సర్పంచ్‌ ఎన్నికలు: బ్యాలెట్‌ పేపర్‌పై మరో గుర్తు

31 May, 2018 14:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో జూలైలో జరగనున్న పంచాయితీ ఎన్నికల్లో దేశంలో తొలిసారిగా నోటా (పై వారెవరూ కాదు) ఆప్షన్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వి.నాగిరెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇంతవరకూ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనే నోటా ఆప్షన్‌ ఉందని, తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా ఈ ఆప్షన్‌ను ప్రవేశ పెడుతున్నామన్నారు.

బ్యాలెట్‌ పేపర్‌ చివరన ‘నోటా’  గుర్తు ఉంటుందని, పైన పేర్కొన్న ఏ అభ్యర్థికీ ఓటు వేయడం ఇష్టం లేని వారు నోటాను ఎంచుకోవచ్చని ఆయన సూచించారు. నోటా వల్ల సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై ప్రజల్లో ఏమేరకు అసంతృప్తి ఉందో బయటపడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

1 నాటికి బీసీ ఓటర్ల గణన పూర్తి
ఎన్నికలు జరిగే గ్రామీణ ప్రాంతాల్లో నోటాపై ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్‌ అధికారులను ఆదేశించారు. జూలై నెలాఖరు నాటికి ఎన్నికలు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఇటీవల బెంగాల్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఘర్షణల కారణంగా 30 మంది చనిపోయారు. మన రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సమర్ధవంతంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎన్నికలు సజావుగా జరగడానికి ఇతర రాష్రాల నుంచి కూడా బలగాలను తీసుకురావాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరతామని అన్నారు. ఎన్నికలు ముగిసే వరకూ రాష్ట్రంలో కొత్తగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టొద్దని ప్రభుత్వాన్ని కోరతామన్నారు.  రిజర్వేషన్ల ప్రాతిపదికన పంచాయతీ సీట్లను కేటాయించడానికి జూన్‌ 1నాటికి బీసీ ఓటర్ల గణన పూర్తవుతుందని నాగిరెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు