అధికారం వచ్చాకా హామీలేనా!

10 Sep, 2014 02:38 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ తొలి ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా హామీలిచ్చి అధికారం చేపట్టిన కేసీఆర్, వాటిని అమలు చేయకుండా మళ్లీ హామీలతోనే కాలయాపన చేస్తున్నారని శాసనమండలిలో విపక్షనేత ధర్మపురి శ్రీనివాస్ విమర్శించారు. అధికారం చేపట్టిన తక్షణమే ఏడు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, పేదోడికి రెండు పడక గదులతో కూడిన ఇల్లు, రూ. లక్ష వరకు రుణమాఫీ తదితర హామీలిచ్చిన ఆయన ఏ ఒక్కటి కూడా అమలు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.

అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా, ఎన్నికల మేనిఫెస్టో జోలికి వెళ్లకుండా తెలంగాణను సింగాపూర్ చేస్తానంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. మంగళవారం నిజామాబాద్‌లోని మున్నూరుకాపు సంఘం కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డి. శ్రీనివాస్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ప్రజలు బలంగా నమ్మినా టీఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెట్టారని, ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేనిఫెస్టోను అమలు చేయాల్సిన కేసీఆర్ కొత్త కొత్త హామీలను తెర పైకి తెచ్చి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.

 క్లారిటీ లేదు
 ‘‘ప్రభుత్వంలో పూర్తిగా స్తబ్దత ఏర్పడింది. ఉచిత కరెంట్, రుణమాఫీ, ఎస్‌సీలకు భూపంపిణీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర పథకాలపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇంత జరుగుతున్నా, మేము ప్రభుత్వాన్ని ఇప్పుడే నిందించదలచుకోలేదు. 100 రోజులకే ఫెయిల్యూర్ అయ్యిందని అనకూడదనుకుంటున్నాం. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, తెలంగాణ పునర్‌నిర్మాణం విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తుంది.

 అభివృద్ధి పథకాల అమలు కోసం దసరా, దీపావళి వరకు వేచి చూస్తాం. అప్పటికీ కూడా వాటికి మోక్షం కలగకపోతే సర్కారును ప్రశ్నిస్తాం’’ అని డీఎస్ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్దిపై దృష్టి సారించాల్సిన కేసీఆర్ ఉచిత కరెంట్‌పై అడిగితే ఇరిటేట్ అవుతున్నారని, మూడేళ్ల వరకు కరెంట్ జోలే లేదంటూ దాటవేస్తున్నారని ఆరోపించారు.

 వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ దివంగత నేత డాక్టర్ వైఎస్‌ఆర్ జలయజ్ఞం కింద నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, జిల్లాలో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను కూడా ప్రారంభించుకున్నామని డీఎస్ గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వం మాత్రం రైతులకు ప్రయోజనం కలిగించే జలయజ్ఞం జోలికి వెళ్లకుండా కుంటలు, చెరువుల మరమ్మతులంటూ కొత్త పథకాలను వల్లిస్తోందన్నారు. ఎస్‌సీలకు భూపంపిణీ అంటూ హంగామా చేసి, జిల్లాకు 10 మందికి మాత్రమే పట్టాలిచ్చి చేతులు దులుపుకుందన్నారు.

ఎస్‌సీలు, ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయడమే సాధ్యం కాలేదంటే, కొత్తగా 12 శాతం ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమగ్ర సర్వే సమర్థనీయమే అయినా, ప్రజలకు ఉపయోగపడే ముఖ్యమైన అంశాలను ప్రభుత్వం విస్మరించిందన్నారు. ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధి గా నిలిచే మీడియాను నియంత్రించాలని చూడటం మంచిది కాదన్నారు.

 విలేకరుల సమావేశంలో టీపీసీసీ కార్యదర్శులు నరాల రత్నాకర్, ధర్మపురి సురేందర్, నిజామాబాద్ జడ్‌పీటీసీ పుప్పాల శోభ, వక్ఫ్‌బోర్డు చైర్మన్ జావిద్ అక్రం, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశ వేణు, యూత్‌కాంగ్రెస్ నాయకుడు ఘన్‌రాజ్, కార్పోరేటర్లు కాపర్తి సుజాత, పి.లావణ్యరెడ్డి, విజయలక్ష్మి, పుప్పాల లావణ్య, చంద్రకళ, చంగుబాయి, సుగుణ, రేవతి, దారం సాయిలు, మాయవార్ సాయిరాం, ఖుద్దూస్, రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు