్‌ఎస్‌ పథకాన్ని పర్యవేక్షించడంలో వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం విఫలమైంది. ఈ పథకానికి ఆరోగ్యశ్రీ సీఈవోనే పర్యవేక్షిస్తున్నారు. గతంలో ఈజేహెచ్‌ఎస్‌కు ప్రత్యేకంగా సీఈవో ఉండేవారు. అదనపు బాధ్యతలు ఇవ్వడంతో ఈ పథకంపై దృష్టిపెట్టలేకపోతున్నారని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

ఎన్నికల సీజన్‌ కావడంతో వైద్య ఆరోగ్య మంత్రి కూడా దీనిపై దృష్టిసారించే పరిస్థితి లేకుండాపోయింది. ఉన్నత స్థాయిలో అధికారులూ పట్టించుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. ఒక్క మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు రూ.కోటికి పైగా నిలిచిపోయినట్లు అక్కడి ఉద్యోగులు చెబుతున్నారు. ఇలా రాష్టవ్యాప్తంగా రూ.50 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

సీఎం అనుకున్నట్లు అమలు కావట్లేదు
ఈజేహెచ్‌ఎస్‌ పథకం సీఎం కేసీఆర్‌ అనుకున్నట్లుగా అమలు కావట్లేదు. ఆరోగ్యశ్రీ సీఈవో, ఐఏఎస్‌ అధికారికి ఈజేహెచ్‌ఎస్‌ పథకం బాధ్యతలు ఇవ్వడం వల్ల కూడా పర్యవేక్షణ లేదు. వైద్యుడినే సీఈవోగా నియమిస్తే సమస్యల పరిష్కారానికి వీలుండేది. – కారెం రవీందర్‌రెడ్డి, అధ్యక్షుడు, టీఎన్జీవో

బకాయిలు పేరుకుపోవడం వల్లే..
ప్రైవేటు కార్పొరేట్‌ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడం వల్లే ఉద్యోగులకు వాటిల్లో వైద్య సేవలు అందట్లేదు. ఉద్యోగులు సొంతంగా డబ్బు పెట్టి రీయింబర్స్‌మెంట్‌ కింద వైద్యం చేయించుకుంటే ఆ బిల్లుల సొమ్ము కూడా సర్కారు ఇవ్వట్లేదు. రాష్ట్రవ్యాప్తంగా కోట్ల రూపాయలు ఉద్యోగులకు పెండింగ్‌లో పెట్టారు. ఈ చర్యల వల్ల ఉద్యోగులకు వైద్య సేవలు నిలిచిపోయాయి. పింఛన్‌దారులు దారుణంగా నష్టపోతున్నారు. – వెంకటరెడ్డి, మాజీ అధ్యక్షుడు, పీఆర్టీయూ

>
మరిన్ని వార్తలు