ఔషధ నగరి.. పరిహారం కిరికిరి!

20 Jun, 2015 02:54 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ముచ్చర్ల ఔషధనగరికి అడుగడుగునా చిక్కుముళ్లు ఎదురవుతున్నాయి. భూసేకరణ ప్రక్రియ కొలిక్కిరాకపోవడం ప్రాజెక్టు అంకురార్పణపై ప్రభావం చూపుతోంది. భూములు కోల్పోయే రైతాంగానికి పరిహారం చెల్లించే అంశంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఫార్మాసిటీకి పునాదిరాయి ఇప్పట్లో పడే అవకాశం కనిపించడంలేదు. ఔషధనగరి పనులు చకచకా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వస్థాయిలో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, పరిహారం చెల్లించే విషయంలో స్పష్టత వ చ్చేవరకు అడుగుముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడింది. దాదాపు 10,939 ఎకరాల్లో ఫార్మాసిటీని స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూములను సేకరించి టీఐఐసీకి అప్పగించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు కసరత్తు చేసిన జిల్లా
 అధికారులకు ప్రతిబంధకాలే ఎదురవుతున్నాయి.   
 - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి
 
 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఫార్మాసిటీతో నిర్వాసితులుగా మారే రైతాంగం నష్టపరిహారంపై బెట్టువీడడంలేదు. మరీ ముఖ్యంగా పట్టాదారులు కనీస ధర (మార్కెట్ వాల్యూ) కంటే అధికంగా మూడింతలు పరిహారం చెల్లిస్తేనే భూములు అప్పగిస్తామని భీష్మించారు. బహిరంగ మార్కెట్‌లో కూడా దాదాపు ఎకరాకు రూ.15 లక్షల వరకు ధర పలుకుతుండగా.. కేవలం ఏడున్నర లక్షలకు భూములను లాక్కోవడం సమంజసంకాదని వాదిస్తున్నారు. ముచ్చర్లలోని సర్వే నం.288లో రెవెన్యూ రికార్డు ప్రకారం 2,746 ఎకరాలు ఉండాల్సివుండగా, ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ (ఈటీఎస్) సర్వేలో 1,917 ఎకరాలు మాత్రమే తేలింది. ఇదే సర్వే నంబర్‌లో 381.32 ఎకరాల పట్టా భూములను 151 మంది సాగు చేసుకుంటున్నారు. మరో 293.20 ఎకరాలు 150 మందికి అసైన్డ్ చేశారు. వీరందరూ ప్రస్తుతం నష్టపరిహారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు.
 
 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాల్సిందేనని పట్టాదారులు పట్టుబడుతుండడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో యంత్రాంగం పడిపోయింది. పట్టాదారులతో ఇప్పటికే పలుమార్లు సంప్రదింపులు జరిపినప్పటికీ ససేమిరా అంటుండడం.. సాధ్యమైనంత త్వరగా భూములను బదలాయించాలని టీఐఐసీ ఒత్తిడి పెంచుతుండడం రెవెన్యూ అధికారులకు చిరాకు కలిగిస్తోంది. మరోవైపు పట్టాదారులకు పరిహారం చెల్లించే విషయం కొలిక్కివస్తే.. అసైన్డ్‌దారులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించే అంశంపై అడుగు ముందుకేయాలని భావిస్తోంది. పట్టాలు పొందినా, కబ్జాలో లేన ందున పరిహారం ఇచ్చే విషయంలో తర్జనభర్జనలు పడుతోంది. అయితే, ప్రభుత్వం పొజిషన్ చూపకపోవడంతోనే అసైన్డ్‌దారులు కబ్జాలో లేరని, అది వారి తప్పుగా భావించడంలో అర్థంలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై స్పష్టత వస్తేకానీ భూసేకరణ సాఫీగా జరిగే అవకాశంలేదు.
 

మరిన్ని వార్తలు