దండు కదిలింది !

11 Sep, 2015 04:56 IST|Sakshi
దండు కదిలింది !

- ప్రధాన కాల్వ అడ్డుకట్ట తొలగించిన 400 మంది రైతులు
- అన్నదాతలకు మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి సంఘీభావం
జన్నారం :
కడెం ప్రాజెక్ట్ నుంచి ప్రధాన కాలువ ద్వారా 28 డిస్ట్రిబ్యూటరీ వరకు నీరు అందడం లేదని, దీంతో తమ పొలాలు ఎండిపోతున్నాయంటూ దండేపల్లి మండల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గురువారం జన్నారం మండలం కామన్‌పల్లి ప్రాంతంలో 13 డిస్ట్రిబ్యూటరీకి వెళ్లేతూము వద్ద ఆ ప్రాంత రైతులు బండరాళ్లతో అడ్డుకట్ట వేశారు. దీంతో తమకు నీరు రావడం లేదని ఆగ్రహించిన దండేపల్లికి చెందిన 400 మంది రైతులు దండులా కదిలివచ్చారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి అధ్వర్యంలో అడ్డుకట్టను తొలగించారు. కడెం ఆయక ట్టులో నీరున్న తగినంత విడుదల కాకుండా వారబందీ ద్వారా కేవలం 4 ఫీట్లు విడుదల చేయడం వల్లే నీళ్లు జన్నారం మండల వరకైనా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దండేపల్లి మండలం అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి , తాళ్లపేట్ సర్పంచ్ లింగరావు, గూడెం ఎంపీటీసీ సభ్యులు ముత్తే నారాయణ పాల్గొన్నారు.
 
మేదరిపేటలో సాగునీటి కోసం రాస్తారోకో
దండేపల్లి : కడెం ఆయకట్టు కింద ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు సాగునీరందక ఎండిపోతే ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి డిమాండ్ చేశారు. కడెం ఆయకట్టు కింద పంటలకు సాగునీరు సక్రమంగా అందడం లేదని, నీటి గేజ్‌ను పెంచాలని మండల రైతులు గురువారం కడెం ప్రాజెక్టుకు తరలి వెళ్లారు. దారిలో మండలంలోని మేదరిపేట వద్ద రైతులు గంటపాటు రాస్తారోకో నిర్వహించారు.  రైతుల ఆందోళనకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకులు  మద్దతు పలికారు.
 
కడెం ప్రాజెక్టు వద్ద రైతుల ఆందోళన
కడెం: కడెం ప్రాజెక్టు ద్వారా తమ పంట పొలాలకు నీరందించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆయకట్టు పరిధిలోని దండేపల్లి,తాళ్లపేట,లక్సెట్టిపేట, తపాలాపూర్,రోటిగూడెం ప్రాంతాలకు చెందిన వందలాది మంది రైతులు ఇక్కడికి తరలివచ్చారు.  సాగు నీరులేక తమ పంటలు ఎండిపోతున్నాయని వారు అధికార్లతో చెప్పారు. అయితే రైతులు వచ్చారనే సమాచారంతో ప్రాజెక్టు డీఈ నూరుద్దీన్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. రైతులతో పాటు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే అరవింద రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. రైతుల తరఫున ఆయన ప్రాజెక్టు డీఈతో మాట్లాడి ఆయకట్టు పరిస్థితిని  వివరించారు.గతంలో కడెంలో జరిగిన నీటి సంఘాల సమావేశంలో చేసిన తీర్మానం ప్రకారం ఆయకట్టు కిందనున్న డీ-28 వరకు నీటిని విడుదల చేయాలన్నారు.నీరివ్వకుంటే ఊర్కోమని,నీరిచ్చేదాకా ఇక్కడే ఉంటామని రైతులు భీష్మించారు. దీంతో ప్రాజెక్టు డీఈ నూరుద్దీన్ ఇక్కడి పరిస్థితిని ఈఈ వెంకటేశ్వర్‌కు వివరించారు. నీటి విడుదలపై రెండు రోజుల్లో తగు నిర్ణయం తీసుకుంటామని వారు రైతులకు హామీ ఇచ్చారు.దీంతో స్పందించిన రైతులు ఇచ్చిన హామీని నిలుపుకోవాలని  అధికారులకు సూచించి నిరసన విరమించారు. 400 మంది రైతులు నిరసనలో పాల్గొన్నారు.
 
28వ డిస్ట్రిబ్యూటరీ దాకా నీళ్లిస్తాం

దండేపల్లి : కడెం ప్రాజెక్టు నీటిని 28వ డిస్ట్రిబ్యూటరీ కాల్వ వరకూ నీటిని అందిస్తామని ఎమ్మెల్యే దివాకర్‌రావు గురువారం ఓ ప్రకటనలో  తెలిపారు. ఆయకట్టు కింద నెలకొన్న సాగు నీటి ఇబ్బందులను నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లానన్నారు. ప్రధాన  కాల్వలకు నీటి గేజిని సుమారు 7 ఫీట్లకు పైగా పెంచి విడుదల చేస్తామన్నారు. కాల్వలో నీటికి అడ్డుకట్టలు వేయకుండా చూడాలని అధికారులకు సూచించామన్నారు. గూడెం ఎత్తిపోతల నీటిని శుక్రవారం నుంచి రెండు మోట్లార్ల ద్వారా విడుదల చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు