విద్యార్హత డిగ్రీ.. కొత్త జిల్లాలే ప్రాతిపదిక

4 Aug, 2018 02:26 IST|Sakshi

పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు మార్గదర్శకాలు

రాతపరీక్ష ఆధారంగా జిల్లాలవారీగా నియామకాలు

గ్రామాల్లో నివాసం తప్పనిసరి... మూడేళ్లపాటు రూ. 15 వేల వేతనం

పంచాయతీరాజ్‌ కేబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయాలు  

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రాతిపదికగానే పంచాయతీ కార్యదర్శుల నియామకాలను చేపట్టాలని పంచాయతీరాజ్‌ కేబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయించింది. పంచాయతీ కార్యదర్శులకు కనీస విద్యార్హతను బ్యాచిలర్‌ డిగ్రీగా ఖరారు చేసింది. రాతపరీక్ష ఆధారంగా, జిల్లాలవారీగా నియామకాలు చేపట్టాలని పేర్కొంది. గ్రామ కార్యదర్శులకు నెలకు రూ. 15 వేల చొప్పున మూడేళ్లపాటు వేతనం ఇవ్వాలని నిర్దేశించిన సబ్‌ కమిటీ...పనితీరు సరిగా ఉంటేనే మూడేళ్ల తర్వాత వారిని క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కమిటీ సమావేశమైంది. మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్న ఈ భేటీలో నూతన పంచాయతీరాజ్‌ చట్టం అమలు, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల నియామకం, వారి బాధ్యతలు, విధులకు సంబంధించిన మార్గదర్శకాలపై కూలంకషంగా చర్చించారు. ప్రతి పంచాయతీకి ఒక గ్రామ కార్యదర్శి నియామకం, జనాభా ప్రాతిపదికన గ్రామంలో ఉద్యోగుల సంఖ్యను ఖరారు చేయాలని సబ్‌ కమిటీ నిర్ణయించింది. నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ప్రతి గ్రామానికీ ఒక కార్యదర్శిని నియమించాలని సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం మేరకు 9,355 మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల నియామకం చేపట్టనుంది.

నియామకాల్లో వయసుకు వెయిటేజీ!
గ్రామ కార్యదర్శిగా ఎంపికైన వారు కచ్చితంగా ఆయా గ్రామాల్లోనే ఉండాలనే నిబంధన పెట్టి కఠినంగా అమలు చేయాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయించింది. అవసరమైతే నియామకాల్లో వయసుకు కొంత వెయిటేజీ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులను సబ్‌కమిటీ ఆదేశించింది. వారి పదోన్నతుల్లో సీనియారిటీతోపాటు పనితీరును కూడా ప్రాతిపదికగా తీసుకునేందుకు ఉన్న అవకాశాలపైనా సబ్‌ కమిటీ చర్చించింది. పంచాయతీల్లో పనిచేసే ప్రతి కార్మికుడు, సిబ్బందికి కనీస వేతనం ఇవ్వడంతోపాటు ప్రతి నెలా వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సబ్‌ కమిటీ ఆదేశించింది. జనాభా ప్రాతిపదికన ఏయే గ్రామానికి ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉంటుందన్న సంఖ్యను నిర్దిష్టంగా తేల్చాలని సబ్‌ కమిటీ నిర్ణయించింది.

గ్రామ పంచాయతీలు కూడా ఇష్టానుసారంగా సిబ్బందిని నియమించుకునేందుకు వీలు లేకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఐదు వందల వరకు జనాభా ఉన్న గ్రామానికి ఒక పారిశుద్ధ్య కార్మికుడిని నియమించుకునేలా పంచాయతీలకు వెసులుబాటు ఇచ్చే అంశంపై సమావేశంలో చర్చించారు. వీటితోపాటు గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల ప్రాధాన్యతాక్రమాన్ని కూడా స్పష్టంగా నిర్దేశించాలని నిర్ణయించారు. అలాగే నూతన చట్టానికి అనుగుణంగా జిల్లా పంచాయతీ అధికారులు, డివిజన్‌ పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, కార్యదర్శుల సర్వీస్‌ రూల్స్‌లోనూ మార్పులు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సబ్‌ కమిటీ ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం బీసీ గణన చేపట్టాల్సిన అవసరం ఉందని పంచాయతీరాజ్‌ సబ్‌ కమిటీ అభిప్రాయపడింది. ఇందుకోసం విధివిధానాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. సమావేశంలో ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శులు శివశంకర్, రామకృష్ణారావు, పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్‌ నీతూ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు