సీఎం ఇలాకాలోనాణ్యత నగుబాటు

2 Mar, 2016 03:31 IST|Sakshi
సీఎం ఇలాకాలోనాణ్యత నగుబాటు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ గజ్వేల్: ఇంటింటికీ తాగు నీరందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో ఆదిలోనే డొల్లతనం బయటపడుతోంది.  అదీ నిరంతరం సీఎం కేసీఆర్ పర్యవేక్షణ ఉండే గజ్వేల్ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి  తన సొంత నియోజకవర్గంలో చేపట్టిన ఈ పనుల్లో నాణ్యత లోపాలు బయటపడ్డాయి. గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపురంలో రూ. 800 కోట్లతో చేపడుతున్న ఓవర్ హెడ్‌ట్యాంక్ పిల్లర్ మంగళవారం నిర్మాణ దశలోనే కూలిపోయింది.

ఓవర్‌హెడ్ ట్యాంకు కోసం నాలుగు వైపులా నాలుగు పిల్లర్లను నిర్మించారు. దానిపై ట్యాంకు నిర్మించేందుకు రౌండ్ పిల్లర్‌బెడ్ వేస్తున్నారు. తర్వాత దశ పనులకు సమాయత్తమవుతుండగానే రౌండ్ పిల్లర్‌బెడ్ కూలిపోయింది. దీంతో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా కూలిపోయిన రౌండ్ పిల్లర్‌ను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.  ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇవ్వడంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుం టున్నాయని రిటైర్డ్ ఇంజనీరు, మిషన్ భగీరథ కన్సల్టెంట్ ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో 157 ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణ నాణ్యతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరిన్ని వార్తలు