ప్రగతి చక్రం ముందు ప్రశ్నలెన్నో!

3 May, 2020 03:31 IST|Sakshi

కనీసం నెల వరకు నడపొద్దంటున్న నిపుణులు

లేకుంటే మొదటికే మోసమొస్తుందని హెచ్చరిక

సీటుకు ఒక్కరు, శానిటైజేషన్, మాస్కు తప్పనిసరి

గ్రీన్‌జోన్ల విషయంలో ఆర్టీసీలో గందరగోళం

నిపుణులతో సమాలోచనలు.. తర్వాతే తుది నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: గ్రీన్‌జోన్ల పరిధిలో ఆర్టీసీ బస్సుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా అది కదిలే పరిస్థితి కనిపించడంలేదు. ఈ నెల 7తో రాష్ట్రంలో రెండో విడత లాక్‌డౌన్‌ ముగియాల్సి ఉన్నా, కేంద్రం ఈ నెల 17 వరకు మూడో విడత లాక్‌డౌన్‌ను ప్రకటించింది. అప్పటి వరకు బస్సులు తిరిగే అవకాశం దాదాపు లేనట్లే. అయితే గ్రీన్‌ జోన్ల పరిధిలో సామర్థ్యంలో 50 శాతం మందితో బస్సులు తిప్పుకునేందుకు కేంద్రం అనుమతించింది. రాష్ట్రంలో గ్రీన్‌ జోన్‌ పరిధిలో 9 జిల్లాలున్నా వాటి మధ్య బస్సులు తిప్పడం అంత సులువు కాదని ఆర్టీసీ భావిస్తోంది. ఈ నెల 5న జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. గ్రీన్‌ జోన్ల పరిధిలో కూడా బస్సులు తిప్పొద్దని అధికారు లు సిఫారసు చేసేలా ఉన్నారు. ఆరెంజ్, రెడ్‌ జోన్ల నుంచి కూడా జనం వచ్చే ప్రమాదం ఉంటుందని, వారిలో వైరస్‌ సోకినవారుంటే పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందని అధికారులంటున్నారు. దీంతో గ్రీన్‌ జోన్లలో బస్సులు తిప్పే విషయంలో కూడా ఆచితూచే నిర్ణయం తీసుకోనున్నారు.

నెలాఖరు వరకు పొడిగిస్తే..
ఈనెల 17తో కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ పూర్తవుతుంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త ఎక్కువే ఉన్నందున, ఒకవేళ కేంద్రం తదుపరి లాక్‌డౌన్‌ను విధించకున్నా రాష్ట్రంలో నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ కొనసాగించటమే ఉత్తమమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత లాక్‌డౌన్‌ ఉన్నా, ఆంక్షలతో సడలించినా... బస్సులను తిప్పే విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తేసి జనం పనులకు వెళ్లటం ప్రారంభిస్తే బస్సుల్లేకుండా ఎలా అన్నది పెద్ద సమస్య. బస్సులు తిప్పితే ప్రయాణికులను నియంత్రించడం అంత సులువు కాదు, అలాంటప్పుడు మళ్లీ వైరస్‌ విస్తృతికి బస్సులు కారణమవుతాయని కొందరు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు ఎప్పటి నుంచి ప్రారంభించాలన్నది పెద్ద సవాల్‌గా మారింది.

గ్రీన్‌ జోన్‌లో తిప్పాలన్నా సవాళ్లెన్నో..
రాష్ట్రంలో గ్రీన్‌జోన్‌ను ఆనుకునే ఆరెంజ్, రెడ్‌ జోన్లున్నాయి. బస్సు మరో ప్రాంతానికి వెళ్లాలంటే ఒక్కోసారి రెడ్‌జోన్‌ దాటుకుని వెళ్లాలి. వరంగల్‌ అర్బన్‌ రెడ్‌ జోన్, వరంగల్‌ రూరల్‌ గ్రీన్‌ జోన్‌.. ఇక్కడ జనం అటూఇటూ కలిసినా గుర్తించలేరు. రెడ్‌జోన్‌ నుంచి వచ్చి గ్రీన్‌జోన్‌లో బస్సెక్కితే కండక్టర్లు పసిగట్ట లేరు. ఇక 50 శాతం సీట్లకే ప్రయాణికులను పరిమితం చేయాలన్న నిబంధన అమలు కూడా కష్టమే. కొందరు కండక్టర్లను బెదిరించి బస్సెక్కే పరిస్థితి ఉంటుంది. ఇక బస్సులో ప్రయాణించిన ఏ వ్యక్తికైనా కరోనా ఉన్నట్లు తేలితే, అందులో ప్రయాణించిన వారందరినీ క్వారంటైన్‌ చేయాల్సి ఉంటుంది. కానీ వారి వివరాలు దొరకడం సులభం కాదు. ఇవన్నీ ఆర్టీసీ అధికారులు సంధిస్తున్న ప్రశ్నలు. వీటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

నిపుణుల సూచనలివి...
ఇప్పటికిప్పుడు బస్సులు రోడ్డెక్కడం శ్రేయస్కరం కాదు. కనీసం నెల రోజుల తర్వాతే బస్సులను ప్రారంభించాలి. కరోనా బాధితులు హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎంతమందిలో వైరస్‌ ఉందో చెప్పలేని పరిస్థితి. అందుకని నెలాఖరుకు బస్సులు ప్రారంభించినా, హైదరాబాద్‌ నుంచి తిప్పొద్దు.

