‘స్లైడ్ డోర్’ నష్టాలు భరించలేం

25 Jan, 2015 03:27 IST|Sakshi
‘స్లైడ్ డోర్’ నష్టాలు భరించలేం

* ఏటా రూ.40 కోట్ల నష్టం వస్తుందని ఆర్టీసీ అంచనా
* రీయింబర్స్ చేయాలని ప్రభుత్వానికి విన్నపం

 
 సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత కోసం దేశంలోనే వినూత్నంగా బస్సుల్లో స్లైడ్ డోర్ విధానానికి శ్రీకారం చుట్టిన ఆర్టీసీ దానివల్ల వార్షికంగా రూ.40 కోట్ల వరకు ఆదాయం తగ్గుతుందని అంచనాకొచ్చింది. ఆ మొత్తాన్ని భరించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి వివరాలతో ఇటీవల ఒక నివేదిక సమర్పించింది. హైదరాబాద్ సిటీ బస్సుల్లో మహిళల భద్రత కోసం ముందుభాగంలో కొన్ని సీట్ల వరుసల తర్వాత ప్రత్యేకంగా స్లైడ్‌డోర్ ఏర్పాటు చేసి పార్టీషన్ విధానాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
 
 ఆ విభజన డోర్‌ను దాటి పురుషులు ముందుకు రాకుండా ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రత్యేక తలుపు ఏర్పాటు చేయటం కోసం బస్సుల్లో  రెండు సీట్లను తొలగించాల్సి వచ్చింది. దీనివల్ల నలుగురు ప్రయాణికులు కూర్చునే స్థలం తగ్గింది. దాంతోపాటు ప్రయాణికులు నిలబడే కొంత స్థలాన్ని కూడా ఆ  డోర్ ఆక్రమించింది. దీని ఆధారంగా లెక్కలేసిన అధికారులు సంవత్సరానికి రూ.40 కోట్ల మేర ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని తేల్చారు. సంస్థ ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న నేపథ్యంలో ఇది పెద్ద భారంగా మారుతుందని, ఆ మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం రీయింబర్స్ చేయాలని ఆర్టీసీ కోరినట్టు సమాచారం.
 
 పనులు ప్రైవేటు పరం..
 ఆర్టీసీకి మియాపూర్‌లో ప్రత్యేకంగా బస్ బాడీ వర్క్‌షాపు ఉంది. ఇక్కడ బస్సుల లోపలి భాగాలను తయారు చేసేందుకు అవసరమైన పూర్తి వ్యవస్థ ఉంది. అలాగే ఇదే తరహా పనిలో అనుభవం ఉన్న నలుగురైదుగురు కార్మికులు ప్రతి డిపోలో అదనంగా ఉంటారు. కానీ మహిళల భద్రత కోసం ఉద్దేశించిన సై ్లడ్ డోర్ల ఏర్పాటు పనిని మాత్రం ఆర్టీసీ ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. దీనివల్ల రూ.4 కోట్లనుంచి 5 కోట్లవరకు ఖర్చవుతోంది. ఇది ఇప్పుడు ఆర్టీసీకి అదనపు భారంగా పరిణమించింది.

మరిన్ని వార్తలు