వెలగని దీపం!

29 Jun, 2015 07:26 IST|Sakshi
వెలగని దీపం!

మంజూరైన కనెక్షన్లు 70వేలు
ఒక్కో నియోజకవర్గానికి 5వేలు
వచ్చిన దరఖాస్తులు 1.80లక్షలు
లబ్ధిదారుల ఎంపికలో జాప్యం
నేటికీ కొలిక్కిరాని అర్హుల జాబితా

 
పాలమూరు: దారిద్య్రరేఖకు దిగువన  ఉన్న కుటుంబాలకు దీపం పథకం ద్వారా ఉచితంగా ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లు అందించాలన్న సర్కారులక్ష్యం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. కనెక్షన్లు మంజూరై రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు ఏ ఒక్కరికీ గ్యాస్ అందకపోవడం గమనార్హం. గత ఏప్రిల్‌లో నియోజకవర్గానికి ఐదువేల చొప్పున జిల్లాలోని 14 నియోజకవర్గాలకు 70వేల కనెక్షన్లను ప్రభుత్వం మంజూరుచేసింది. దరఖాస్తులు స్వీకరించి మూడునెలలైనా అర్హుల జాబితా ఇంతవరకు ఖరారుకాలేదు. కలెక్టర్ చైర్మన్‌గా ప్రత్యేకకమిటీ లబ్ధిదారులను ఎంపికచేస్తుంది.

మండలస్థాయిలో ఆ బాధ్యతను ఎంపీడీఓలకు కట్టబెట్టారు. గ్రామస్థాయిలో వచ్చిన దరఖాస్తులను గ్రామసభల ద్వారా ఎంపిక చేయాలన్న నిబంధనలకు స్వస్తి పలికారు. స్థానిక అధికార పార్టీ నాయకుల సిఫార్సులు, సర్పంచ్‌ల జాబితా మేరకు ఎంపీడీఓలు లబ్ధిదారుల తుదిజాబితా రూపకల్పనలో జాప్యం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు జిల్లా అధికార యంత్రాంగానికి జాబితా చేరలేదు. గ్రామాల నుంచి వచ్చిన వాటిని ఆధార్ ప్రామాణికంగా డేటాఎంట్రీ పూర్తిచేసి జిల్లా పౌరసరఫరాల కార్యాలయానికి పంపించాల్సి ఉంది. జిల్లాలో ఏ మండలంలో కూడా జాబితా రూపకల్పన మొదలుపెట్టకపోగా గ్రామసభల ద్వారా ఎంపికచేసిన జాబితా కూడా చేరలేదని తెలుస్తోంది.

కొలిక్కిరాని పంపిణీ ప్రక్రియ
జిల్లాలో సమగ్రకుటుంబ సర్వే ప్రకారం 9.85లక్షల కుటుంబాలు ఉన్నాయి. అందులో 5.21లక్షల గ్యాస్‌కనెక్షన్లు ఉండగా 4.64లక్షల కుటుంబాలకు కనెక్షన్లు లేవని తేలింది. ప్రభుత్వం మంజూరుచేసిన 70వేల కనెక్షన్లకు 1.80లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో మహిళా సంఘాలకు ప్రాధాన్యమిస్తూ 25శాతం ఎస్సీలు, 16శాతం ఎస్టీలు, మైనార్టీలకు గ్యాస్‌కనెక్షన్ అందించాలని నిర్ణయించారు. సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ము ఒక్కో కనెక్షన్‌కు రూ.1600చొప్పున మొత్తం 70వేల కనెక్షన్లకు రూ.11.20కోట్లు అందజేసింది.

మే నెలలో దరఖాస్తులు స్వీకరించినప్పటికీ నిర్ణీత గడువు దాటినా పంపిణీ ఓ కొలిక్కిరాలేదు. లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్‌కనెక్షన్లు జారీచేసి ఖాళీ సిలిండర్‌తో పాటు రెగ్యులేటర్ ఇస్తారు. నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, గతంలో ప్రభుత్వం నుంచి దీపం పథకం ద్వారా లబ్ధిపొందని వారు, గ్యాస్‌కనెక్షన్ తీసుకునేందుకు డబ్బు వెచ్చించలేని నిరుపేదలు ఈ పథకానికి అర్హులు. గ్రామసభల ద్వారా ఎంపికచేసిన లబ్ధిదారుల జాబితాను కలెక్టర్ ఆమోదించి ఆ తరువాత జిల్లా మంత్రికి నివేదించిన తరువాతే కనె క్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం మేల్కోవాల్సి ఉంది.

మరిన్ని వార్తలు