కనీసం ఆరు నెలలు నడపొద్దు
కరోనా విస్తరిస్తూ పోతే తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రస్తుతం వైరస్‌ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, కనీసం ఆరు నెలల పాటు ప్రజా రవాణాను నిలిపివేయాలి. ఈలోపు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశంతో పాటు వైరస్‌ ప్రభావం కూడా తగ్గుముఖం పడుతుంది. ఆరు నెలల పాటు ప్రజా రవాణాను నిలిపివేయటమంటే ఆయా సంస్థలను దాదాపు దివాలా తీయించడమే. ప్రజా రోగ్యం, ప్రజారవాణా సంస్థలు.. రెండింటిలో ప్రజారోగ్యానికే ప్రాధాన్యం. ఆ సంస్థలను బతికించుకోవటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించాలి. – పాదం సుదర్శన్, పుణేలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు, మాజీ డైరెక్టర్‌

ఇప్పటికి ఇప్పుడు నడపొద్దు..
ప్రస్తుతం బస్సులు తిప్పే పరిస్థితి లేదు, తిప్పితే ప్రమాదకరం కూడా. నెల తర్వాత లాక్‌డౌన్‌ సడలిస్తే కచ్చితంగా బస్సులు తిప్పాలి. ఎందుకంటే, బస్సులు లేకుంటే జనజీవనం ముందుకు సాగదు. లిమిటెడ్‌ సర్వీసులనే తిప్పుతూ సీటుకు ఒకరు చొప్పున ఉండేలా చూడాలి. ప్రయాణికులు కచ్చితంగా భౌతిక దూరం పాటిస్తూ మాస్కు ధరించి వచ్చేలా నిబంధనలు విధించాలి. బస్సుల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. అనారోగ్యంతో ఉన్నవారిని ఎక్కనీయకుండా చూడాలి. ఇలాంటి జాగ్రత్తలతో కొంతకాలం తక్కువ బస్సులు తిప్పుతూ, అనుకూలమైన వాతావారణం వచ్చేకొద్దీ వాటి సంఖ్యను పెంచుతూ పోవాలి.
– నాగరాజు, ఆర్టీసీ విశ్రాంత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌

పకడ్బందీ జాగ్రత్తలతో తిప్పాలి.. 
బస్సులు తిప్పేందుకు నిర్దిష్టంగా కొన్ని నిబంధనలు రూపొందించాలి. ఏమాత్రం అజాగ్రత్త, నిర్లక్ష్యానికి తావి వ్వొద్దు. ఆర్టీసీ బస్టాండ్లలో ఎక్కడా జనసమూహం భారీగా ఉండకుండా చూడాలి. బస్సుల్లో ఒక సీటును వదిలి తదుపరి సీటులో ప్రయాణికులు కూర్చునేలా చూడాలి. ప్రతి బస్సు బయలు దేరేముందు, గమ్యం చేరి తిరిగి అక్కడ బయలుదేరేముందు శానిటైజ్‌ కావాలి. లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తేస్తూ బస్సులను కూడా ప్రారంభించాలి. – ఆర్టీసీ విశ్రాంత ఎండీ

బస్సులతో అత్యంత ప్రమాదం..
కరోనా పాజిటివ్‌ వ్యక్తి బస్సులో ప్రయాణిస్తే, ఆ బస్సులో ఉన్న మిగతావారందరికీ ప్రమాదం పొంచి ఉన్నట్టే. మాస్కు సరిగా లేకుండా ఆ వ్యక్తి తుమ్మినా, దగ్గినా మిగతావారికి వైరస్‌ సోకే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే తుమ్మినప్పుడు పడే తుంపర్లు బస్సు హోల్డింగ్‌ రాడ్స్‌పై పడ్డా, సీటుపై పడ్డా చాలామంది ఆ ప్రాంతాల్లో చేతులు పెట్టే అవకాశం ఉంటుంది. వెంటనే చేతులు శుభ్రం చేసుకోని పక్షంలో కచ్చితంగా వైరస్‌ వారిలోకి చేరుతుంది. – డాక్టర్‌ పి.ఎస్‌.మూర్తి, సీనియర్‌ సర్జన్‌

మరిన్ని వార్తలు