సరైనోళ్లకే.. లేకపోతే నోటాకే..

27 Nov, 2018 12:18 IST|Sakshi
నోటా అప్షన్‌

ఓటేస్తామంటున్న యువత   

సాక్షి, సుజాతనగర్‌: ప్రజా సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండి, అభివృద్ధికి కృషి చేసేవారికే తమ ఓటు వేస్తామని యువత చెబుతోంది.  ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును స్వచ్ఛందం గా వినియోగించుకోవాలని, నోటును కాదు నేతను చూడాలని పేర్కొంటోంది. డిసెంబర్‌ 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై యువత అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.   

సుస్థిర పాలన అందించే పార్టీకే..  
రాష్ట్రంలో సుస్థిర పాలన అందించడమే గాకుండా యువతకు ఉద్యోగావకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలి.  ప్రణాళికాబద్ధంగా పాలించే పార్టీకే ఓటు వేయడానికి ప్రాధాన్యమిస్తాం. అభ్యర్థులందరినీ పరిశీలించి వారిలో మంచి వారిని గుర్తిస్తాను. 

–వంగవీటి కిరణ్‌ కుమార్, సుజాతనగర్‌ 

విద్యాభివృద్ధిని ఆకాంక్షించేవారికి..  
ఎమ్మెల్యేగా పోటీచేసే వ్యక్తికి స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉండాలి. పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు, ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్య నామమాత్రంగా అందుతోంది. విద్యాభివృద్ధికి పాటుపడే వ్యక్తికి నా ఓటు వేస్తా. 

–చింతలపూడి మాధవి, సుజాతనగర్‌ 

అవినీతిని అరికట్టాలి
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలలో అవినీ తి రాజ్యమేలుతోంది. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు సరిగా అంద డం లేదు. పూర్తిస్థాయిలో అవినీతిని అరికట్టే అభ్యర్థి ఎన్నిక కావాల్సి ఉంది. అలాంటి అభ్యర్థిని గుర్తించి వారికి నా ఓటు వేస్తాను. 

–చింతలపూడి సాయి, సుజాతనగర్‌ 

స్వార్థపరులకు ఓటు వేయను.. 
ప్రజలతో ఎన్నికైన వారు సొంత ప్రయోజనాలను పక్కన పెట్టాలి. ప్రజలచేత ఎన్నికైన నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. మెజారిటీ ప్రజల సమస్యలను నాయకుడు పట్టించుకోవాలి. స్వార్థం లేని నాయకులను గుర్తించి వారికే నా ఓటు వేస్తాను.  

–చిన్నంశెట్టి మహిజ, సుజాతనగర్‌ 

గ్రామ సమస్యలను పరిష్కరించాలి  
ఎన్నికైన నాయకుడు ప్రజల అభివృద్ధిని కాంక్షించాలి. పదవి ఉందని ప్రజాధనాన్ని విచ్చలవిడిగా సొంత ప్రయోజనాలకు వాడకూడదు. గ్రామా ల్లోని సమస్యలను నిరంతరం గుర్తించి వాటికి పరిష్కారం చూపాలి. అభివృద్ధే చేసే నాయకుడికే నా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడతాను.  

–దొడ్డి ఉపేందర్, సీతంపేట  

>
మరిన్ని వార్తలు