మాంసంపై మీమాంస!

2 Oct, 2018 04:03 IST|Sakshi

     గాంధీ జయంతిన రైళ్లలో మాంసాహారం 

     రైల్వే శాఖ తీరుపై సర్వత్రా విమర్శలు 

     అడిగితేనే ఇస్తామంటున్న ఐఆర్‌సీటీసీ

సాక్షి, హైదరాబాద్‌: అక్టోబర్‌ 2, గాంధీ జయంతి.. ఈ రోజున దేశ వ్యాప్తంగా మాంస విక్రయాలు జరగవు. అయితే రైల్వే క్యాంటీన్లలో ఇందుకు విరుద్ధంగా గాంధీ జయంతిన మాంసాహారం వడ్డించే ఏర్పాట్లు చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దురంతో, రాజధాని, శతాబ్ది లాంటి ప్రీమియం రైళ్లల్లో ప్రయా ణించే వారందరికీ శాఖాహారమే వడ్డించాలని రైల్వే ఈ ఏడాది జనవరిలో నిర్ణయించింది. ఈసారి గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించాలని ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) భావించింది. ఇందుకు ఆహార మెనూలో మార్పులు చేసింది. ఈ రోజున భోజనంలో చపాతీలు, పరోటాలు, పనీర్, కూరగాయలతో చేసిన పలు రకాల వంటకాలనే అందించాలని నిర్ణయించింది. 

గత నెలలోనే నిర్ణయం.. 
శాఖాహార భోజనం వాస్తవానికి ఈ ఆలోచన జనవరిలో వచ్చినా.. అధికారిక నిర్ణయం మాత్రం సెప్టెం బర్‌ తొలివారంలో వెలువడింది. దీన్ని చాలామంది ప్రయాణికులు గమనించలేదు. దీంతో ఆ రోజు రైలు ప్రయాణంలో ఉన్నవారిలో చాలామంది మాంసాహారం ఆర్డర్‌ చేశారు. ఇప్పుడు తమ మెనూ మార్పు పై గందరగోళంలో ఉన్నట్లు సమాచారం. దక్షిణాది నుంచి ఢిల్లీ, గుజరాత్, రాజస్తాన్‌ ప్రాంతాలకు 28 నుంచి 32 గంటల ప్రయాణ సమయం పడుతుంది. ప్రయాణికులు అక్టోబర్‌ ఒకటి రాత్రి ప్రయాణం మొదలుపెడితే, వారికి అక్టోబర్‌ 2న శాఖాహారం అందించి, తిరిగి 3న వారు కోరిన మాంసాహారం ఇవ్వనున్నారు. ముందస్తు నిర్ణయం తీసుకోవడంలో ఐఆర్‌సీటీసీ విఫలమవడంతోనే ఇది తలెత్తింది. 

కావాలంటేనే ఇస్తాం: ఐఆర్‌సీటీసీ 
దేశవ్యాప్తంగా రోజూ 7 నుంచి 14 లక్షల వరకు ఐఆర్‌సీటీసీలో టికెట్లు బుక్‌ చేస్తారు. దక్షిణ మధ్య రైల్వే నుంచి ఈ సంఖ్య లక్షకు పైగా ఉంటుంది. ప్రీమియం రైళ్లలో ప్రయాణం చేసేవారి సంఖ్య 12 వేలకు పైమాటే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది, దక్షిణ మధ్య రైల్వేలో వేలాదిమంది ఇప్పటికే మాంసం ఆర్డర్‌ చేశారు. వాస్తవానికి తమ షెడ్యూలు ప్రకారం.. అందరికీ శాఖాహారమే వడ్డిస్తామని ఐఆర్‌సీటీసీ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఐఆర్‌సీటీసీ పరిధిలో నడిచే ఫుడ్‌ కోర్టులు, హోటళ్లు, స్టాళ్లకు ఆదేశాలిచ్చినట్లు పేర్కొంటున్నారు. అయితే అప్పటికే ఆర్డర్‌ఇచ్చిన వారు మరీ ఒత్తిడి చేస్తే మాత్రమే మాంసం వడ్డిస్తామని చెబుతున్నారు. లేదంటే మాంసాహారం ఆర్డర్‌ చేసిన వారికి కూడా శాఖాహారమే అందిస్తామంటున్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు