ఆటో.. అటో ఇటో..! 

7 Mar, 2019 07:14 IST|Sakshi
ఇష్టానుసారంగా రోడ్లపై పార్కింగ్‌చేసిన ఆటోలు, పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న ఆటో 

ప్రాణాలతో చెలగాటం ప్రయాణికులకు రక్షణ కరువు 

లైసెన్స్‌ లేకుండానే డ్రైవింగ్‌ మితిమీరిన వేగంతో ప్రయాణం 

ప్రమాదాలకు ప్రధాన కారణాలివే! 

తనిఖీ చేయని అధికారులు 

ఆర్మూర్‌టౌన్‌: నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై ఇష్టానుసారంగా తిరుగుతున్న ఆటోలతో ప్రజల ప్రాణాలకు రక్షణలేకుండా పోతోంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిబంధనల మేరకు ఆటోలు, ఇతర వాహనాలు నడిపేందుకు ఆర్టీవో కార్యాలయం నుంచి లైసెన్సులు పొందాలి. లైసెన్సులు లేకున్నా ఆటోలు నడుపుతున్నందున రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్మూర్‌ పట్టణం మున్సిపల్‌ పరిధిలో  ఆటోల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఈ పట్టణంతోపాటు నిజామాబాద్‌ నగరం, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీమ్‌గల్‌ పట్టణాలే కాకుండా అన్ని మండల కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి దాపురించింది. పట్టణాలకు చుట్టు పక్కల గ్రామాలకు బస్సులు వెళ్లలేకపోవడంతో ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రజలు ఆటోల మీద ఆధారపడి ప్రయాణం సాగిస్తున్నారు. అదే విధంగా పట్టణాల్లో ఒకచోట నుంచి మరో చోటుకు వెళ్లేందుకు ప్రజలు ఆటోలనే ఆశ్రయిస్తున్నారు. ఉదయం సాయంత్రం సమయంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆటోడ్రైవర్లు ఇష్టారాజ్యంగా ముగ్గురు ప్రయాణికులతో ప్రయాణించాల్సిన ఆటోలో ఎనిమిది నుంచి పది మంది వరకు ఎక్కించుకుని వెళుతున్నారు.

 పెరుగుతున్న ప్రమాదాలు

అనుభవం, లైసెన్సు లేకుండా ఆటోలు నడపటంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. నిబంధనల ప్రకారం 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే ఆటోలు నడపాలి. అయితే ఇక్కడ మైనర్లు సైతం ఆటోలు నడుపుతున్నారు. ఫలితంగా పట్టణంలో తరుచూ ప్రమాదాలు జరగుతున్నాయి. ఉదయం, సాయంత్రం సమయంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఆటోలు డ్రైవర్లు మితిమీరిన వేగంతో నడుపుతూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఆటోలో డ్రైవర్‌ల పక్కన కూర్చుని ప్రయాణించేందుకు అనుమతి లేదు. కాగా డ్రైవర్‌ సీట్లో డ్రైవర్‌తో పాటు ముగ్గురు కూర్చుని ప్రయాణం చేస్తున్నారు.

అదే విధంగా ప్రయాణికుల కోసం ఆటో డ్రైవర్లు తమ ఆటోలను రోడ్డు మీదనే నిలుపుతున్నారు. దాంతో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడి ఆటోవెనుక పదుల సంఖ్యలో వాహనాలు రోడ్డుపై నిలిచిపోతున్నాయి. బస్టాండ్‌ ప్రాంతంలో ఆటోడ్రైవర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఆటోడ్రైవర్లపై పోలీసులు చర్యలు చేపట్టకపోవడంతో వారి ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఇప్పటికైనా పోలీస్‌ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

మచ్చుకు కొన్ని సంఘటనలు..

ఫిబ్రవరి 7న పాత ఎంజే ఆస్పత్రి వద్ద బైక్‌ వెళ్తున్న మురిళి అనే వ్యక్తికి ఆటో ఢీకొట్టిన సంఘటనలో ఆయన చేయి విరిగింది. సుమారు రూ.80వేల వరకు ఆస్పత్రి ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈనెల 4న గోల్‌బంగ్లా ప్రాంతంలో ఓ ఆటోడ్రైవర్‌ ఆటోను రివర్స్‌ తీసుకుంటున్న సమయంలో వెనుక ఉన్న ఓ బాలుడిని చూడక ఢీకొని పక్కన ఉన్న మురికి కాలువ పడిపోయాడు. ఈ సంఘటనలో బాలుడికి ఎటువంటి ప్రమాదం జరగపోడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. గత నెలలో ఆలూర్‌ సమీపంలో ఆటో బోల్తాపడిన ఘటనలో 9మంది మహిళలకు గాయాలయ్యాయి. 

అటోల ఆగడాలను అరికట్టాలి..

పట్టణంలో ఆటోలు ఇష్టానుసారంగా వ్యహరిస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడుతున్నారు. పరిమితికి మించి ప్రయాణిలకు ఎక్కించుకొని వెళ్తున్నారు. మైనర్లు ఆటోలు నడిపించినట్‌లైతే వారి చర్యలు తీసుకునే విధంగా అ«ధికారులు చర్యలు తీసుకోవాలి. 
–రాజేందర్, ఆర్మూర్‌.

లైసెన్సు లేకుంటే చర్యలు తీసుకోవాలి

లైసెన్సు లేకుండా ఆటోలు నడిపిస్తున్న వారిపై సంబంధింత అధికారులు చర్యలు తీసుకోవాలి. మితిమీరిన వేగంతో నడిస్తున్న ఆటోడ్రైవర్లకు అడ్డుకట్టా వేయాలి. మైనర్లు ఆటోలు నడిపిస్తే ఆ ఆటోలను సీజ్‌ చేయాలి. అధికారులు ప్రతిరోజు ఆటోల తీరుపై నిఘా ఉంచాలి.  
–మోహన్, ఆర్మూర్‌.
 

మరిన్ని వార్తలు