తూతూ మంత్రంగా చర్యలు

21 Mar, 2014 02:50 IST|Sakshi

ఖమ్మం, న్యూస్‌లైన్: ఖమ్మంలోని రెండు పరీక్ష కేంద్రాలలో యథేచ్ఛగా కాపీయింగ్ జరుగుతున్న వైనంపై సాక్షి దినపత్రికలో గురువారం వచ్చిన కథనం కలకలం రేపింది. కాగా, ఈ వైనంపై అధికారులు స్పందించిన తీరు విమర్శలకు తావి స్తోంది. ఒక అటెండర్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేసి, ఓ ఏపీఎస్(అసిస్టెంట్ చీప్ సూపరిండెట్)ను తొలగించి అధికారులు చేతులు దులుపుకున్నారు. గతంలో ఆరోపణలు ఉన్నా కళాశాలకు తిరిగి అనుమతులు ఇవ్వడం, అర్హత లేని వారిని ఇన్విజిలేటర్లుగా నియమించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కేంద్రంలో మాస్ కాపీయింగ్ వ్యవహారంలో అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని, కాపీరాయుళ్లను రక్షిస్తున్నారని, మాస్ కాపీయింగ్ ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకోలేదని అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 బుధవారం జిల్లా కేంద్రంలో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతుందని ‘సాక్షి’పత్రిక,టీవీలుసంయుక్తంగా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌ను గురువారం కళ్లకుకట్టినట్టు అటుపత్రికలోనూ, ఇటుటీవీలోనూ వచ్చింది. ఇంటర్‌బోర్డ్ అధికారులు స్పం దించారు. పూర్తివివరాలు సేకరించాలని, దోషులపై చర్యలు తీసుకోవాలని, పరీక్షలు పకడ్బందిగా నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. దీంతో తప్పని పరిస్థితిలో చర్యలు తీసుకోవాల్సి రావడంతో అధికారులు ఆర్భాటం చేశారని, హంగామా సృష్టించారని సమాచారం. ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు’గా కేవలం ఒకరిద్దరిపై చర్యలు తీసుకుంటామని చెప్పి చేతులు దులుపుకోవడం విస్మయం కలిగించింది. మాస్ కాపీయింగ్‌కు కీలక భూమిక పోషించిన ఓ ఉపాధ్యాయుని భార్యకు ఏ అర్హత లేకున్నా ఇన్విజిలేటరుగా నియమించడం, ఇంత జరిగినా కూడా సంబంధిత అధికారి కనీసం పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయకపోవడంపై అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 ఆర్‌ఐవోను నిలదీసిన విద్యార్థి సంఘాలు
 జిల్లాలో మాస్ కాపీయింగ్ జరుగుతున్నా పట్టించుకోని ఆర్‌ఐఓను విద్యార్థి సంఘాల నాయకులు గురువారం నిల దీశారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయనకు ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ నాయకులు మెమోరాండం ఇచ్చారు. గత రెండేళ్లుగా జిల్లాలో మాస్ కాపీయింగ్ జరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఉపేందర్ చెప్పారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యంతో అధికారులు కుమ్మక్కై మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహించారు. దీనిపై గవర్నర్‌కు ఫాక్స్ ద్వారా ఫిర్యాదు చేస్తామన్నారు. అక్రమార్కులపై చర్య తీసుకోకుంటే ప్రత్యేక్ష ఆందోళనకు దిగుతామని పీడీఎస్‌యూ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ప్రదీప్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.

 కాగా, మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆర్‌ఐవో విశ్వేశ్వర్‌రావు తెలిపారు. ఆయన గురువారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుతున్నామన్నారు. ఈ వ్యవహరంతో సంబంధమున్న వారిపై పోలీస్ కేసులు పెట్టే విషయమైపై రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చిస్తామన్నారు.

>
మరిన్ని వార్తలు